విషానికి విరుగుడు పని చేస్తలే!

పాత రోజుల్లో పాము కరిస్తే పసర్లే దిక్కు. ఆ తరువాత పాము కాటుకు విరుగుడుగా యాంటీ వీనమ్ వచ్చింది. ఎంత పెద్ద పాము కాటేసినా సకాలంలో యాంటీ వీనమ్ ఎక్కిస్తే ప్రాణాలు దక్కేవి. అయితే ఇప్పుడు చాలా చోట్ల యాంటీ వీనమ్ పనిచేయడం లేదు. మనిషి ప్రాణాలు కోల్పోతున్నాడు.

మన దేశంలో పాము కాటుకు గురై చనిపోయేవాళ్లు చాలా ఎక్కువ. ప్రతి ఏడాది 46 వేల మందికి పైగా పాముకాటుతో చనిపోతున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. అన్ని దేశాల లెక్కలు తీసుకుంటే ఈ టైపు చావుల్లో సగం ఇండియాలోనే ఉన్నాయి. సహజంగా పాముకాటుకు విరుగుడుగా యాంటీ వీనమ్ ఇంజెక్షన్ చేస్తారు.  ఈ వీనమ్​కు ఇండియాలో కొరత లేదు. చాలా చోట్ల అందుబాటులోకూడా ఉంటోంది. అయితే ఇది పనిచేయడం లేదు. ఇంజక్షన్​ చేసినాగానీ పాము కాటుకు మనుషులు చనిపోతున్నారు.

యాంటీ వీనమ్ పనిచేయకపోవడానికి ప్రధాన కారణం తయారీ విధానమే అంటున్నారు నిపుణులు. 19వ శతాబ్దం నాటి పద్ధతులే ఇప్పటికీ ఫాలో అవుతున్నారని, దీని వల్ల యాంటీ వీనమ్ సరైన ఫలితాలు ఇవ్వడం లేదని వాళ్లంటున్నారు. ఇండియాలో అత్యంత విషపూరిత సర్పాలుగా నాగుపాము, కట్ల పాము, రక్త పింజరి, ఇసుక పింజరి పాములను భావిస్తారు. వీటిని ‘డేంజరస్ ఫోర్’ అని హెర్పటాలజిస్టులు (పాములకు సంబంధించిన నిపుణులు) చెబుతారు. ఈ నాలుగు రకాల పాముల నుంచి విషం తీసి… దాంతో యాంటీ వీనమ్ తయారు చేస్తారు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఇలా యాంటీ వీనమ్ తయారు చేసే కంపెనీలన్నీ ఎక్కువగా తమిళనాడులోనే ఉన్నాయి. ఇందులో పాములు పట్టేవాళ్లే ఉద్యోగులుగా ఉంటారు. పల్లెల్లో తమకు తెలిసిన పద్ధతుల్లో వీళ్లు విషం తీస్తుంటారు. తమిళనాడులో దొరికే  పాముల నుంచి విషం తీసి వాటితోనే యాంటీ వీనమ్ తయారు చేస్తున్నారన్న ఆరోపణ ఎక్కువగా వినిపిస్తోంది. దేశంలోని మిగతా ప్రాంతాల్లో తిరిగే పాముల విషం జోలికి వీళ్లు వెళ్లరు. దీంతో ఇక్కడ తయారైన యాంటీ వీనమ్ దేశంలోని మిగతా ప్రాంతాల్లో ఉపయోగిస్తే ఫలితాలు ఇవ్వడం లేదంటున్నారు హెర్పటాలజిస్టులు.

డేంజరస్​ ఫోర్​తోనే యాంటీ వీనమ్

దేశంలో ఎన్నో రకాల విష పాములు ఉంటే కేవలం 4 రకాల పాముల నుంచి విషం తీసి, యాంటీ వీనమ్ తయారు చేయడం కరెక్ట్ కాదంటున్నారు నిపుణులు. అంతేకాదు అన్ని పాముల విషం కూడా ఒకేలా ఉండదు. ఒకే జాతికి చెందిన పాముల విషంలో కూడా తేడాలుంటాయంటున్నారు హెర్పటాలజిస్టులు. తాచు పాములు పశ్చిమ బెంగాల్​లోనూ ఉంటాయి. అరుణాచల్ ప్రదేశ్​లోనూ ఉంటాయి. వీటి విషం తీవ్రతలో తేడాలుంటాయట.

క్లినికల్ ట్రయల్స్ అవసరం

అమలాపురం నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు మన దేశంలో అన్ని ప్రాంతాల్లో కనిపించే విష సర్పాలను దృష్టిలో పెట్టుకుని యాంటీ వీనమ్ తయారు చేయాల్సిన అవసరం ఉంది. అది ఎంత పవర్​ఫుల్​గా పనిచేస్తుంది అనేది నిర్థారణ చేసుకోవడానికి పెద్ద సంఖ్యలో క్లినికల్ ట్రయల్స్ చేయాల్సిన అవసరం ఉంది. వరల్డ్ వైడ్​గా 2030 నాటికి పాము కాటు మరణాలను సగానికి తగ్గించాలని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒక టాస్క్​గా పెట్టుకుంది.

పాము కాట్లకు ప్రయారిటీ లేదు

పాము కాటుతో చనిపోయేవారిని సహజంగా ప్రభుత్వాలు పట్టించుకోవు. అదేదో చిన్న విషయంగా కొట్టి పారేస్తుంటాయి. రోడ్డు ప్రమాదాల్లో చనిపోయినవారికి  ఇచ్చినంత ప్రయారిటీ వీళ్లకు ఇవ్వవు. పాము కాటుతో చనిపోయేవారి పట్ల ఈ ఉదాసీన వైఖరి కరెక్ట్ కాదంటున్నారు డబ్ల్యుహెచ్ఓ అధికారులు. ప్రభుత్వాలు ఈ మైండ్ సెట్ నుంచి బయటపడాలంటున్నారు. వాస్తవానికి పాములన్నీ విషపూరితం కావు. పాము కాటేయగానే విషం ఎక్కడంవల్ల కాకుండా భయంతో చనిపోయేవాళ్లు ఎక్కువగా ఉంటారు.

విషం ఎక్కడ పనిచేస్తుంది?

  • పాము కాటేస్తే ముందుగా ఆ ప్రభావం నెర్వస్ సిస్టంపై పడుతుంది. విషం శరీరంలోకి ఎక్కడంతో గుండె ఆగిపోతుంది. ఈ విషాన్ని ‘కార్డియో టాక్సిస్ పాయిజన్’ అంటారు.
  • రక్త పింజరి పాయిజన్ ఎక్కువగా బ్లడ్ వెసెల్స్ పై  ప్రభావం చూపుతుంది. రక్త నాళాలు చిట్లి నోటి నుంచి రక్తం వస్తుంది. రక్త ప్రసరణ ఆగిపోతుంది. చివరకు మనిషి చనిపోతాడు. ఈ రకం పాముల విషాన్ని ‘న్యూరో టాక్సిస్ పాయిజన్’గా పిలుస్తారు.
  • ఒక్కోసారి కాటేసింది మామూలు పామో లేక విషం ఉన్న పామో తెలియదు. తెలుసుకునే అవకాశం కూడా ఉండదు. అటువంటి పరిస్థితుల్లో ఏ పాము విషానికైనా విరుగుడు యాంటీ వీనమే.

 

ఈ పాములు వెరీ డేంజరస్

  • తెలుగు రాష్ట్రాల్లో నాలుగు రకాల పాములను వెరీ డేంజరస్​గా భావిస్తారు. ఇవి ఇసుక పింజరి, రక్త పింజరి, కట్లపాము, తాచు పాము.
  • ఇసుక పింజరిని ఇంగ్లీషులో ‘సా స్కేల్డ్ వైపర్’ అంటారు. చూడటానికి చిన్నదిగా ఉన్నా ఇది కాటేస్తే మనిషి బతకడం కష్టమే.
  • కట్లపాముని సైంటిఫిక్​గా ఇండియన్ క్రెయిట్ అంటారు. కట్ల పాము రాత్రిళ్లు చాలా యాక్టివ్​గా ఉంటుంది.
  • రసెల్స్ వైపర్​ని రక్త పింజరి అంటారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దక్షిణాసియాలోని అనేక ప్రాంతాల్లో ఇది కనిపిస్తుంది.
  • నాలుగో రకం అందరికీ తెలిసిన తాచు పాము. వీటిలో కొన్నిటిని నాగు పాములు అనికూడా అంటారు. వీటిలో కింగ్ కోబ్రా బాగా ఫేమస్. కొన్ని కింగ్ కోబ్రాలు ఆరు నుంచి ఎనిమిది అడుగుల వరకు పొడవుంటాయి. ఇవి కాటేస్తే నిమిషాల్లోనే చనిపోవడం ఖాయం.