ఒడిశా నుంచి తెలంగాణకు భారీగా గంజాయి సరఫరా

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీగా గంజాయి పట్టుబడింది. ఇల్లందు మండలం బొజ్జాయిగూడెం దగ్గర రెండు ద్విచక్ర వాహనాల్లో అక్రమంగా హైదరాబాద్ కు తరలిస్తున్న 15 కేజీల గంజాయిని ఎక్సైజ్ ఎన్ఫోర్స్ మెంట్ అధికారులు పట్టుకున్నారు. ఇందులో భాగంగా ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. 

హైదరాబాద్ కు చెందిన నిఖిల్ కుమార్, శ్రీకాంత్ గౌడ్ ఒడిశా నుంచి 15 కేజీల గంజాయిని.. కిలో 2వేల చొప్పున కొనుగోలు చేసి, హైదరాబాద్ లో 100 గ్రాములు వెయ్యి రూపాయల చొప్పున విక్రయించేందుకు తరలిస్తున్నారని పోలీసులు తెలిపారు. మరో ద్విచక్ర వాహనంపై హనుమకొండ జిల్లాకు చెందిన సునీల్ 4  కేజీల 200 గ్రాముల గంజాయిని వరంగల్ కు తరలిస్తున్నారని పేర్కొన్నారు. ముగ్గురు వ్యక్తులను రిమాండ్ కు తీసుకు వెళుతున్నామని పోలీసులు తెలిపారు.