ఇయ్యాల వరల్డ్​ సూసైడ్​ ప్రివెన్షన్ ​డే

కారణాలు ఏమైనా దేశంలో నిత్యం వందలాది మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. సాంకేతికత పెరుగుతోంది కానీ, మనుషుల్లో స్పందించే దయా గుణం, సహానుభూతి క్రమంగా తగ్గుతోంది. పక్కోడు బాధపడుతున్నాడంటే దూరంగా వెళ్లేవారే కానీ.. దానికి తమ వంతు కృషి ఏమిటి? అని ఆలోచించే వారు లేరు. అందుకే ఆత్మహత్యలు ఆగడం లేదు. దేశంలో రోజూ 280 మంది ప్రాణం తీసుకుంటున్నట్లు అంచనా. ఎన్సీఆర్బీ రిపోర్టు ప్రకారం రాష్ట్రంలో 2019లో మొత్తం7,675 మంది ఆత్మహత్యలకు పాల్పడగా, అందులో 5,612 మంది పురుషులు,  2062 మంది మహిళలు, ఒక ట్రాన్స్ జెండర్ ఉన్నారు.7,675 మందిలో రోజువారి కూలీలే 2,858 మంది ఉన్నారు. ఇందులో4,353 మంది ఆదాయం లక్ష రూపాయల లోపే ఉంది. ఆత్మహత్య చేసుకున్న వారిలో 2,829 మంది నిరక్షరాస్యులే ఉన్నారు. రైతుల ఆత్మహత్యల్లో తెలంగాణ దేశంలో ఐదో స్థానంలో ఉంది. 

పురుషుల్లో ఎక్కువ
2019లో ప్రపంచ వ్యాప్తంగా14 లక్షల మంది ప్రాణాలు తీసుకుంటే, ఇందులో ప్రతి ముగ్గురిలో ఒకరు భారతీయులు. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన చైనాలో ఏడాదిలో లక్ష ఆత్మహత్యలు జరిగితే, భార త్ లో ఆ సంఖ్య రెట్టింపుగా ఉంటోంది. ఆత్మహత్యల నిరోధాన్ని లక్షిస్తూ మొట్టమొదటిసారి అంతర్జాతీయ స్థాయిలో నివేదిక విడుదల చేసిన ప్రపంచ ఆరోగ్య సంస్థ,  28 దేశాల్లో తప్ప మిగతా చోట్ల జాతీయ వ్యూహాలు కొరవడటాన్ని తప్పు పట్టింది. ఆత్మహత్యను ఆపాలన్న వ్యూహం ఎలాగన్న మాట దేవుడెరుగు. ఆత్మహత్య ప్రయత్నాన్ని నేరంగా పరిగణిస్తున్న దేశాల్లో భారతదేశం ఒకటి కావడం గమనార్హం. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం.. ఒక సంవత్సరంలో ఆత్మహత్యకు పాల్పడిన భారతీయుల్లో మహిళల సంఖ్య లక్ష ఉంటే, పురుషుల సంఖ్య అంతకు ఒకటిన్నర రెట్లు పైనే ఉంది. ఆత్మహత్యల వంటి బాధాకరమైన నిర్ణయం తీసుకుని, జీవితానికి ముగింపు కోరుతున్న వారిలో ఎక్కువ మంది యువకులు, వృద్ధులు ఉంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రమాదాల వల్ల చనిపోయే వారి కంటే ఆత్మహత్యల వల్ల మృతి చెందిన వారి సంఖ్య 
పెరుగుతోంది. ఆత్మహత్యలు చేసుకునే వాళ్లలో 30 ఏండ్లలోపు వయసు ఉన్న వారు 50 శాతం ఉన్నారని గణాంకాలు చెబుతున్నాయి. 

మూలాలను అన్వేషించాలి
ఆత్మహత్యలకు మూలాలను అన్వేషించాలి, అప్పుడే కారణాలు తెలుస్తాయి. వాటిని నివారించడానికి వీలు కలుగుతుంది. మానవ సంబంధాల మధ్య దూరం పెరగడం, కుటుంబ కలహాలు, ప్రేమలో వైఫల్యం చెందడం, నిరుద్యోగం, అనారోగ్యం, గుర్తింపు, ఆదరణ కరువవడం, తెలిసిన వారు మోసం చేయడం, ఆర్థిక, అప్పుల బాధలు లాంటి సమస్యలు ఆత్మహత్యలకు కారణమవుతున్నాయి. జీవితంలో సమస్యలు తప్పవు, జీవితమే సమస్యగా భావించకూడదు. తీవ్ర మానసిక భావోద్వేగాలు, వ్యక్తిగత సమస్యలే మహిళలలో ఎక్కువమందికి ఉరితాళ్లు పేనుతున్నట్లు ఎన్సీఆర్బీ రిపోర్టు చెబుతోంది. వేధింపులు, ఆర్థిక సంక్షోభాలు మొదలు కోరుకున్నది దక్కలేదన్న వేదన వరకు దేనికైనా చావే పరిష్కారం అనుకునే పెడ ధోరణులు పోవాలి.  ధైర్యాన్ని పెంపొందించే వ్యక్తిత్వ నిర్మాణం జరగాలి. ర్యాంకులు, మార్కులే ముఖ్యమన్న వేలం వెర్రి చదువుల బాధలో రాణించలేక ఆత్మన్యూనత భావంతో చావే శరణ్యం అన్న దుర్దశకు పిల్లలు చేరడానికి కారణం ఎవరు? మార్కులు తగ్గినా, పరీక్ష తప్పినా ఇక బతుకు వృథా అనుకునేంత నిస్పృహలో రేపటి తరం కూరుకుపోవడానికి మూలాలు ఎక్కడున్నాయో ముదింపు చేయాలి. 

నివారించవచ్చు
వ్యక్తిలోని ఆత్మహత్య ఆలోచనను సకాలంలో గుర్తించి తగిన తోడ్పాటు, కౌన్సెలింగ్ ఇస్తే వారి ప్రాణాలు కాపాడొచ్చు. ఎదుటి వారి బాధలను అర్థం చేసుకొని, వాటిని పంచుకునే అలవాటు పెంచుకోవాలి. దీనివల్ల బాధలో ఉన్న వారికి స్వాంతన చేకూరి, ఆత్మహత్యలు చేసుకోవాలన్న ఆలోచన మానుకుంటారు. వైఫల్యాలకు కుంగిపోయి అంతటితో తమ ప్రయత్నాలను, జీవితాన్ని ముగించుకుంటే ఐన్​స్టీన్, థామస్ అల్వా ఎడిసన్, అబ్రహం లింకన్ లాంటి వారిని తరతరాలు స్మరించుకోగలిగే వారే కాదు. ఓటమి ఒక మలుపు, కానీ ఏకైక గమ్యం గెలుపు. ఆ స్ఫూర్తితో రెట్టించిన పట్టుదలతో సామర్థ్య నిరూపణకు కంకణ బద్ధులైన వారే చరిత్రలో విజేతలుగా నిలిచారు. కుంగిన హృదయాల్ని స్వాంతన వచనాలతో సేదతీర్చే గురువులు, కుటుంబ సభ్యులు, సహోద్యోగులు, మిత్రులు ఉన్న చోట ఆత్మహత్యలు సన్నగిల్లుతాయి. సకాలంలో ఉపశమనం, చికిత్స అందించగలిగితే 90 శాతం ఆత్మహత్యలను నివారించగలం. ఆత్మహత్యలు వద్దు, ఉన్నది ఒక్కటే జిందగీ. 

డాక్టర్ అశోక్ పరికిపండ్ల, సైకాలజిస్ట్, అధ్యక్షుడు, ఆత్మహత్యల నివారణ కమిటీ