హెచ్​యూఎల్​ లాభం అప్.. క్యూ4 ప్రాఫిట్​ రూ. 2,601 కోట్లు

హెచ్​యూఎల్​ లాభం అప్.. క్యూ4 ప్రాఫిట్​ రూ. 2,601 కోట్లు

న్యూఢిల్లీ: సబ్బులు, షాంపూలు, టూత్​పేస్టుల తయారీ రంగంలోని హిందుస్తాన్​ యూనిలివర్​ లిమిటెడ్​ నికర లాభం ఈ ఏడాది మార్చి క్వార్టర్లో 12.74 శాతం పెరిగి రూ. 2,601 కోట్లకు చేరింది. ఈ క్వార్టర్లో అమ్మకాలు పెరగడంతోపాటు, మార్జిన్స్​ మెరుగుపడ్డాయని కంపెనీ వెల్లడించింది. అంతకు ముందు ఏడాది జనవరి–మార్చి క్వార్టర్లో హిందుస్తాన్​ యూనిలివర్​కు రూ. 2,307 కోట్ల లాభం వచ్చింది. ఇక తాజా క్వార్టర్లో సేల్స్​ రెవెన్యూ కూడా 10.83 శాతం గ్రోత్​తో రూ. 14,926 కోట్లయిందని పేర్కొంది.

టర్నోవర్​లో 11 శాతం గ్రోత్​తో పాటు, సేల్స్​ వాల్యూమ్​లో 4 శాతం గ్రోత్​తో మెరుగైన పనితీరు కనబరచగలిగినట్లు హిందుస్తాన్​ యూనిలివర్​ లిమిటెడ్​ ఈ స్టేట్​మెంట్లో తెలిపింది. గ్రాస్​ మార్జిన్లు 129 బేసిస్​ పాయింట్లు మెరుగయ్యాయని, బ్రాండ్స్​లో భారీగా పెట్టుబడులు పెడుతున్నామని వివరించింది. ఇబిటా మార్జిన్స్​23.7 శాతంగా రికార్డయ్యాయని, ఇది ఆరోగ్యకరమైనదని పేర్కొంది. మార్చి క్వార్టర్లో హోమ్​కేర్​ సెగ్మెంట్​ 18.84 శాతం గ్రోత్​తో రూ. 5,637 కోట్ల అమ్మకాలు సాధించి అదరగొట్టిందని హిందుస్తాన్​ యూనిలివర్​ వెల్లడించింది. ఫ్యాబ్రిక్​ వాష్​, హౌస్​ హోల్డ్​  కేర్​ సెగ్మెంట్లు రెండూ రెండంకెల గ్రోత్​ రికార్డు చేసినట్లు పేర్కొంది. పర్సనల్ కేర్​​, బ్యూటీ  ​విభాగంలో   లక్స్​ బ్రాండ్​ పటిష్టమైన పనితీరు  కనబరిచినట్లు వివరించింది.

మార్చి 2023 తో ముగిసిన పూర్తి ఏడాదికి హెచ్​యూఎల్​ కన్సాలిడేటెడ్​ రెవెన్యూ రూ. 59,443 కోట్లయితే, నికర లాభం రూ. 10,143 కోట్లు. ఎఫ్​ఎంసీజీ మార్కెట్​ వాల్యూమ్స్​ తగ్గినప్పటికీ తమ టాప్​లైన్​ (టర్నోవర్​)లో రూ. 8 వేల కోట్ల గ్రోత్​ సాధించగలిగామని హెచ్​యూఎల్​ మేనేజింగ్​ డైరెక్టర్​ సంజీవ్​ మెహతా చెప్పారు.