ఇసుక మేటలు తొలగించుడెట్ల?

నిజామాబాద్, వెలుగు : ఇటీవల కురిసిన భారీ వర్షాలు అన్నదాతలకు తీరని నష్టాన్ని మిగిల్చాయి. వరదలతో పంట పొలాల్లో భారీగా ఇసుక మేటలు ఏర్పడ్డాయి.  దీంతో ఈ భూముల్లో పంటలు పండించే పరిస్థితి లేకుండా పోయింది. పొలాలను తిరిగి సేద్యయోగంగా మార్చడానికి అన్నదాతలు తిప్పలు పడుతున్నారు. ఆర్థికంగా పెనుభారం కానుండడంతో తమ ప్రభుత్వమే పొలాల్లో మేట వేసిన ఇసుకను తొలగించాలని కోరుతున్నారు.

జూలై నెలాఖరు ఎడతెరిపిలేని వర్షాలతో జిల్లాలో 33,429 ఎకరాల పంటకు నష్టం వాటిల్లింది. ఇందులో 298 ఎకరాల్లో ఇసుక మేటలు వేసింది. మంత్రి ప్రశాంత్​రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న బాల్కొండ నియోజకవర్గం వేల్పూర్​లో 176 ఎకరాల్లో మేటలు వేయగా, పక్కనున్న ఆర్మూర్​తో పాటు జిల్లాలో వ్యాప్తంగా 12 చోట్ల చెరువు కట్టలు తెగి122 ఎకరాల్లో ఇసుక మేట పొలాలను కప్పేసింది. గడ్డి కూడా మొలవని రీతిలో పొలాలు మారాయి. 

రైతుల కలవరం

ఇసుక మేటలతో భూమి స్వరూపమే మారడంతో  రైతులు ఆందోళన చెందుతున్నారు. సొంత ఖర్చుతో కూలీలు, ట్రాక్టర్లు పెట్టి తొలగించే ప్రయత్నం చేసిన పూర్తి చేయలేకపోయారు. ట్రిప్పునకు రూ.వెయ్యి చొప్పున ఎకరం భూమిలో 300 ట్రిప్పుల దాకా ఉన్న ఇసుకను తొలగించడానికే రూ.3 లక్షలు ఖర్చవుతుందని, ఇంత మొత్తంలో ఖర్చుచేయడం పెనుభారం అవుతుందని వాపోతున్నారు. యాసంగి సీజన్​ నాటికి భూమిని పంటకు ఎలా సిద్ధం చేయాలో అర్థం కాక హైరానా పడుతున్నారు. ప్రకృతి తమ జీవనాధారాన్ని దెబ్బతీసిందని, ప్రభుత్వమే తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

ఇసుక మేటలు తొలగించాలే

మొన్నటి వానలకు మా పొలాల్లో ఇసుక మేటలు వేసింది. దీంతో పంటలు మొత్తం ఇసుకలో మునిగి పోయాయి. మా భూముల నుంచి ఇసుక మేటలు తీయించేందుకు తిప్పలైతుంది. ఇప్పటికే పంట పెట్టుబడి లాసయినమ్. మళ్లా ఇసుక తీయించుడు కానీ పని. గవర్నమెంటోళ్లు నష్టపరిహారం ఇచ్చే బదులు మా భూములు బాగు చేస్తే చాలు.

– మాడపాటి పటేల్, పడిగల, వేల్పూర్​