- మబ్బుతో పెరిగిన మాయిశ్చర్.. తగ్గిన కొనుగోళ్లు
- ఇప్పటి వరకు 37.76 లక్షల టన్నులు సేకరణ
- రైతుల ఖాతాలకు రూ.7,497 కోట్లు జమ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో వడ్ల కొనుగోళ్లపై తేమ ఎఫెక్ట్ పడుతున్నది. వాతావరణ మార్పులతో వారం, పది రోజులుగా మబ్బుపట్టి మాయిశ్చర్ పెరిగి కొనుగోళ్లు కొంత మేరకు తగ్గాయి. ఫెయింజల్ తుపాను ప్రభావంతో ఆకాశంలో మేఘాలు కమ్ముకొని వాతావరణం చల్లబడడంతో పాటు అక్కడక్కడ కొద్దిపాటి వర్షాలు పడ్డాయి. దీంతో అన్నదాతలు వడ్లు తడవకుండా కాపాడుకోవడానికి ఇబ్బందులు పడ్డారు. దీనికి తోడు ధాన్యం తేమ ఆరే వరకు ఎండబెట్టాల్సి ఉండగా వాతావరణం అనుకూలించడం లేదు. ఈ ప్రభావం కొనుగోళ్లపై పడింది. మరో రెండు రోజులు వాతావరణ ఇలాగే ఉంటుందని వాతావరణ నిపుణులు చెబుతుండడంతో రైతులకు ఇబ్బంది తప్పడం లేదు.
17శాతం వచ్చిన వెంటనే కాంటా
ఎఫ్‌సీఐ నిబంధనల ప్రకారం 17తేమ ఉంటేనే ధాన్యం సేకరణ జరుగుతుంది. తుఫాన్ ప్రభావంతో వాతావరణం చల్లబడడంతో ధాన్యం తేమ శాతం పెరిగింది. దీంతో గత వారం పది రోజులుగా సెంటర్లలో కొనుగోళ్లు కొంత మేరకు తగ్గాయి. గతంలో రోజుకు లక్షన్నర టన్నుల సేకరణ జరిగేది.. అయితే తేమ ఎఫెక్ట్‌తో అది సగానికి తగ్గింది. రైతులు సెంటర్లలో వడ్లు ఆరబోస్తున్నా.. వాతావరణం అనుకూలించడం లేదు. మహబూబాబాద్, వరంగల్, జనగామ, ములుగు, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని సెంటర్లకు ఇప్పటికీ వడ్లు పోటెత్తుతున్నాయి.
తేమ శాతం 17కు తగ్గగానే వెంటనే కాంటా పెట్టి కొనుగోళ్లు చేపడుతున్నరు. మిల్లులకు, గోదాములకు తరలిస్తున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 60 శాతం నుంచి 70 శాతం వరి కోతలు పూర్తి కాగా మిగిలిన పంట ఇంకా చివరి దశలోనే ఉంది. కొన్ని ప్రాంతాల్లో వరి కోతలు కొనసాగుతున్నాయి. ఇంకా 40 శాతానికి పైగా ధాన్యం సేకరించాల్సి ఉండగా మబ్బు పట్టిన వాతావరణం కొంత ఇబ్బందులకు గురి చేస్తున్నది. తేమ శాతం తగ్గిన వడ్లను వెంట వెంటనే కాంటా పెట్టి తరలించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు చెబుతున్నరు.
12 లక్షల టన్నుల సన్నొడ్లు..
రాష్ట్ర వ్యాప్తంగా 8,200 కోనుగోలు సెంటర్లు, మార్కెట్ యార్డుల ద్వారా రైతుల నుంచి ఇప్పటి వరకు 37.76 లక్షల టన్నుల వడ్ల కొనుగోళ్లు జరిగాయి. అందులో సన్న ధాన్యం 12.48 లక్షల టన్నులు కాగా, దొడ్డు రకాలు 25.28 లక్షల టన్నులు ఉన్నాయి. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి రైతుల ఖాతాల్లో వెంటనే నిధులు జమ చేస్తున్నరు. ఇప్పటికే రూ.7,497 కోట్లు రైతుల బ్యాంకు అకౌంట్లకు జమ చేసినట్లు అధికారిక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.