హైదరాబాద్ ఎల్బీనగర్ మెట్రో కిటకిట.. టికెట్ కోసం క్యూ

హైదరాబాద్ ఎల్బీనగర్ మెట్రో కిటకిట.. టికెట్ కోసం క్యూ

ఓటు కోసం హైదరాబాద్ నుంచి తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లోని వివిధ జిల్లాలకు వెళ్లిన జనం తిరుగు ప్రయాణం అయ్యారు. హైవేలు అన్నీ రద్దీగా ఉండటంతో.. ఆలస్యంగా హైదరాబాద్ సిటీకి చేరుకున్నారు. మరికొంత మంది ప్రైవేట్ వాహనాల్లో సిటీకి చేరుకున్నారు. సిటీలోకి రావటానికి ఆలస్యం కావటం.. సిటీలో ట్రాఫిక్ రద్దీ ఉండటంతో.. వేలాది మంది జనం మెట్రో రైలు వైపు మొగ్గుచూపారు. ఎల్బీ నగర్ లో బస్సులు, వాహనాలు దిగి.. అక్కడ ఎల్బీనగర్ మెట్రో రైలు ఎక్కి.. సిటీలోని ఆయా ప్రాంతాలకు వెళుతున్నారు. దీంతో ఉదయం నుంచి ఎల్బీనగర్ మెట్రో స్టేషన్ కిటకిటలాడుతున్నారు. ఎల్బీనగర్ మెట్రో స్టేషన్ లో టికెట్ల కోసం పెద్ద క్యూ ఉంది. రెండు గంటలుగా.. అంటే ఉదయం 8 నుంచి 10 గంటల మధ్య ఎప్పుడు చూసినా క్యూలో 100 మంది ఉంటున్నారు.

రెగ్యులర్ గా అయితే ఎల్బీనగర్ మెట్రో స్టేషన్ లో ఇంత క్యూలు ఉండవు. ఇప్పుడు ఊర్లకు వెళ్లిన వారు ఒకేసారి రావటం.. సిటీలో ట్రాఫిక్ కు భయపడి మెట్రోను ఆశ్రయిస్తున్నారు. దీంతో ఎల్బీనగర్ మెట్రో స్టేషన్ కిటకిటలాడుతుంది. 

లాంగ్ వీకెండ్ రావటం.. దీనికితోడు సోమవారం పోలింగ్ ఉండటంతో ఓటర్లు అంతా పల్లెబాట పట్టారు. అయితే మంగళవారం నుంచి ఆఫీసులు అన్నీ ఓపెన్ అవుతుండటం.. వీక్ ప్రారంభం కావటంతో ఓటు కోసం వెళ్లిన జనం అంతా మే 13వ తేదీ ఉదయమే ఓటు వేసి మధ్యాహ్నం నుంచి బయలుదేరటం మొదలుపెట్టారు. దీంతో హైదరాబాద్ సిటీలో నాలుగు రోజుల తర్వాత ఒక్కసారిగా ట్రాఫిక్ పెరిగిపోయింది. ఈ క్రమంలోనే ఎల్బీనగర్ వరకు వచ్చిన జనం అంతా.. ఎల్బీనగర్ మెట్రో ఎక్కి సిటీలోని వారి వారి ప్రాంతాలకు వెళ్లటం కనిపించింది. ఈ క్రమంలోనే ఎల్బీనగర్ మెట్రో కిటకిటలాడుతుంది.