హైదరాబాద్ ఖాళీ అవుతుంది.. మళ్లీ దసరా వచ్చిందా అన్నట్లు జనం తండోప తండాలు సొంతూళ్లకు వెళ్లిపోతున్నారు. నవంబర్ 30వ తేదీ తెలంగాణ ఎన్నికల్లో ఓటు వేసేందుకు వెళ్లిపోతున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆయా ప్రాంతాల నుంచి ఉద్యోగ, ఉపాధి కోసం హైదరాబాద్ వచ్చిన జనం.. ఓటు వేసేందుకు సొంతూళ్లకు తరలివెళుతున్నారు. దీంతో హైదరాబాద్ సిటీలోని జూబ్లీ బస్టాండ్, ఎంజీబీఎస్ బస్టాండ్లు జనంతో కిటకిటలాడుతున్నాయి.
ఈ బస్టాండ్లు మాత్రమే కాదు.. సిటీ చుట్టుపక్కల శివారు ప్రాంతాల్లోనూ జనం రద్దీ విపరీంతంగా ఉంది. ఉప్పల్, పఠాన్ చెరు, ఎల్బీనగర్, కొంపల్లి, సుచిత్ర, బోయినపల్లి, ఆల్వాల్, ఆరాంఘర్ ప్రాంతాల్లో బస్సులు, ప్రైవేట్ వెహికల్స్ కోసం వేచి ఉంటున్నారు. ఆర్టీసీ బస్సులన్నీ ఫుల్ అయ్యాయి.. దీంతో చాలా మంది శివార్లలోకి వెళ్లి ఏ బస్సు దొరికితే ఆ బస్సు ఎక్కి వెళ్లిపోతున్నారు. ఆయా నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు సైతం సొంతూరి వచ్చి ఓటు వేయాలని కోరుతుండటం.. ఊర్లో ఉన్న ఒత్తిడితో చాలా మంది ఇప్పటికే సొంతూళ్లకు చేరుకున్నారు.
నవంబర్ 30వ తేదీ కచ్చితంగా సెలవు ఇవ్వాల్సిందే అని ఎలక్షన్ కమిషన్ గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. ఐటీ కంపెనీలకు కూడా సర్క్యులర్ జారీ చేసింది. గత ఎన్నికల్లో ఐటీ కంపెనీలు సెలవు ఇవ్వని విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఈసారి కచ్చితంగా సెలవు ఇవ్వాలని స్పష్టం చేసింది. దీంతో హైదరాబాద్ సిటీలోని పెద్ద, చిన్న అన్ని ఐటీ కంపెనీలు హాలిడే డిక్లర్ చేశాయి. దీంతో ఐటీ ఉద్యోగులు వేలాది మంది సొంత వాహనాల్లోనే ఊర్లకు వెళ్లిపోతున్నారు.
ప్రతి ఎన్నికల సమయంలోనూ ఇలాంటి రద్దీ ఉన్నా.. ఈసారి కొంచెం ఎక్కువగానే ఉండటం విశేషం. సొంతూళ్ల నుంచి ఒత్తిడి కూడా అదే స్థాయిలో ఉండటంతోపాటు అన్ని కంపెనీలు సెలవులు ప్రకటించటంతో.. గతం కంటే ఎక్కువగానే సొంతూళ్లకు.. హైదరాబాద్ నుంచి వెళ్లిపోతున్నారు. దీంతో బస్టాండ్లు, రైల్వేస్టేషన్లతోపాటు సిటీ శివారు ప్రాంతాల్లో విపరీతమైన రద్దీ ఉంది. బస్సుల కోసం వేచి ఉంటున్నారు జనం.
Also Read :-డిజిటల్ మోసాలపై కఠిన చర్యలు.. 70 లక్షల మొబైల్ నంబర్లు తొలగింపు