
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన పౌర, మానవ హక్కుల సంఘాలు, మహిళా సంఘాలు, ప్రజాసంఘాల సభ్యుల ఇండ్లపై ఎన్ఐఏ, పోలీసులు సంయుక్తంగా చేసిన దాడులను ఖండిస్తున్నట్లు మానవ హక్కుల వేదిక సోమవారం తెలిపింది. రెండు రాష్ట్రాల్లోని మానవ హక్కుల వేదిక, కేఎన్పీఎస్, పీకేఎస్, పీఎమ్ఎస్, చైతన్య మహిళా సంఘం తదితర సంఘలకు చెందిన సభ్యుల ఇండ్లపై దాడులు చేయడం చట్ట వ్యతిరేక చర్యగా పేర్కొంది.
ఇండ్లలో వృద్ధులు, పిల్లలను భయభ్రాంతులకు గురిచేసి మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లు, పుస్తకాలు, సీసీ కెమెరాల ఫుటేజ్‌ను స్వాధీనం చేసుకున్నారని తెలిపింది. ఈ దాడులపై ఆంధ్ర, తెలంగాణ ప్రభుత్వాలు ప్రకటన చెయ్యాలని కోరింది. ప్రతిపక్ష పార్టీలు కూడా ఈ దాడులను ఖండించాలని ఉభయ రాష్ట్రాల సమన్వయ కమిటీ సభ్యులు వి.వసంత లక్ష్మి, ఎస్. జీవన్ కుమార్, వి.ఎస్. కృష్ణ, ఏ. చంద్ర శేఖర్, తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.తిరుపతయ్య ఓ ప్రకటనలో కోరారు.