రంజాన్..సమభావన సందేశం

రంజాన్..సమభావన సందేశం

సమాజంలో అందరూ ఒకేలా ఉండరు. ఒకే చేతికున్న ఐదు వేళ్లూ సమానంగా లేనట్లే, మానవ జాతికి చెందిన మనుషులంతా ఒకేలా ఉండరు. కొందరు సంపన్నులు, కొందరు నిరుపేదలు, కొందరు విద్యావంతులు, కొందరు నిరక్షరాస్యులు, కొందరు దాతృత్వస్వభావులు, కొందరు పిసినారులు, కొందరు బుద్ధిమంతులు, కొందరు బుద్ధిహీనులు, కొందరు అమీర్లు, కొందరు గరీబులు. అందరినీ దేవుడు పరీక్షిస్తున్నాడు. ఒకరోజు అందరినీ సమావేశ పరిచి లెక్కతీసుకుంటాడు. ఎవరికి ఏ స్థితి ప్రాప్తమైనా, వారు అదే స్థితిలో పరీక్షించబడుతున్నారు. దేవుడు వారికి బాధ్యతలు పంచాడు, విధులనూ నిర్ణయించాడు. అందులో భాగంగానే సదఖ, ఫిత్రా, ఖైరాత్, జకాత్ లాంటి వివిధ రూపాల్లో సమాజంలోని పేదల చేయూతకు ఏర్పాట్లు చేశాడు. సమాజంలో అందరూ నిండు సంతోషంతో జీవితం గడపాలంటే, ప్రతి ఒక్కరూ తమ బాధ్యతలను సక్రమంగా నిర్వహించాలి. దానికో క్రమబద్ధమైన నియమం, నిబంధనావళి ఉండాలి. అందుకే దైవం సంవత్సరానికొకసారి నెల రోజుల పాటు శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేశాడు. రమజాన్ నెలరోజులూ మనిషి పగలంతా ఉపవాసం పాటిస్తాడు. దాదాపు పద్నాలుగు గంటలకు పైగా పచ్చి మంచినీళ్లు కూడా ముట్టకుండా దీక్ష పాటిస్తాడు. దీనివల్ల ఆకలిదప్పుల బాధ ఎలాఉంటుందో తెలుస్తుంది. ఫలితంగా ఒక్కపూట అన్నానికి సైతం నోచుకోని అసంఖ్యాకమంది నిరుపేదలపట్ల మనసులో సానుభూతి భావాలు వికసిస్తాయి. ఏదో ఒక రూపంలో అలాంటి వారిని ఆదుకోవాలన్న బలమైన ఆలోచన మనసులో జనిస్తుంది. పండుగలు సమతా భావనకు ఎంతగానో ఉపకరిస్తాయి.

సమభావన సందేశం

రమజాన్ నెలలో స్వీయ సంస్కరణతోపాటు, సమాజ సంస్కరణ, మానవహితం కోసం కొన్ని నియమాలు ఉన్నాయి. రోజా, తరావీహ్, ఫిత్రా, జకాత్ తదితర నియమాలు అందులో భాగమే. రమజాన్ నెల చివరి రోజుల్లో, పండుగ నమాజ్​కు ముందు కుటుంబ సభ్యులందరి తరఫున ఒక నిర్ణీత కొలతలో ధాన్యం గానీ, రొక్కం గానీ చెల్లించడాన్ని ఫిత్రా అని, సంవత్సరానికొకసారి తమనిల్వ ఆదాయంలో నుంచి నూటికి రెండున్నర శాతం చొప్పున తీసి పేదల కోసం ఖర్చుచేయడాన్ని జకాత్ అనీ అంటారు. సమాజంలో అందరూ సుఖసంతోషాలతో జీవితం గడపాలన్నది ఈ ఫిత్రా, జకాత్, సదఖ, ఖైరాత్ తదితర దానాల అసలు అర్థం.. అదే పండుగ ఉద్దేశం. నెలరోజులపాటు పొందిన శిక్షణ పండుగ తరువాతి జీవితంలోనూ కొనసాగాలి. అందుకని దేవుడు మనకు కల్పించిన అవకాశాలను సక్రమంగా సద్వినియోగం చేసుకుంటూ, సమాజంలోని సాటి మానవ సమూహం పట్ల, ముఖ్యంగా పేదలు, బడుగు, బలహీన వర్గాల పట్ల బాధ్యతతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది. అదే ‘ఈదుల్ ఫిత్ర్’ పర్వదినం మనకిస్తున్న సందేశం ఎండి ఉస్మాన్ ఖాన్