యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. ఆదివారం హైదరాబాద్ సహా రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. కొండకింద లక్ష్మీపుష్కరిణి, కల్యాణకట్ట, సత్యనారాయణస్వామి వ్రత మండపాలు, వాహనాల
పార్కింగ్ ఏరియా, కొండపైన బస్ బే, దర్శన, ప్రసాద క్యూలైన్లు, ప్రధానాలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిశాయి. దీంతో కాసేపు భక్తుల వాహనాలను పోలీసులు కొండపైకి అనుమతించలేదు.
రద్దీ కారణంగా స్వామివారి ధర్మ దర్శనానికి 3 గంటలు, స్పెషల్ దర్శనానికి గంటకు పైగా సమయం పట్టింది. ఆదివారం పలు రకాల పూజలు, నిత్య కైంకర్యాల ద్వారా ఆలయ ఖజానాకు రూ.54,09,081 ఆదాయం వచ్చింది. ఎండోమెంట్ మినిస్టర్ కు యాదాద్రి అర్చకుల ఆశీర్వచనం
రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖకు యాదగిరిగుట్ట దేవస్థాన అర్చకులు వేదాశీర్వచనం చేశారు.
ఆదివారం సెక్రటేరియట్‌లో తన చాంబర్ ప్రారంభోత్సవం సందర్భంగా ఆలయ ప్రధానార్చకులు కాండూరి వెంకటాచార్యుల ఆధ్వర్యంలో అర్చకులు హైదరాబాద్ వెళ్లి చాంబర్ లో ప్రత్యేక పూజలు చేసి.. మంత్రి కొండా సురేఖ మురళీ దంపతులను ఆశీర్వదించారు. అనంతరం మంత్రికి ఆలయ చైర్మన్ నరసింహమూర్తి, డిప్యూటీ ఈవో దోర్బల భాస్కర్ శర్మ లడ్డూప్రసాదం, స్వామివారి శేషవస్త్రాలు అందజేశారు.