
హైదరాబాద్: గ్రూప్-1 పరీక్షలో భారీ స్కామ్ జరిగిందని బీఆర్ఎస్ నేత, హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. మొత్తం 21,093 మంది మెయిన్స్ పరీక్ష రాస్తే.. 21,103 మందికి ఫలితాలు ఎలా ఇచ్చారు..? ఆ 10 మంది అదనంగా ఎలా వచ్చారని ప్రశ్నించారు. పరీక్ష రాసిన వాళ్ళకంటే ఎక్కువ మందికి రిజల్ట్ ఇస్తారని నిలదీశారు. ఉర్దూ మీడియంలో మొదటగా 9 మంది అని చెప్పి.. తర్వాత 10 అంటున్నారు.. ఒక్కరు ఎలా పెరిగారని క్వశ్చన్ చేశారు. యూపీఎస్సీలో ప్రిలిమ్స్‌కు, మొయిన్స్ కు ఒకేటే హాట్ టికెట్ ఉంటుందని.. మరీ ఇక్కడ ప్రిలిమ్స్, మెయిన్స్‌కు ఎందుకు వేర్వేరుగా హాల్ టికెట్ నెంబర్లు ఇచ్చారన్నారు.
కమిషన్లు తీసుకోని ఫలితాలు ఇచ్చారని ఆరోపించారు. 438 సిరీస్‌లో ఉన్న వారందరికీ ఒకే మార్కులు ఎలా వస్తాయన్నారు. కాంగ్రెస్ నేత రాములు నాయక్ కోడలికి మల్టీ జోన్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. తన కోడలు పరీక్షల కోసం 18 గంటలు చదివిందని రాములు నాయక్ చెప్పారు. ఆయన కోడలు మాత్రం రోజు 5 గంటలు చదివానని చెప్పింది. ఇద్దరిలో ఎవరు చెప్పేది నిజమని ప్రశ్నించారు. కోటి ఉమెన్స్ కాలేజ్‌లో అమ్మాయిలు మాత్రమే పరీక్షా రాశారని.. ఈ సెంటర్లో పక్కా స్కామ్ జరిగిందని ఆరోపించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్ని విభాగాల్లో ఫెయిల్ అయ్యిందని.. స్కాములు చేస్తోందని అన్నారు.
►ALSO READ | ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన దాసోజు శ్రవణ్
గ్రూప్ 1 అవకతవకలపై కేంద్రమంత్రి, బీజేపీ నేత బండి సంజయ్ ఎందుకు నోరు విప్పడం లేదని ప్రశ్నించారు. బీజేపీకి నిరుద్యోగుల మీద ప్రేమ ఉంటే సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. బండి సంజయ్ సీఎం రేవంత్ రెడ్డితో లాలూచీ పడ్డారని.. అందుకే సెలైంట్‌గా ఉన్నారన్నారు. కాంగ్రెస్, బీజేపీ మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని ఆరోపించారు. గ్రూప్ 1 అవకతవకలపై జ్యూడిషియల్, సీబీఐ విచారణ జరిపాలని డిమాండ్ చేశారు. గ్రూప్ 1ను రద్దు చేయాలన్నారు.