తెలంగాణ ఉద్యోగుల మానవత్వం : వరద బాధితులకు రూ.130 కోట్లు

తెలంగాణ ఉద్యోగుల మానవత్వం : వరద బాధితులకు రూ.130 కోట్లు

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు మానవత్వం చాటుకున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వరదల వల్ల నిరాశ్రయులైన బాధితుల పక్షం నిలిచారు. తమ వంతు సాయంగా.. మూల వేతనంలో ఒక రోజు జీతాన్ని సీఎం రేవంత్ రెడ్డి సహాయ నిధికి అందజేయాలని నిర్ణయించారు. 130 కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్‎కు అందజేయనున్నారు. ఈ మేరకు ప్రభుత్వానికి తీర్మాన కాపీని పంపించారు. ఇటీవల రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వానలు, తుపాను ప్రభావంతో తెలంగాణ ప్రజలు తీవ్ర నష్టాన్ని చవిచూశారని.. ఈ క్లిష్ట సమయంలో తమ వంతుగా వారిని ఆదుకోవాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు.. గెజిటెడ్ ఆఫీసర్స్, టీచర్లు, కార్మికులు, పెన్షనర్లు, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల ఒకరోజు మూలవేతనపు మొత్తాన్ని సెప్టెంబర్ నెల జీతం నుండి ప్రభుత్వ ఖజానాకు జమ చేయాల్సిందిగా సీఎంకు విజ్ఞప్తి చేశారు. 

Also Read:-ఆజ్ఞాని.. ఇది ప్రభుత్వ నిర్లక్ష్యం కాదు.. ప్రకృతి విపత్తు

కాగా, గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలు, వరదలతో రాష్ట్రం అల్లకల్లోలం అయ్యింది. ఎక్కడికక్కడ జనజీవనం స్తంభించిపోయింది. ముఖ్యంగా ఖమ్మం జిల్లా ఎక్కువగా వరద ప్రభావానికి గురైంది. మున్నేరు వాగు ఉగ్రరూపం దాల్చడంతో ఖమ్మంలోని పలు ప్రాంతాల జలదిగ్భంధం అయ్యాయి. వరద నీరు ఇంట్లోకి చేరడంతో వందల మండి రోడ్డున పడ్డారు. వందల కుటుంబాలను వరదలు మరిచిపోలేని విషాదంలోకి నెట్టాయి. ఈ క్రమంలో బాధితులను ఆదుకునేందుకు పలువురు ముందుకు వస్తున్నారు.