సమ్మర్ హాలిడేస్.. వీకెండ్ కావటంతో యాదగిరి గుట్టకు పోటెత్తారు భక్తులు. ఉదయం 6 గంటల నుంచే వేలాది మంది భక్తులు శ్రీనరసింహస్వామి దర్శనం కోసం తరలివచ్చారు. దీంతో యాదాద్రి ఒక్కసారి రద్దీగా మారిపోయింది. 2024, మే 25వ తేదీ ఉదయం నుంచే భక్తులు రాకతో.. స్వామి దర్శనం మరింత ఆలస్యం అవుతుంది. ఉచిత దర్శనానికి 4 గంటల సమయం పడుతుంటే.. 300 రూపాయల ప్రత్యేక దర్శనానికి రెండు గంటల సమయం పడుతుంది.
అందరూ కార్లు, ప్రత్యేక వాహనాల్లో రావటంతో యాదగిరిగుట్టలో ట్రాఫిక్ రద్దీ పెరిగింది. కొండపైకి వెళ్లటానికి గంట సమయం వరకు పడుతుంది. పార్కింగ్ స్థలాలు అన్నీ ఫుల్ అయ్యాయి. దీంతో రోడ్లపైనే వాహనాలు నిలిపివేస్తున్నారు వాహనదారులు.
వీకెండ్ తోపాటు వేసవి సెలవులు కావటంతో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగినట్లు చెబుతున్నారు అధికారులు. రద్దీకి అనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేశామని.. మంచినీళ్లు అందుబాటులో ఉంటామని.. ప్రసాదాలు సైతం ఎక్కువ సంఖ్యలోనే ఉన్నాయని స్పష్టం చేశారు. భక్తులు అందరూ ప్రశాంతంగా స్వామివారి దర్శనం చేసుకోవాలని కోరారు అధికారులు.