- సిటీలో గత నెల 7,014 యూనిట్లు సేల్..విలువ రూ.4,288 కోట్లు
హైదరాబాద్, వెలుగు : హైదరాబాద్ రియల్టీ మార్కెట్ దూసుకెళ్తూనే ఉంది. గత నెల రూ.4,288 కోట్ల విలువైన ఇండ్లు అమ్ముడయ్యాయి. రియల్టీ కన్సల్టెన్సీ నైట్ ఫ్రాంక్ ఇండియా రిపోర్ట్ ప్రకారం...జూన్‌లో రెసిడెన్షియల్ రిజిస్ట్రేషన్లు వార్షికంగా 26 శాతం పెరిగి 7,014 యూనిట్లకు చేరుకున్నాయి. హైదరాబాద్ నివాస మార్కెట్లో --హైదరాబాద్‌తోపాటు మేడ్చల్- మల్కాజ్‌గిరి, రంగారెడ్డి సంగారెడ్డి కలిసి ఉంటాయి. జనవరి 2024 నుంచి జూన్ వరకు హైదరాబాద్‌లో 39,220 రెసిడెన్షియల్ ప్రాపర్టీల రిజిస్ట్రేషన్లు జరిగాయి.
2023లో మొదటి ఆరు నెలలతో పోలిస్తే ఇవి 15 శాతం అధికం. మొదటి ఆరు నెలల్లో నమోదైన ఆస్తుల సంచిత విలువ పెరుగుదల భారీగా ఉంది. గత జనవరి–-జూన్ మధ్య రూ. 17,490 కోట్ల విలువైన ఆస్తులు అమ్ముడవగా, ఈ ఏడాది అమ్మకాలు 39 శాతం పెరిగి రూ. 24,287 కోట్లకు చేరుకున్నాయి. వార్షికంగా ఇండ్ల ధరలు 10 శాతం వరకు పెరిగాయి.
బడ్జెట్ ఇండ్లకే ఎక్కువ గిరాకీ
జూన్ 2024లో రూ. 50 లక్షల కంటే తక్కువ ధర కేటగిరీ ఇండ్ల అమ్మకాలు భారీగా ఉన్నాయి. అయితే జూన్ 2023లో 70 శాతంగా ఉన్న బడ్జెట్ ఇండ్ల విక్రయాల రిజిస్ట్రేషన్ల వాటా జూన్ 2024 నాటికి 60 శాతానికి పడిపోయింది. రూ. కోటి, అంతకంటే ఎక్కువ ధర కలిగిన ఆస్తుల విక్రయాల రిజిస్ట్రేషన్ల వాటా జూన్ 2023లో 9 శాతంతో పోలిస్తే జూన్ 2024లో 14 శాతానికి పెరిగింది.
ALSO READ : అదానీ చేతికి జేపీ సిమెంట్?
ఇంటి కొనుగోలుదారుల్లో అధిక- విలువైన ఇండ్లపై ఆసక్తి పెరుగుతోంది. రూ.కోటి కంటే ఎక్కువ ధర కలిగిన ఇండ్ల రిజిస్ట్రేషన్లు ఈ ఏడాది జూన్‌లో వార్షికంగా 96 శాతం పెరిగాయి. ఈసారి 1,000 నుంచి 2,000 చదరపు అడుగుల విస్తీర్ణం గల ఇండ్లు మొత్తం రిజిస్ట్రేషన్లలో 68 శాతం ఉన్నాయి. చిన్న ఇళ్లకు (1,000 చదరపు అడుగుల కంటే తక్కువ) డిమాండ్ తగ్గింది. ఈ కేటగిరీ రిజిస్ట్రేషన్లు జూన్ 2023లో 21 శాతం నుంచి 2024 జూన్‌లో 18 శాతానికి తగ్గాయి. 2,000 చదరపు అడుగుల విభాగంలో 2023 జూన్‌లో 11 శాతంగా ఉన్న రిజిస్ట్రేషన్లు జూన్ 2024లో 14 శాతానికి పెరిగాయని నైట్‌ఫ్రాంక్ తెలిపింది.