శాస్త్రీయ పరిజ్ఞానంతోనే మానవ వికాసం

శాస్త్రీయ పరిజ్ఞానంతోనే మానవ వికాసం

భారతదేశ ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త సర్ చంద్రశేఖర వెంకట రామన్ (సి.వి.రామన్) తాను కనుగొన్న 'రామన్ ఎఫెక్ట్' అనే కొత్త సైంటిఫిక్ ఆవిష్కరణను 1928వ సంవత్సరంలో ఫిబ్రవరి 28న ప్రకటించడం జరిగింది. ఈ కొత్త ఆవిష్కరణకు 1930 సంవత్సరంలో భౌతిక శాస్త్రంలో సి.వి.రామన్‌కు నోబెల్ బహుమతి వచ్చింది. సి.వి.రామన్ సైన్స్ రంగంలో నోబెల్ బహుమతిని అందుకున్నాడు. మొదటి భారతీయుడిగా నిలిచాడు. దీనికి గుర్తుగా ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 28న జాతీయ సైన్స్ దినోత్సవాన్ని జరుపుకుంటారు. 

2025 జాతీయ సైన్స్ దినోత్సవం థీమ్ 'అభివృద్ధి చెందిన భారతదేశం కోసం సైన్స్, యువత ఆవిష్కరణలో ప్రపంచ నాయకత్వం కోసం భారతీయుని శక్తిమంతం చేయడం'. ఈ థీమ్ ముఖ్య ఉద్దేశందేశ అభివృద్ధికి సైన్స్ ఆవిష్కరణలను రూపొందించడంలో యువ భారతీయులను ప్రముఖంగా చేయడం.

 సి.వి.రామన్ నవంబర్ 7, 1888న తమిళనాడులోని తిరుచిరాపల్లిలో జన్మించారు. ఆయన తండ్రి గణితం, భౌతిక శాస్త్రంలో లెక్చరర్ గా పనిచేశారు, ఆయన చిన్నప్పటినుంచి మంచి విద్యావాతావరణం గల కుటుంబంలో పెరిగారు. సర్ సి.వి.రామన్ - నవంబర్ 21, 1970న బెంగళూరులో మరణించారు.

'రామన్ ఎఫెక్ట్' ఎలా కనుగొన్నారు?

1921వ సంవత్సరంలో సర్ సి.వి.రామన్ ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన విశ్వవిద్యాలయాల కాంగ్రెస్‌లో పాల్గొని తిరుగు ప్రయాణంలో మధ్యధరా సముద్రం మీదుగా ఓడలో వస్తున్నప్పుడు తన చుట్టూ ఉన్న సముద్రపు నీరు నీలిరంగులో ఉండటాన్ని గమనించాడు. దాని ఫలితంగానే 'రామన్ ఎఫెక్ట్' అనే విషయం కనుగొనబడింది. 

వాతావరణంలోని పదార్థాలు నీలి కాంతిని విరజిమ్మటం వలన ఆకాశం నీలిరంగులో కనిపిస్తుందని, ఆకాశపు నీలిరంగు సముద్రంలో ప్రతిబింబించటం వలన సముద్రపు నీరు నీలిరంగు కనిపించవచ్చని భావించేవారు. ఈ భా వన తప్పని రామన్ నిరూపించాడు. 

సముద్రంలోని నీటి పదార్థాల మీద సూర్యరశ్మి పడినప్పుడు, సూర్యరశ్మిలోని ఇతర రంగులను నీటి రంగులు శోషించుకుని, నీలి రంగును, ఇతర రంగుల కంటే ఎక్కువగా వెదజల్లటం వలన సముద్రం నీరు నీలం రంగులో కనిపిస్తుందని సి.వి. రామన్ వివరించారు. ఈ దృగ్విషయాన్ని 'రామన్ ప్రభావం' (రామన్ ఎఫెక్ట్) అని పిలుస్తారు. 

 ఒక నిర్దిష్ట తరంగదైర్ఘ్యం గల కాంతిని ఒక పదార్థంపై పడేటట్టు చేస్తే ఆ పదార్థం వెదజల్లే కాంతి తరంగదైర్ఘ్యం, ఆ పదార్థంపై పడిన కాంతి తరంగ దైర్ఘ్యం కంటే తక్కువ లేదా ఎక్కువగా ఉండడాన్ని రామన్ గమనించాడు. మరో పదార్థంపై పడిన కాంతి తరంగ దైర్ఘ్యంకి, పదార్థం వెదజల్లే కాంతి తరంగ దైర్ఘ్యంకి మధ్య తేడా, ఉపయోగించిన పదార్థంపై ఆధారపడుతుంది అని. మన దైనందిన జీవితంలో వైద్యశాస్త్రం, జీవశాస్త్రం, ఫోరెన్సిక్స్, మెటీరియల్ సైన్స్, పర్యావరణం, రిమోట్ సెన్సింగ్, గ్రహ అన్వేషణ మొదలగు రంగాలలో రామన్ ఎఫెక్ట్ విరివిగా ఉపయోగపడుతుంది. 

సైన్స్ అనేది మన చుట్టూ ఉండే పరిసరాలలోనే ఉంటుంది. టెస్ట్ బుక్స్‌కు మాత్రమే పరిమితం కాదు. పరిసరాలకు సంబంధించిన సైన్స్, సామాజిక విషయాలను గమనించి వాటిపై పరిశోధనలు చేయడం ద్వారా సైన్స్ అభివృద్ధి చెందుతుంది. కాబట్టి విద్యార్థులు తమ చుట్టూ ఉన్న పరిసరాలనే అతి పెద్ద ప్రయోగశాలగా భావించి తాము గమనించిన విషయాలను శాస్త్రీయ దృక్పథంతో అనేక కొత్త సైన్స్ విషయాలు ఆవిష్కారమవుతాయి.    

సైన్స్, మానవ అభివృద్ధికి మధ్య సంబంధం

జీవశాస్త్రం.. వైద్యరంగంలో, సైన్స్ రంగంలో పరిశోధనలు ప్రాణాలను రక్షించే చికిత్సలు, టీకాలు, రోగ నిర్ధారణ సాధనలు, మెరుగైన ఆరోగ్య సంరక్షణ సాధనాలు అభివృద్ధికి దారి తీసింది. ఇది మనిషి జీవితకాలం, మనిషి జీవన ప్రమాణాలను పెంచింది. కొత్త సాంకేతిక ఆవిష్కరణలు, సాంకేతిక రంగ అభివృద్ధికి దోహదపడుతున్నాయి. 

ఉదాహరణకు టెలి కమ్యూనికేషన్, రవాణా, ఇంధన ఉత్పత్తి , వ్యవసాయం మొదలగు రంగాలలో కొత్త ఆవిష్కరణలు మానవాళి రోజువారీ జీవితాన్ని సుఖవంతం చేశాయి. మనస్తత్వ శాస్త్రం, న్యూరాలజీ వంటి రంగాలలో మానవ ప్రవర్తన, అభివృద్ధి, జ్ఞానం మొదలగు వాటిని అధ్యయనం చేయడానికి శాస్త్రీయ పరిశోధనలు ఉపయోగిస్తున్నారు. శాస్త్రీయ, సాంకేతిక ఆవిష్కరణలు కొత్త పరిశ్రమల అభివృద్ధికి తోడ్పడతాయి. 

రోజువారీ జీవితంలో సైన్స్ ప్రాముఖ్యత

మనం రోజు ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి వెళ్ళడానికి వాడుకునే మోటార్ వాహనాలు, అదేవిధంగా ఆహార పదార్థాలు, ఎల్.పి.జి. గ్యాస్, రోజూ వాడే సబ్బులు, టూత్ పేస్టులు, సెల్ ఫోన్లు, కృత్రిమ మేధస్సు, మనిషి నివసించే ఇల్లు, ధరించే బట్టలు మొదలగునవి అన్నీ కూడా సైన్స్ సాధించిన అభివృద్ధి ఫలితమే. 

సైన్స్ రంగంలో అభివృద్ధి చెందిన దేశాలలో ప్రజలు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు. అదేవిధంగా విద్య, ఆరోగ్యం ఇతర జీవన ప్రమాణాలు కూడా చాలా మెరుగుగా ఉంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే సై న్స్ అభివృద్ధితోనే అన్ని రంగాలలో మానవ అభివృద్ధి సాధ్యం అవుతుంది. కాబట్టి,ప్రజలందరూ శాస్త్రీయ పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి.

- డా.శ్రీధరాల రాము,ఫ్యాకల్టీ ఆఫ్ కెమిస్ట్రీ అండ్ ఎన్విరాన్మెంటల్ సైన్సెస్-