
- హెల్త్ కార్డులిచ్చి ఇండ్ల స్థలాలు కేటాయించాలి
- హైదరాబాద్ కలెక్టరేట్ ముందు హెచ్ యూజే నిరసన
బషీర్బాగ్, వెలుగు: జర్నలిస్ట్ ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ (హెచ్ యూజే -టీడబ్ల్యూజేఎఫ్) నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైదరాబాద్ లో పనిచేస్తున్న జర్నలిస్టులందరికీ ఇండ్ల స్థలాలు కేటాయించాలని కోరారు.సోమవారం లక్డికాపుల్ వద్ద ఉన్న హైదరాబాద్ కలెక్టర్ కార్యాలయం ఎదుట హెచ్ యూజే ఆధ్వర్యంలో జర్నలిస్టులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.
హెచ్ యూజే అధ్యక్ష కార్యదర్శలు బి.అరుణ్ కుమార్ బి జగదీశ్వర్, వర్కింగ్ ప్రెసిడెంట్ గండ్ర నవీన్, కోశాధికారి బి రాజశేఖర్ మాట్లాడుతూ.. జర్నలిస్టులు అనేక సమస్యలతో బాధ పడుతున్నారని చెప్పారు. సకాలంలో అక్రిడిటేషన్ కార్డులు కూడా పొందలేకపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అక్రిడిటేషన్ కార్డుల గడువును మరోసారి పొడిగించకుండా కొత్త కార్డులను ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్డులు ఇవ్వడం వల్ల ప్రభుత్వంపై ఆర్థిక భారం ఉండబోదని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం త్వరగా నిర్ణయం తీసుకుని అర్హులైన జర్నలిస్ట్ లకు అక్రిడిటేషన్ కార్డులను ఇవ్వాలని కోరారు.
రివ్యూ పిటిషన్ వేయాలి
జర్నలిస్టులకు ఇండ్ల స్థలాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని సూచించారు. బీపీఎల్ కింద గుర్తించి జర్నలిస్ట్ లకు న్యాయం చేయాలన్నారు. సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేసి వాదనలను వినిపించి జర్నలిస్టులకు న్యాయం చేయాలని కోరారు. లేనిపక్షంలో కొత్త విధానం ద్వారా జర్నలిస్ట్ లకు ఇండ్లస్థలాలు ఇవ్వాలన్నారు. జర్నలిస్ట్ ఆరోగ్య కార్డులు రాష్ట్రంలోని అన్ని ప్రయివేటు, కార్పొరేట్ ఆస్పత్రుల్లో పనిచేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
జర్నలిస్ట్ బీమా పథకాన్ని ప్రవేశపెట్టాలని కోరారు. కేరళతో పాటు ఇతర రాష్ట్రాల్లో ఉన్నట్టుగా జర్నలిస్ట్ లకు పెన్షన్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. జర్నలిస్ట్ లపై దాడులను అరికట్టేందుకు పటిష్ఠమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తిచేశారు. జర్నలిస్ట్ ల రక్షణ చట్టం తేవాలని డిమాండ్ చేశారు. మహిళా జర్నలిస్ట్ లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరారు. మహిళా జర్నలిస్టులకు భద్రత కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అనంతరం హెచ్ యూజే ప్రతినిధి బృందం హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టిని కలిసి వినతి పత్రం సమర్పించారు.
జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని కలెక్టర్.. హెచ్ యూజే నాయకులకు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రాధిక, హెచ్ యూజే ఉపాధ్యక్షులు జి వీరేశ్, బి .కాలేబ్, జి .రేణయ్య, సంయుక్త కార్యదర్శులు జె క్రాంతి, ఎస్ మాధవరెడ్డి, పి లక్ష్మణ్ రావు, తలారి శ్రీనివాస్ రావు, జాతీయ కౌన్సిల్ సభ్యులు సీహెచ్ మధుకర్, కార్యవర్గ సభ్యులు కె లలిత, పి విజయ, సంపత్, శ్రీధర్ మురహరి, కె వెంకట స్వామి, డీఎస్ సుభాష్ కృష్ణ, పి.రాజేశ్ కుమార్, బి.ముత్యాలు, సభ్యులు శిల్ప, లహరి పాల్గొన్నారు.