హైదరాబాద్ మహా నగరంలోని ట్యాంక్ బండ్ పై 11 ఎకరాల స్థలంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం నిర్మాణ పనులు చకాచకా సాగుతున్నాయి. హుస్సేన్ సాగర్ ఒడ్డున ఎన్టీఆర్ గార్డెన్స్ సమీపంలో రూ.150 కోట్లు వెచ్చించి నిర్మిస్తున్నారు. ఈ భారీ విగ్రహంలో భాగమైన అంబేడ్కర్ బూట్లను ఇటీవలే హైదరాబాద్ కు తరలించారు. అంబేడ్కర్ భారీ విగ్రహానికి అమర్చనున్న ఈ బూట్లు ఇప్పుడు ప్రత్యేక ఆకర్షణగా మారాయి. వీటిని దిల్లీలో తయారు చేయించి ప్రత్యేక వాహనాల్లో నగరానికి తీసుకొచ్చారు. మొత్తం విగ్రహం ఎత్తు 125 అడుగులు కాగా... ఈ ఒక్క బూట్ల ఎత్తే 12అడుగుల ఎత్తు ఉండడం స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తోంది. అయితే ఈ విగ్రహ తయారీకి 791 టన్నుల స్టీలు, 9 టన్నుల కంచు ఉపయోగించినట్టు అధికారులు వెల్లడించారు. ఇదిలా ఉండగా మొత్తం విగ్రహం పూర్తి కావడానికి దాదాపు మూడు నెలలు పడనున్నట్టు సమాచారం.