పేదరికం, నిరక్షరాస్యత వంటి కారణాలు పేదలను అక్రమ రవాణా ఉచ్చులోకి నెడుతున్నాయి. దుర్గామాత అవతారాలుగా కొలిచే ఆడబిడ్డలు సంతలో సరుకుల అక్రమ రవాణాకు బలవుతున్నారు. దేశంలో 80 శాతం అక్రమ రవాణా వ్యభిచారం చుట్టూ నడుస్తోందని, మిగిలిన 20 శాతం వెట్టి చాకిరి, భిక్షాటన, వివాహాలు మొదలైన వాటి కోసం జరుగుతున్నాయని పలు అధ్యయనాలు చాటుతున్నాయి. కఠిన జైలు శిక్షలు, భారీ జరిమానాలు మానవ అక్రమ రవాణాను ఆపలేకపోతున్నాయి. దేశంలో ప్రతి గంటకి 8 మంది చిన్నారులు తప్పిపోతున్నారు. నలుగురు లైంగిక వేధింపులకు గురవుతున్నారు. ఇద్దరు అత్యాచారం బారిన పడుతున్నారు. దేశంలో ఇప్పటికే ఎన్నో చట్టాలు వచ్చినా బాలికల, మహిళల అక్రమ రవాణా పెడ ధోరణికి కళ్లెం పడటం లేదు. ఫలితంగా మహిళా సామాజిక భద్రత ఎండమావిగా మారింది.
రాష్ట్రంలో ఎక్కువగా..
దేశవ్యాప్తంగా ఆడ, మగా పిల్లలు, పెద్దలు అని తేడా లేకుండా సాగుతున్నది. మహిళలను వ్యభిచార రొంపిలోకి, పిల్లల్ని వెట్టిచాకిరిలోకి దించుతున్నారు. జాతీయ నేర గణాంక సంస్థ లెక్కల ప్రకారం దేశంలో 2019–-21 మధ్యకాలంలో 6,111 అక్రమ రవాణా కేసులు నమోదయ్యాయి. 2021 ఏడాదిలో దేశంలో 2,189 కేసులు రిజిస్టర్ కాగా, వాటిలో 87 శాతం కేసుల్లో మాత్రమే చార్జిషీట్స్ దాఖలయ్యాయి. మానవ అక్రమ రవాణా తెలంగాణలో కూడా ఆందోళనకర స్థాయిలోనే ఉన్నది. తెలంగాణ తర్వాత మహారాష్ట్ర, కేరళ, అస్సాం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మానవ అక్రమ రవాణా కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. మన రాష్ట్రంలో 2021 ఏడాదిలో 347 కేసులు నమోదు చేశారు. 98 శాతం కేసులలో చార్జిషీట్ నమోదు చేశారు. దేశంలో నేషనల్ క్రైమ్ రికార్డ్స్ ప్రకారం 2021 సంవత్సరంలో 90113 బాలికలు 375058 మంది మహిళలు తప్పిపోయారు. ప్రపంచ మానవ అక్రమ రవాణా దినోత్సవం సందర్భంగా జులై 30న కైలాస్ సత్యర్థి చిల్డ్రన్ ఫౌండేషన్, ‘ది గేమ్స్’ సంస్థలు విడుదల చేసిన లెక్కలు, భారతదేశంలో చిన్నారుల అక్రమ రవాణా నివేదిక-2022 లోని అంశాలు చిన్నారుల భద్రతపై ఆందోళనను రేకెత్తిస్తున్నాయి. ఈ సంస్థలు 21 రాష్ట్రాల్లో 264 జిల్లాల్లో నమోదైన కేసులు ఆధారంగా చిన్నారుల అక్రమ రవాణాపై కీలక అంశాలను వెల్లడించాయి. దేశంలో కరోనా తర్వాత చిన్నారుల అక్రమ రవాణా కేసులు పెరిగాయని తేలింది. మన రాష్ట్రంలో 2016–-20 మధ్యకాలంలో 19 బాలల అక్రమ రవాణా కేసులు నమోదు కాగా కరోనా తర్వాత 2021–-22 లో 56 కేసులు నమోదు అయ్యాయి. బాల్యం ఆనందంగా గడపాల్సిన చిన్నారులను అక్రమ రవాణా ముఠాలు దుస్తుల ఫ్యాక్టరీలు, కాస్మోటిక్ ఇండస్ట్రీలు, హోటల్స్, దాబాలు, ఆటోమొబైల్స్ ఇండస్ట్రీల్లో బాల కార్మికులుగా పెడుతున్నాయి.
చట్టాల బలోపేతం అవసరం
సమాజం అభివృద్ధి చెందుతున్నా.. మానవ అక్రమ రవాణా సమస్య పూర్తిగా అంతం కావడం లేదు. ఆర్టికల్ 23(1)ప్రకారం భారత రాజ్యాంగం మనుషులు లేదా వ్యక్తుల అక్రమ రవాణాను నిషేధించింది. అక్రమ రవాణా ముప్పుని ఎదుర్కోవడానికి సమగ్ర చర్యలు తీసుకోవడానికి క్రిమినల్ లా సవరణ చట్టం -2013, లైంగిక నేరాల నుంచి పిల్లలు రక్షణ పొందేందుకు పోక్స్చట్టం, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు నూతన బాల కార్మిక సవరణ చట్టం- 2016, విద్యా హక్కు చట్టం -2009, బాలల న్యాయ చట్టం- 2015 తదితర ఎన్నో చట్టాలను అమల్లోకి తెచ్చినా.. పూర్తి స్థాయిలో ఫలితాలు రావడం లేదు. జిల్లా స్థాయిలలో మహిళల హెల్ప్ డెస్క్, యాంటి ట్రాఫికింగ్ సెల్ అత్యవసర పరిస్థితులకు టోల్ ఫ్రీ నెంబర్ 112, స్మార్ట్ ఫోలిసింగ్ వ్యవస్థల ఏర్పాటు వల్ల కొంతమేర అక్రమ రవాణా తగ్గినా.. సమస్యను పూర్తి స్థాయిలో అంతమొందించడం లేదు. అక్రమ రవాణా ఉచ్చు నుంచి చిన్నారులను, మహిళలను రక్షించడం కీలకమైన అంశం. వ్యవస్థీకృత సంస్కరణలు చేపట్టి బాలికలు, మహిళల పట్ల సామాజిక దృక్పథాన్ని సానుకూలంగా మార్చినప్పుడే ఆశించిన ఫలితాలు నెరవేరుతాయి.
అంకం నరేష్