మన్యం పోరాటానికి వందేండ్లు

దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాన్ని తృణప్రాయంగా భావించి, తెల్లదొరల పెత్తనంపై విప్లవ శంఖం పూరించి, ఉద్యమ పోరులోనే అసువులు బాసిన అమర వీరుల్లో అల్లూరి సీతారామరాజు పిన్నవయస్కుడు. ప్రత్యేకించి విశాఖ మన్యం ప్రాంతంలోని ఆదివాసీల మనుగడ కోసం, వారి స్వయం పాలన కోసం ఆదివాసీల సారథ్యంలో బ్రిటీష్ పాలకులను ఎదిరించిన మన్యం వీరుడు అల్లూరి. ఆయన1922 –1924 మధ్యకాలంలో సాగించిన సమరమే ‘మన్యం పోరాటం’గా స్థిరపడింది.  సీతారామరాజు అసలు పేరు అల్లూరి శ్రీరామరాజు. ఆయన 1897 జులై 4న విశాఖ జిల్లాలోని పద్మనాభ మండలం పాండ్రంగి గ్రామంలో అమ్మమ్మ ఇంట్లో వెంకట రామరాజు, సూర్య నారాయణమ్మ దంపతులకు జన్మించాడు.  విద్యాభ్యాసం కాకినాడ, తుని, రాజమండ్రి, విశాఖ పట్నంలో సాగినా విప్లవభావాలకు ప్రభావితుడైన సీతారామ రాజు ఆంగ్ల విద్యపై ఆసక్తి చూపక విలువిద్య, గుర్రపు స్వారీ, హస్త సాముద్రికం, యోగా వంటి విద్యల్లో నైపుణ్యం సాధించాడు. బిపిన్ చంద్రపాల్ ఉపన్యాసాలతో ప్రభావితుడైన అల్లూరి17 ఏళ్ల చిన్న వయసులోనే పశ్చిమ బెంగాల్ సందర్శించాడు. రామరాజులో స్వాతంత్ర్య కోరికతో పాటు ఆధ్యాత్మిక భావాలు వికసించాయి. కృష్ణదేవి పేటలోని నీలకంఠేశ్వర మందిరంలో ఉంటూ ఆ పరిసరాల్లో ఉండే భగత, కొండదొర, కోయ గిరిజనులతో చెలిమి చేశాడు. ఆదివాసులకున్న మూఢ నమ్మకాలను, దుర్గుణాలను పోగొట్టాడు. 

ప్రత్యక్ష పోరాటంతో..

బ్రిటీష్ పాలక ప్రతినిధులు, తాబేదార్లు ఆదివాసుల శ్రమ శక్తిని దోచుకుంటున్న తరుణంలో అల్లూరి ఆదివాసీల్లో నవ చైతన్యం నింపి , తెల్లదొరలపై తిరుగుబాటు పంథాను నూరిపోశాడు. మన్యం పోరాటం ద్వారా స్వాతంత్య్ర సమరానికి అనువైన సంప్రదాయ ఆయుధాలకు పదును పెట్టాడు. రంపచోడవరం, కృష్ణదేవిపేట, తుని, అన్నవరం ప్రాంతాల్లోని కొండ జాతి గిరిజన బాధితులందరూ రామరాజు నాయకత్వాన్ని బలపరిచారు. అల్లూరి పోరాటానికి దన్నుగా ఆదివాసీ ప్రజల నుంచి గంటందొర, మల్లుదొర, అగ్గిరాజు,  సింగన్న, పడాలు వంటి ఆదివాసీ వీరులు ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచి నడిపించారు. ఆదివాసీల సహకారంతోనే ఆయన తన పోరాటాన్ని విశాఖ మన్యం నుంచి ఆరంభించారు. బ్రిటీష్ ముష్కరులు అల్లూరిని బందిపోటుగా ప్రచారం చేయడంతో 1922 ఆగస్టు 22 నుంచి ఆదివాసీల నాయకుల సహకారంతో ప్రత్యక్షపోరుకు సిద్ధపడ్డాడు. పోలీసు స్టేషన్లపై దాడులు సాగించి ఆయుధాలు పట్టుకెళ్లడం వంటివి చేస్తూ బ్రిటీష్ పాలకుల గుండెల్లో రైళ్లు పరుగెత్తించాడు. మన్యం పోరాటంలో తొలి రోజున 300 మంది గిరిజనులతో కలిసి చింతపల్లి స్టేషన్​పై దాడి చేసి ఆయుధాలు పట్టుకెళ్లారు. ఆగస్టు 23న కృష్ణదేవి పేట, 26న రాజవొమ్మంగి, అక్టోబర్15వ అడ్డతీగల, 19న రంపచోడవరం స్టేషన్లపై వరుసగా దాడులు చేయడం ప్రకంపనలు సృష్టించింది. 1923 ఏప్రిల్17న అన్నవరం, మే 31న కొయ్యూరు స్టేషన్లపై దాడుల తర్వాత మన్యం పోరాటాన్ని తీవ్రమైనదిగా పరిగణించిన పాలకులు మలబార్ పోలీసులతో పాటు అస్సాం రైఫిల్స్ ను రంగంలోకి దించారు. కొయ్యూరు సమీపంలోని నడింపల్లె వద్ద మల్లుదొరను బంధించిన పోలీసులు, అల్లూరిని పట్టిచ్చిన వారికి బహుమతిస్తామని ప్రకటించారు. 

పోడు సమస్యకు పరిష్కారమేది?

1924లో గుంటూరు కలెక్టర్​గా వచ్చిన రూథర్ ఫర్డ్ ను ఏజెన్సీ ప్రాంత ప్రత్యేక కమిషనర్ గా ప్రభుత్వం నియమించింది. అల్లూరిని పట్టివ్వాలంటూ రూథర్ ఫర్డ్ కొండమీద, కొండ కిందున్న మన్యం ప్రజలపై దమన కాండ సాగించాడు. ఈ ఉద్యమం వల్ల మన్యం గిరిజనులకు ఇబ్బంది కలగడం పట్ల అల్లూరి ఓసారి మదన పడ్డాడు. 1924 మే 7న సూర్యోదయ వేళ అల్లూరిని అరెస్టు చేసి, మంప సమీపంలోని రాజేంద్ర పాలెం పుంత దారిలో చెట్టుకు కట్టేసి దారుణంగా కాల్చి చంపారు. రామరాజు 26 ఏండ్లకే వీర మరణం పొందాడు. ఇది 20 నెలల పోరాటమే అయినా అల్లూరి ఉద్యమ స్ఫూర్తి మన్నెం గుండెల్లో చెరగని ముద్ర వేసింది. తెలంగాణలో పోడు సమస్య రోజురోజుకు జటిలంగా మారుతోంది. పోడుభూములకు పట్టాలిస్తామని రాజకీయ ప్రకటన చేసిన సీఎం కేసీఆర్, హరతహారం మొక్కలు నాటాలని ఫారెస్ట్​ ఆఫీసర్లను సిబ్బందిని పోడు భూములకు పంపుతున్నారు. దీంతో ఫారెస్ట్​సిబ్బంది, ఆదివాసీలకు నిత్యం పోరాటమే సాగుతోంది. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి పోడు సమస్యను పరిష్కరించాలి. 

- గుమ్మడి లక్ష్మీనారాయణ,

ఆదివాసీ రచయితల వేదిక