దండేపల్లి, వెలుగు: పోడు వ్యవసాయం చేసేందుకు రిజర్వ్ ఫారెస్ట్ లో విలువైన చెట్లను గుర్తు తెలియని దుండగులు నరికివేసిన ఘటన మంచిర్యాల జిల్లాలో జరిగింది. దండేపల్లి మండలం తాళ్లపేట ఫారెస్ట్ రేంజ్ పరిధి లింగాపూర్ బీట్ రిజర్వ్ ఫారెస్ట్ లో పోడు వ్యవసాయం చేసేందుకు ఆదివారం తెల్లవారుజామున విలువైన టేకు చెట్లతో సహా వంద చెట్లను నరికివేసిశారు. సుమారు ఐదెకరాలకు పైగా స్థలాన్ని చదును చేశారు.
చెట్లు నరుకుతున్నట్లు అటవీ అధికారులకు సమాచారం అందడంతో ఎఫ్ఆర్ఓ సుస్మారావు సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకోగా నిందితులు పారిపోయారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని, అటవీ ప్రాంతంలో చెట్లను నరికి పోడు వ్యవసాయం చేసేవారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఎఫ్ఆర్ వో హెచ్చరించారు. రెండేండ్ల కింద లింగాపూర్ బీట్ లో పోడు వ్యవసాయం చేస్తున్న కోయపోచగూడెం ఆదివాసీ గిరిజన మహిళలను ఫారెస్ట్ అధికారులు అరెస్ట్ చేసి జైలుకు పంపడంతో ఆదివాసీ సంఘాలు, వామపక్ష, ప్రజా సంఘాలు చేసిన ఆందోళనలు ఢిల్లీ వరకు చేరిన విషయం తెలిసిందే.