ములుగు జిల్లాలో ఇసుక లారీల వల్ల ట్రాఫిక్ సమస్య

ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో ఇసుక లారీల వల్ల ట్రాఫిక్ సమస్య తలెత్తుతోంది. భద్రాచలం – వెంకటాపురం రాష్ట్ర రహదారిపై ఇసుక లారీలను ఇష్టారాజ్యంగా నిలుపుతున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇసుక క్వారీల్లో ఉన్న ఇసుకను లోడ్ చేసేందుకు మూడు కిలోమీటర్ల పొడవునా లారీలను ఇష్టానుసారంగా నిలుపుతున్నారని ఆరోపించారు. ఇసుక లారీల ఇష్టారాజ్యం వల్ల ఇతర వాహనాలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

అడ్డంగా ఇసుక లారీలు నిలిపేస్తున్న సమయాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోందని.. ట్రాఫిక్  క్లియర్ చేసే వరకు చాలా అవస్థలు పడుతున్నామని వాహనదారులు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని స్థానికులు  డిమాండ్ చేస్తున్నారు. ఇసుక లోడ్ కోసం వచ్చే లారీలు నిలిపేందుకు ఇతర ఏర్పాట్లు చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.