జాతీయ జెండాకు వందేండ్లు

1947 జులై 22న రాజ్యాంగ సభ మూడు రంగుల జెండాను.. జాతీయ జెండాగా ఆమోదించింది. అయితే దీనికి కొన్ని చిన్న మార్పులు చేశారు. మూడు రంగుల జెండా మధ్యలో చరకా స్థానంలో అశోక చక్రాన్ని చేర్చారు. మౌర్య చక్రవర్తి అశోకుని కాలం నాటి సారనాథ్ సింహాల్లో నుంచి ఈ ధర్మ చక్రాన్ని తీసుకున్నారు. స్వతంత్ర భారతదేశంలో జాతీయ చిహ్నంగా సారనాథ్​ సింహాల(నాలుగు సింహాలు)కు అప్పటి ప్రధాని పండిట్ జవహర్‌‌లాల్ నెహ్రూ ఆమోదముద్ర వేశారు.

పింగళి వెంకయ్య
తెలుగువాడైన పింగళి వెంకయ్య స్వస్థలం కృష్ణా జిల్లా మచిలీపట్టణానికి సమీపంలోని భట్లపెనుమర్రు. 1876 ఆగస్టు 2న ఆయన పుట్టారు. 1963 జులై 4న విజయవాడలో తుదిశ్వాస విడిచారు. కాంగ్రెస్​ మూడు రంగుల జెండాను రూపొందించిన ఘనత పింగళి వెంకయ్యదే. దానిని ఆయన మహాత్మా గాంధీకి అందజేశారు. ఆంధ్రప్రదేశ్​కే కాదు భారతదేశానికే పింగళి వెంకయ్య ముద్దుబిడ్డ. ఫ్రీడం ఫైటర్​గా, కాంగ్రెస్​ వాదిగా, మహాత్మాగాంధీకి అత్యంత విధేయునిగా, జాతీయ జెండా రూపకర్తగా ఆయన చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారు.

మూడు రంగుల జెండా వందేండ్లు పూర్తి చేసుకుంది. 1921 ఏప్రిల్​ 1న ఆలిండియా కాంగ్రెస్​ కమిటీ(ఏఐసీసీ) మీటింగ్​లో తెలుగువాడైన పింగళి వెంకయ్య తాను రూపొందించిన మూడు రంగుల జెండా ముసాయిదాను.. జాతిపిత మహాత్మా గాంధీకి అందజేశారు. వాస్తవానికి, పింగళి వెంకయ్య రూపొందించిన డిజైన్​లో రెండు రంగులు ఎరుపు, ఆకుపచ్చ మాత్రమే ఉండేవి. అప్పట్లో ప్రధాన మతాలైన హిందూ, ముస్లింలకు ఈ రంగులు ప్రతీకలుగా ఉండేవి. హిందూ–ముస్లిం ఐక్యతకు సంబంధించి గాంధీ సిద్ధాంతాలకు అనుగుణంగా ఈ డిజైన్​ను పింగళి రూపొందించారు. అయితే ఆ తర్వాత మిగతా మతాలను కూడా ప్రతిబింబించేలా తెలుపు రంగును కూడా జెండాలో కలపాలని పింగళి వెంకయ్యకు గాంధీ సూచించారు. దీని ద్వారా మనదేశం భిన్న మతాలు, భిన్న కులాలు, భిన్న భాషలు, భిన్న జాతులు, భిన్న సంస్కృతులకు ప్రతీకగా నిలుస్తుందని ఆయన ఆశించారు. అలాగే జెండాలో చరకా లేదా రాట్నం చేర్చాలని కూడా సూచించారు. చరకా మన దేశ స్వయం ప్రతిపత్తికి నిదర్శనంగా ఆయన భావించారు. దీనికి అనుగుణంగా ఎరుపు, తెలుపు, ఆకుపచ్చ రంగులు మధ్యలో చరకాతో మూడు రంగుల జెండా రూపుదిద్దుకుంది. 

కాంగ్రెస్​ జెండా పరిణామక్రమం
1906లో తొలిసారిగా కోల్​కతాలో కాంగ్రెస్​ జెండాను ఎగురవేశారు. 1907లో మేడమ్​ భికాజీ కామా, 1917లో స్వదేశీ ఉద్యమం సమయంలో డాక్టర్​ అనిబిసెంట్, లోకమాన్య బాలగంగాధర్​ తిలక్​ కాంగ్రెస్​ జెండాను ఎగురవేశారు. అయితే 1921లో పింగళి వెంకయ్య చివరగా ఎరుపు, తెలుపు, ఆకుపచ్చతో మూడు రంగుల కాంగ్రెస్​ జెండాను రూపొందించారు. ఇది జరిగిన పదేండ్ల తర్వాత అంటే 1931లో ఎరుపు రంగు స్థానంలో కాషాయాన్ని రీప్లేస్​ చేశారు. 1931లో ప్రస్తుత జెండా మాదిరిగా కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగులు మధ్యలో చరకా లేదా రాట్నంతో ఉన్న జెండాకు ఆమోదం లభించింది. మూడు రంగుల జెండాను కాంగ్రెస్​ జెండాగా స్వీకరిస్తూ 1931లో ఏఐసీసీ తీర్మానాన్ని ఆమోదించింది. అయితే జెండాలో రంగులకు కులమతాలతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. మూడు రంగులకు గల ప్రత్యేకతలను వివరంగా తెలిపింది. కాషాయం కష్టాలకు, త్యాగానికి గుర్తు కాగా, తెలుపు శాంతికి ప్రతిరూపం, ఆకుపచ్చ పురోగతికి, స్వయం సమృద్ధిని సూచిస్తుందని స్పష్టం చేసింది.

కాంగ్రెస్​ మూడు రంగుల జెండా
అహింసా సిద్ధాంతం ద్వారా దేశ స్వాతంత్ర్యం కోసం జరిపిన పోరాటానికి గుర్తు కాంగ్రెస్​ మూడు రంగుల జెండా. భిన్న మతాలు, భిన్న భాషలు, భిన్న సంస్కృతుల సమాజంలో సాంఘిక, రాజకీయ పరిణామాలకు కాంగ్రెస్​ మూడు రంగుల జెండా చిహ్నంగా మారింది. ఈ జెండాతోనే కాంగ్రెస్​ పార్టీ స్వాతంత్ర్య పోరాటాన్ని సాగించింది. 1923లో జెండా సత్యాగ్రహం, 1930లో ఉప్పు సత్యాగ్రహం, శాసనోల్లంఘన ఉద్యమం, 1942లో క్విట్ ఇండియా వంటి అనేక ఉద్యమాలన్నీ మూడు రంగుల జెండా కిందే జరిగాయి. 1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు అందరి చేతుల్లోనూ రెపరెపలాడినవి ఈ మూడు రంగుల జెండాలే. ఈ మూడు రంగుల జెండాతోనే ఎంతో పురోగతిని, అభివృద్ధిని సాధించి ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ఇండియా నిలిచింది. బ్రిటీష్ సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకించాలని మాత్రమే గాంధీజీ ప్రజలకు చెప్పారు. బ్రిటీష్ ప్రజలను ద్వేషించవద్దని సూచించారు. ఈ ఆలోచనా విధానమే బ్రిటీష్ కామన్వెల్త్‌‌లో ఇండియా కొనసాగేలా నెహ్రూ నిర్ణయం తీసుకోవడానికి ప్రేరణగా నిలిచింది.
 

చౌరి-చౌరా
సహాయ నిరాకరణ ఉద్యమాన్ని 1922 ఫిబ్రవరి 12న ఉపసంహరించుకుంటున్నట్టు మహాత్మా గాంధీ ప్రకటించారు. 1922 ఫిబ్రవరి 4న గోరఖ్​పూర్​ జిల్లాలోని చౌరి–చౌరాలో హింసాత్మక సంఘటనలు చోటు చేసుకోవడంతో గాంధీ ఈ నిర్ణయం తీసుకున్నారు. చౌరి–చౌరాలో పోలీసులు ఆందోళనకారులపై కాల్పులు జరిపారు. దీంతో అల్లరి మూకలు పోలీస్​ స్టేషన్​కు నిప్పుపెట్టాయి. 22 మంది పోలీసులు చనిపోవడంతో ఈ ఘటనపై గాంధీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హింసను వ్యతిరేకించే గాంధీ.. ఉద్యమం శాంతియుత పంథాలోనే సాగాలని సూచించారు. గాంధీ నిర్ణయాన్ని అప్పట్లో చాలా మంది కాంగ్రెస్​ నేతలు వ్యతిరేకించారు. సహాయ నిరాకరణ ఉద్యమం తీవ్ర రూపం దాలుస్తున్న సమయంలో గాంధీ దానిని ఉపసంహరించుకున్నారని, ఇది సరైన నిర్ణయం కాదని వారంతా భావించారు. అలీ బ్రదర్స్​ పార్టీ నుంచి వెళ్లిపోగా.. మోతీలాల్​ నెహ్రూ, చిత్తరంజన్​ దాస్​ స్వరాజ్​ పార్టీని ఏర్పాటు చేసి ఎన్నికల్లో పోటీ చేశారు. గాంధీకి మాత్రం ఏం జరిగినా తన లక్ష్యం మాత్రమే ముఖ్యం. అహింస ద్వారా ఉద్యమాన్ని నడపడానికి వీరంతా సిద్ధంగా లేరని అప్పుడు ఆయన భావించారు.
 

జెండా సత్యాగ్రహ
1923లో నాగ్​పూర్, జబల్​పూర్​లో జెండా సత్యాగ్రహను ప్రారంభించారు. సహాయ నిరాకరణ ఉద్యమం తర్వాత బ్రిటీష్​ పాలకులకు వ్యతిరేకంగా చేపట్టిన పెద్ద ఉద్యమం ఇదే. ఇందులో భాగంగా ప్రభుత్వ, ప్రైవేటు భవనాలపై జెండాలను ఎగురవేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్​ పార్టీ బ్రిటీష్​ పాలన చట్టబద్ధతను చాలెంజ్​ చేశారు. దీంతో జాతీయ జెండాలను ఎగరవేయడానికి ఆంక్షలు విధించారు. 1930లో శాసనోల్లంఘన ఉద్యమం మొదలైంది. చట్టాలను ప్రభావవంతంగా ఉల్లంఘించడం ఇక్కడి నుంచే మొదలైంది. చివరగా 1942లో క్విట్ ఇండియా ఉద్యమంతో సమరశంఖం పూరించారు. ఇదే 1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్ర్యం వచ్చేందుకు నాంది పలికింది. మొత్తంగా మూడు రంగుల జెండా స్వాతంత్ర్య పోరాటానికి ప్రతీకగా నిలిచింది. ఇప్పుడు న్యూఇండియా రూపుదిద్దు కోవడానికి స్ఫూర్తిగా నిలుస్తోంది.
- పర్సా వెంకట్​, పొలిటికల్​ ఎనలిస్ట్​