- మహారాష్ట్ర నుంచి పోటెత్తిన వరద
- ఆసిఫాబాద్‌లో దంచి కొట్టిన వాన
ఆదిలాబాద్/నిర్మల్/ఆసిఫాబాద్, వెలుగు : ఆదిలాబాద్ వ్యాప్తంగా రెండు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు పొంగుతున్నాయి. జైనథ్ మండలంలో పెన్ గంగా ఉగ్ర రూపం దాల్చింది. బ్యాక్ వాటర్ తో కౌట, సాంగ్డి, ఆనంద్ పూర్, కూర, కరంజి గ్రామాల్లో పత్తి, సోయాబిన్ పంటలు నీట మునిగాయి. దాదాపు 500 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ గౌస్ ఆలం పెన్ గంగా నది పరివాహక ప్రాంతాల్లో పర్యటించారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఆసిఫాబాద్ జిల్లాలో ఆదివారం రాత్రి కుండపోత వాన కురిసింది. జనజీవనం స్తంభించింది. కల్వర్టులు కొట్టుకుపోయాయి. రాకపోకలు బంద్ అయ్యాయి.
జిల్లాల్లో ఇదీ పరిస్థితి..
- ఆదిలాబాద్‌లోని రూరల్, బజార్హత్నూర్, బోథ్, ఇచ్చోడ, తాంసి, తలమడుగు గుడిహత్నూర్, ఉట్నూర్ లో పంటలు నీట మునిగాయి.
- జైనథ్ మండలంలోని కామాయి రోడ్డుపై, నక్కల్ గుట్ట వంతెనపై నుంచి వరద పారుతోంది. పలు గ్రామాల్లో కరెంట్ ఫీడర్లు దెబ్బతిన్నాయి.
- ఉట్నూర్ మండల కేంద్రంలోని ప్రధాన రహదారి నీట మునిగింది.
- బేల మండలంలో మూడు విద్యుత్ సబ్ స్టేషన్ల ఇన్సులేటర్స్ పేలిపోవడంతో కొత్తవాటిని ఏర్పాటు చేశారు.
- భారీ వర్షాల కారణంగా దక్షిణ మధ్య రైల్వే పలు రైళ్లను రద్దు చేయగా ఆదిలాబాద్ నుంచి తిరుపతి కి రాత్రి 9 గంటలకు వెళ్లే కృష్ణా ఎక్స్ ప్రెస్ ను రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.
- ఆసిఫాబాద్ జిల్లాలో అప్పెపెల్లి తాత్కాలిక వంతెన , మాలన్ గొంది వద్ద కల్వర్టు కొట్టుకుపోయాయి.
- గుండి వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి.
- సిర్పూర్ టీ ,చింతలమానేపల్లి, కౌటల మండలాల్లో ప్రాణహిత, వార్దా నదులు ఉగ్రరూపంతో ప్రవహిస్తుండటంతో బ్యాక్ వాటర్ తో వందలాది ఎకరాల మిర్చి, పత్తి పంట నీటమునిగింది.
- సిర్పూర్ టీ మండలం వెంకట్ రావు పేట్ వద్ద వార్ధ నదీ, కౌటల మండలం తుమ్మిడి హెట్టి వద్ద ప్రాణహిత నదీ ఉప్పొంగి ప్రవహిస్తోంది.
- నీట మునిగిన పంటలను, తుంపెల్లి వాగును , కొట్టుకోపోయిన మాలన్ గోంది కల్వర్టును కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే పరిశీలించారు.
- నిర్మల్ జిల్లాలో కడెం, స్వర్ణ ప్రాజెక్టుల్లోకి వరద చేరుతోంది. గంట గంటకు ప్రవాహం పెరుగుతోంది.
- కలెక్టర్ అభిలాష అభినవ్, ఎస్పీ జానకి షర్మిల, అడిషనల్ కలెక్టర్లు కిశోర్ కుమార్,ఫైజాన్ అహ్మద్ వరద ప్రాంతాలను సందర్శించారు.
- ఆదివారం రాత్రి ఒంటిగంటకు కడెం ప్రాజెక్టుకు రెండు లక్షల 30 వేల క్యూసెక్కుల నీరు రావడంతో అధికారులు 18 గేట్లను పైకెత్తి 2,7 2,000 క్యూసెక్కుల నీటిని వదిలారు. స్వర్ణ ప్రాజెక్టుకు ఎనిమిది వేల క్యూసెక్కుల వరద రావడంతో మూడు గేట్ల ద్వారా 2,180 క్యూసెక్కుల నీటిని వదిలారు.
- లక్ష్మణచందా మండలం ధర్మారం – సోన్ మధ్య బ్రిడ్జి కొట్టుకుపోయింది. – ఖానాపూర్ లోని హైటెక్ కాలనీకి ప్రధాన రోడ్డు తెగిపోయింది.
- ముధోల్ నియోజకవర్గ కేంద్రంలో, సారంగాపూర్ మండలంలో వాగులు పొంగాయి.