భద్రాచలంలో.. రామయ్య నిజరూప దర్శనం

భద్రాచలం, వెలుగు :  శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాల్లో మంగళవారం భక్తులకు స్వామివారు నిజరూప దర్శనం ఇచ్చారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో క్యూలైన్లు, ఆలయ పరిసరాలు రద్దీగా మారాయి. ముందుగా ఉత్సవమూర్తులను బేడా మండపానికి తీసుకొచ్చి రామావతారంలో స్వామిని అలంకరించారు. భక్తరామదాసు చేయించిన చింతాకు పతకం, పచ్చల పతకం, రామమాడ... తదితర బంగారు ఆభరణాలను స్వామి వారికి వేశారు. చతుర్వేద విన్నపాలు, నాళాయర దివ్యప్రబంధ పారాయణం జరిగాయి. స్వామిని ఊరేగింపుగా తొలుత గోదావరి స్నానఘట్టాలు చప్టా దిగువ వరకు..  అక్కడి నుంచి మిథిలాప్రాంగణానికి తీసుకెళ్లారు. భక్తుల దర్శనం కోసం ఉంచి తిరువీధి సేవను గోవిందరాజస్వామి ఆలయం వరకు నిర్వహించారు. తిరిగి ఆలయానికి స్వామి వచ్చాక సాయంకాల ఆరాధనలు జరిగాయి. ఈ సందర్భంగా భక్తులు రామనామ సంకీర్తనలు, కోలాటాలతో స్వామిని కీర్తించారు. 

బంగారు తోరణాలు

శ్రీసీతారామచంద్రస్వామికి మంగళవారం భక్తులు రూ.2లక్షల విలువ చేసే బంగారు పూత పూసిన రెండు మకర తోరణాలను విరాళంగా ఇచ్చారు. లండన్​కు చెందిన చల్వాది శ్రీనివాసరావు, రాధికవర్ధన్​, విజయవాడకు చెందిన అందలం నారాయణ, ధనలక్ష్మి  రెండు మకర తోరణాలు స్వామి అలంకరణ కోసం అందజేశారు. 

నలుగురు అర్చకులకు ప్రమోషన్​

శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో నలుగురు అర్చకులకు ముఖ్య అర్చకులుగా ప్రమోషన్​ కల్పిస్తూ ఈవో ఎల్.రమాదేవి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆ ఉత్తర్వులను ఆలయంలో స్వామి సన్నిధిలో అర్చకులకు అందజేశారు. ప్రమోషన్​ పొందిన వారిలో కె.విష్ణువర్ధనాచార్యులు, పి.రామభద్రాచార్యులు, కె.కిరణ్​కుమార్, ఎస్​.కిరణ్​కుమారాచార్యులు ఉన్నారు.