- మొక్కుబడిగా స్పెషల్ క్లాసులు
- టెన్త్ రిజల్ట్స్‌పై హెడ్మాస్టర్ల అయోమయం
- టీచర్ల సర్దుబాటుతోనూ తీరని సమస్య
- పట్టించుకోని విద్యాశాఖ అధికారులు
వనపర్తి టౌన్, వెలుగు: ఉమ్మడి పాలమూరు జిల్లా విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యం వల్ల పదో తరగతి స్టూడెంట్లకు పాఠాలు చెప్పేవారు కరువయ్యారు. అకడమిక్ఇయర్ ప్రారంభం నుంచే గవర్నమెంట్ హైస్కూళ్లల్లో భారీగా సబ్జెక్ట్ టీచర్ల కొరత ఉన్నా.. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంలో ఆఫీసర్లు విఫలమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా రెండేళ్లుగా విద్యా వలంటీర్ల ను రిక్రూట్మెంట్ చేయకపోవడంతో జిల్లాలో హైస్కూల్విద్య అస్తవ్యస్తంగా మారింది. జిల్లా విద్యాశాఖ అధికారులు మాత్రం టెన్త్ స్టూడెంట్లకు స్పెషల్ క్లాసుల పేరుతో మొక్కుబడిగా యాక్షన్ ప్లాన్ ను రిలీజ్ చేసి చేతులు దులుపుకున్నారు. అరకొర టీచర్లతో టెన్త్సిలబస్ కొన్ని సబ్జెక్ట్ లు 60 శాతం పూర్తయినా, టీచర్లు లేని సబ్జెక్ట్ లు ఇంకా స్టార్ట్ కాలేదు.
ఉమ్మడి జిల్లాలో భారీగా ఖాళీలు..
వనపర్తి జిల్లాలో గవర్నమెంట్, జడ్పీ, మోడల్, కేజీబీవీ, ఇలా వివిధ మేనేజ్ మెంట్లలో మొత్తం 196 హైస్కూళ్లు ఉండగా వాటిలో 53,728 మంది స్టూడెంట్లు చదువుకుంటున్నారు. 85 గవర్నమెంట్ హైస్కూళ్లు ఉండగా.. ఇటీవల 16 స్కూళ్లు యూపీఎస్ నుంచి హైస్కూళ్లుగా అప్ గ్రేడ్ కావడంతో ఈ సంఖ్య 101 కి చేరింది. ఈ హైస్కూళ్లల్లో ప్రతి స్కూల్ లో రెండు నుంచి 4 సబ్జెక్ట్ ల వరకు టీచర్లు లేకపోవడంతో టెన్త్స్టూడెంట్ల పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. నాగర్ కర్నూల్ -జిల్లాలో 139 హై స్కూల్స్ ఉండగా -7, 913 మంది టెన్త్స్టూడెంట్లు ఉన్నారు. అయితే -139 మంది జీహెచ్ఎంలు, 1,782 మంది టీచర్స్ ఉండాలి. కానీ-139 మందికి 60 మంది మాత్రమే రెగ్యులర్ జీహెచ్ఎంలు ఉన్నారు. 79 మంది స్కూల్ అసిస్టెంట్లను ఇన్చార్జి జీహెచ్ఎం లుగా నియమించడంతో వీరు స్టూడెంట్లకు పాఠాలు చెప్పడం లేదు. మొత్తం 279 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. నారాయణపేట జిల్లాలో 76 హై స్కూల్స్ ఉండగా 8,404 మంది టెన్త్ఎగ్జామ్స్ రాస్తున్నారు.76 మంది జీహెచ్ఎంలకు 27 మంది మాత్రమే ఉన్నారు. మిగిలిన వారు ఇన్చార్జిలుగా ఉన్నారు.11 మంది ఎంఈవో లకు ఒక్కరు మాత్రమే రెగ్యులర్ ఉండగా, హైస్కూళ్లలో 126 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గద్వాల జిల్లాలో 178 హై స్కూళ్లు ఉండగా, 8,523 మంది టెన్త్ ఎగ్జామ్స్ రాస్తున్నారు. 72 మంది గెజిటెడ్ హెచ్ఎంలలకు 37 వర్కింగ్ లో 35 మంది ఖాళీ పోస్టులు ఉన్నాయి. జిల్లాలో వివిధ సబ్జెక్టులకు సంబంధించి 329 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మహబూబ్ నగర్ జిల్లాలో 136 హైస్కూళ్లు ఉండగా, ఈ ఏడాది 12,800 టెన్త్ఎగ్జామ్స్రాస్తున్నారు. జీహెచ్ఎంలు 119 పోస్టులకు గాను 40 ఖాళీగా ఉన్నాయి.
పట్టించుకోని అధికారులు
అకడమిక్ ఇయర్ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు అనేక స్కూళ్లల్లో కొన్ని సబ్జెక్టులకు టీచర్లు లేక టెన్త్స్టూడెంట్లు కనీసం ఆ బుక్స్కూడా తెరవలేదు. స్టూడెంట్ల పరిస్థితులను అంచనా వేసి టీచర్లను సర్దుబాటు చేయాల్సిన అధికారులు ఆ సంగతే మరిచిపోయారు. వనపర్తి డీఈవో రవీందర్ ఎప్పుడూ గవర్నమెంట్ల స్కూళ్లను విజిట్ చేయడం గానీ, సమస్యల పరిష్కారంపై చొరవ తీసుకున్న దాఖలాలు లేవు. పైగా మహబూబ్ నగర్ జిల్లాకు కూడా ఇన్చార్జి కావడంతో వనపర్తి కి ప్రభుత్వ కార్యక్రమాలకు మాత్రమే హాజరై తిరిగి మహబూబ్ నగర్ కు వెళ్తుండడంతో వనపర్తి స్కూళ్లలో సమస్యలు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి.
అస్తవ్యస్తంగా టీచర్ల సర్దుబాటు
ప్రభుత్వం ఇటీవల స్టూడెంట్ల సంఖ్య ఆధారంగా టీచర్లను సర్దుబాటు చేయాలని ఆదేశాలిచ్చింది. కానీ వనపర్తి జిల్లాలో విద్యాశాఖ ఆఫీసర్లు తమకు ముడుపులు ఇచ్చిన వారికి అనుకూలంగా స్కూళ్లలో సర్దుబాటు చేశారన్న విమర్శలు వస్తున్నాయి. జిల్లాలో సుమారు 105 మంది టీచర్లను సర్దుబాటు చేసినట్లు డీఈవో ఆఫీస్అధికారులు చెబుతున్నా పక్కా సమాచారం ఇస్తలేరు. టీచర్ల అవసరం ఉన్న స్కూళ్లను పట్టించుకోకుండా, స్టూడెంట్ల సంఖ్యను చూపుతూ జిల్లా, మండల కేంద్రాలకు సర్దుబాటు చేసి చేతులు దులుపుకున్నారు. దీంతో టీచర్ల సర్దుబాటు పూర్తయినా హైస్కూళ్లలో టీచర్ల సమస్య తీరలేదు. అరకొర టీచర్లు, పూర్తి కాని సిలబస్ తో ఈ అకడమిక్ ఇయర్ టెన్త్ రిజల్ట్స్ ఎలా ఉంటాయోనన్న ఆందోళన అందరిలో ఉంది. ఈ విషయమై డీఈవో రవీందర్ ను వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఆయన స్పందించలేదు.
హెడ్మాస్టర్లు ఒత్తిడికి గురవుతున్నరు
జిల్లాలో ని ప్రభుత్వ హైస్కూళ్లల్లో ఒక్కో స్కూల్ లో రెండు నుంచి నాలుగు సబ్జెక్ట్ లకు టీచర్లు లేరు. విద్యావలంటీర్లు కూడా లేకపోవడంతో ఆయా సబ్జెక్ట్ ల సిలబస్ స్టార్ట్ కాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో టెన్త్ రిజల్ట్స్ఎలా ఉంటాయోనని హెచ్ఎంల తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. – మద్దిలేటి, జీహెచ్ఎం అసోషియేషన్ , జిల్లా అధ్యక్షుడు, వనపర్తి
సిలబస్ ఎట్ల పూర్తి చేయాలి
జిల్లాలోని అన్ని మండలాల హైస్కూళ్లలో టీచర్ల కొరత ఉంది. ఈ విషయాన్ని జీహెచ్ ఎం అసోషియేషన్ ద్వారా డీఈవో దృష్టికి తీసుకెళ్లాం. ప్రస్తుతం స్పెషల్ క్లాసుల యాక్షన్ ప్లాన్ ప్రకారం టెన్త్ స్టూడెంట్లను టీచర్లు చదివిస్తున్నారు. కనీసం మిగిలిన4 నెలల కాలానికైనా ఎస్జీటీ టీచర్ల ను సర్దుబాటు చేసేందుకు అధికారులు చొరవ చూపాలి. – గణేశ్ కుమార్, జీహెచ్ఎం అసోషియేషన్, జనరల్ సెక్రటరీ, వనపర్తి