మానవ అక్రమ రవాణా చట్టవిరుద్ధం : బండారు జయశ్రీ

యాదగిరిగుట్ట, వెలుగు : మానవ అక్రమ రవాణా చట్టవిరుద్ధమని, అక్రమ రవాణాకు పాల్పడినా, సహకరించినా కఠిన చర్యలు తప్పవని యాదాద్రి జిల్లా బాలల సంక్షేమ సమితి చైర్ పర్సన్ బండారు జయశ్రీ హెచ్చరించారు. మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మంగళవారం యాదగిరిగుట్టలో మహిళా, శిశు సంక్షేమశాఖ సౌజన్యంతో పీస్ స్వచ్ఛంద సంస్థ సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మానవ అక్రమ రవాణాకు పాల్పడితే ఎంతటివారినైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. మానవ అక్రమ రవాణా అనే పదం జిల్లాలో వినపడకూడదని, ఇందుకోసం ప్రతిఒక్కరూ తోడ్పాటు అందించాలన్నారు.

పిల్లలకు సెల్​ఫోన్లు, సామాజిక మాద్యమాలు అందుబాటులో ఉండడంతో అపరిచిత వ్యక్తులతో మాట్లాడుతూ ప్రలోభాలకు గురవుతున్నారన్నారు. విద్యార్థులు, పిల్లలు అవసరాల మేరకు మాత్రమే సెల్​ఫోన్లు వాడాలని సూచించారు. మానవ అక్రమ రవాణా అనేది ప్రపంచంలో మూడో అతిపెద్ద వాణిజ్యంగా మారిందని, ఈ మహమ్మారిని అరికట్టడానికి ప్రతిఒక్కరూ కృషి చేయాలని కోరారు. సమావేశంలో పీస్ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడు నిమ్మయ్య, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ రాచకొండ సీఐ చంద్రబాబు, జిల్లా బాలల పరిరక్షణ ఆఫీసర్ సైదులు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. 

మానవ అక్రమ రవాణాను అడ్డుకోవాలి.. 

పెన్ పహాడ్, వెలుగు : మానవ అక్రమ రవాణాను అడ్డుకోవాలని ఎస్ఐ రవీందర్ అన్నారు. మంగళవారం మానవ అక్రమ రవాణా వ్యతిరేకదినం సందర్భంగా మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో సత్యార్థి చిల్డ్రన్ ఫౌండేషన్ సౌజన్యంతో యాక్షన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్​మెంట్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.