జీహెచ్ఎంసీలో భారీ ట్రాన్స్ఫర్ లకు రంగం సిద్ధం అయినట్లు తెలుస్తోంది. ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే పెద్ద మొత్తంలో అధికారుల బదిలీలు ఉండబోతున్నాయని జోరుగా ప్రచారం జరుగుతుంది. అధికారుల వివరాలను అందజేయాలని అడిషనల్ కమిషనర్ కు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్.
గ్రేటర్ లో చాలా ఏళ్ల తర్వాత భారీగా బదిలీలకు అధికారులు సమాయత్తం అవుతున్నారు. ఒక్క చోట మూడేళ్ల కంటే ఎక్కువ రోజుల నుంచి పని చేస్తున్నవారిని ట్రాన్స్ఫర్ చేయాలని నిర్ణయించారు జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్. గత ప్రభుత్వ హయంలోని నాయకులతో అధికారులకు ఉన్న పరిచయాలతో ఒకే చోట తిష్ట వేసి కూర్చున్నారు. అందులో కొంతమంది అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నవారిని ట్రాన్స్ఫర్ చేసేందుకు అప్పటి ప్రభుత్వం సాహసం చేయలేదు. ఒక కంప్యూటర్ ఆపరేటర్, శానిటేషన్ సూపర్ వైజర్ ను ట్రాన్స్ఫర్ చేస్తే అప్పటి మున్సిపల్ మంత్రి పెషీ నుంచి లేదా CMO నుంచి కాల్ వస్తుండేదంటున్నారు ఉన్నతాధికారులు. దీంతో జూనియర్ అసిస్టెంట్ ను ట్రాన్స్ఫర్ చేయడానికి కూడా ప్రయత్నం చేయలేదంటే అప్పటి పరిస్థితి ఎలా ఉండేదో అర్థం చేసుకోవచ్చు.
ఇప్పుడు ప్రభుత్వం మారడంతో అవినీతికి పాల్పడుతున్నవారు, మూడేళ్ల కంటే ఎక్కువ రోజుల నుంచి ఒకే సీటును పట్టుకొని వేలాడుతున్నవారిని ట్రాన్స్ఫర్ చేసేందుకు జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ సిద్ధమయ్యారు. ఇప్పటికే అడిషనల్ కమిషనర్ ను ఆ లిస్టును ప్రిపేర్ చేసి తనకు ఇవ్వాలని ఆదేశించారు. దీంతో ప్రతి విభాగంలో ఎవరు ఎన్ని రోజుల నుంచి పని చేస్తున్నారు, ఏ హోదాలో పనిచేస్తున్నారు, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు ఎవరు అనే అంశాలపైన అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. ఎలక్షన్ కోడ్ ముగిసే లోపే ఈ నివేదికను రొనాల్డ్ రాస్ కు అడిషనల్ కమిషనర్ అందజేయనున్నారు.
జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం పర్మినెంట్, ఔట్ సోర్సింగ్ లేదా కాంట్రాక్టు సిబ్బంది మొత్తం కలిపి 26 నుంచి 28 వేల మంది ఉంటారు. 18వేల 5వందల శానిటేషన్ వర్కర్లు, 950 సూపర్ వైజర్లు, 500 నుంచి 800 మంది ఆపరేటర్లు, 500 మంది జూనియర్, సీనియర్ అసిస్టెంట్లు, 400 మంది సూపరింటెండెంట్లు, సుమారు 100 మది అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్లు, 20 మంది జాయింట్ కమిషనర్లు, 20మంది మెడికల్ ఆఫీసర్లు, 30 మంది డిప్యూటీ కమిషనర్లు..ఇలా వీరందరినీ ఎలక్షన్ కోడ్ ముగిసిన తర్వాత ట్రాన్స్ఫర్ చేసేందుకు రంగం సిద్ధమవుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో జరుగుతున్న పరిణామాలు చూస్తే అర్థమౌవుతుంది. జీహెచ్ఎంసీలో పూర్తిగా బదిలీలు జరిగితే అవినీతికి చేక్ పడుతుందని కమిషనర్ భావిస్తున్నారు. ఎలక్షన్ కోడ్ ముగిసిన తర్వాత వారం రోజుల్లోనే బదిలీలు జరుగుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు.