మానవ అక్రమ రవాణా కేసు..ఆరుగురికి యావజ్జీవం

మానవ అక్రమ రవాణా కేసు..ఆరుగురికి యావజ్జీవం
  • తీర్పు చెప్పిన ఎన్ఐఏ స్పెషల్  కోర్టు

హైదరాబాద్‌‌, వెలుగు: బంగ్లాదేశ్‌‌కు చెందిన యువతులను మానవ అక్రమ రవాణా చేసిన ఆరుగురికి ఎన్‌‌ఐఏ స్పెషల్‌‌ కోర్టు యావజ్జీవ కారాగారశిక్ష  విధించింది. దీనితో పాటు దోషులకు రూ.24 వేల చొప్పున జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించింది. ఈ విషయాన్ని ఎన్ఐఏ అధికారులు గురువారం ఒక ప్రకటనలో  వెల్లడించారు.

హైదరాబాద్‌‌ కు చెందిన మహ్మద్‌‌  యూసుఫ్ ఖాన్‌‌, అతని భార్య బితి బేగంతో పాటు సోజిబ్‌‌, రుహుల్‌‌ అమిన్‌‌ ధలి, మహ్మద్‌‌ అబ్దుల్‌‌ సలాం, షిలి ఖాతున్‌‌ ఒక  గ్యాంగ్‌‌గా ఏర్పడ్డారు. బంగ్లాదేశ్‌‌ నుంచి యువతులను అక్రమ రవాణా చేసేవారు. 2019లో బంగ్లాదేశ్‌‌కు చెందిన ఓ మైనర్‌‌‌‌ను ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి దేశానికి అక్రమంగా తీసుకొచ్చారు. మానవ అక్రమ రవాణా గురించి సమచారం అందుకున్న ఎన్‌‌ఐఏ అధికారులు..

 2019 ఆగస్టులో పాతబస్తీ ఛత్రినాక పోలీస్ స్టేషన్ లో కందికల్‌‌ గేట్‌‌, ఉప్పుగూడలో  ఆపరేషన్లు చేసి ఐదుగురు బాలికలను రక్షించారు. ఛత్రినాక పీఎస్‌‌లో రిజిస్టర్  అయిన ఎఫ్‌‌ఐఆర్  ఆధారంగా అదే ఏడాది సెప్టెంబరు‌‌లో ఎన్‌‌ఐఏ కోర్టు దర్యాప్తు చేసింది. 2020 మార్చి10న అధికారులు కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు. విచారించిన కోర్టు.. ఆరుగురు నిందితులను దోషులుగా తేల్చింది. యావజ్జీవ జీవితఖైదు, జరిమానా విధించింది.