భూనిర్వాసితులకు న్యాయం చేయని ప్రభుత్వం

భూనిర్వాసితులకు న్యాయం చేయని ప్రభుత్వం

నిరసనలు అన్నీ ఒకటి కావు. ఒక్కో నిరసన వెనుక ఒక్కో కారణం, కడుపునొప్పి, బాధ, అసౌకర్యం, ఆవేదన, తండ్లాట ఉంటాయి. అది వినే, అర్థం చేసుకునే సహనం పాలకులకు ఉండాలె! ఎందుకంటే, ఇది ప్రజాస్వామ్యం. నిరసన న్యాయబద్ధమైందే అయితే సమస్య పరిష్కరించే చర్యలు చేపట్టాలె!  నిరసన నిర్హేతుకమైతే కొట్టిపారేయొచ్చు. శృతి మించితే నియంత్రించవచ్చు. హింసకు దారితీస్తే బలప్రయోగం చేసైనా ఆపొచ్చు. కానీ, అది ఏ కారణపు నిరసన అయినా సరే, వినేది లేదు, కనేది లేదు ఒకటే మంత్రం.. దాన్ని నలిపేసే, గొంతు నులిమేసే, కర్కశంగా అణగదొక్కే, పోలీసు జులుంతో నియంత్రించే సాకుతో రాజ్యమే హింసకు తలపడితే అది అరాజకమే తప్ప ప్రజాస్వామ్యం అనిపించుకోదు. తెలంగాణలో ఇప్పుడదే జరుగుతోంది. అదీ, కోరి, పోరి, రక్తతర్పణాలతో సాధించుకున్న స్వరాష్ట్రంలో ఈ పరిస్థితేమిటని జనం ఆశ్చర్యపోతున్నారు.

ప్రాజెక్టు కింద భూములు ఇచ్చిన, ఇచ్చే ఇష్టం లేక పోయినా ప్రభుత్వ నిర్బంధం వల్ల కోల్పోయిన వారిది కడలిని గుర్తు తెచ్చే కన్నీటి కథ! ఉన్న ఒక్క జీవన ఆధారం కోల్పోయి బతుకు బజారున పడిందన్నది ఒక బాధ అయితే, రావాల్సిన పరిహారమైనా ఇప్పించండి  మహా ప్రభో.. అంటే పోలీసులతో దాడులు చేయించి నెత్తురోడేలా గాయపరచడం మరింత బాధ! ఇప్పటికే ప్రత్యక్షంగా, పరోక్షంగా వందలాది రైతులు భూమి కోసం, భుక్తి కోసం పెనుగులాటల్లో వారి విలువైన ప్రాణాలు కోల్పోయారు. బాధ తట్టుకోలేక గుండె ఆగిన వారు కొందరైతే, పెద్ద సంఖ్యలో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. భూ యజమానులు, నిర్వాసితులై నిరసన తెలుపుతున్న రైతుల పట్ల ప్రభుత్వం ఎందుకో నిర్దయగా ఉంది. తగిన నష్టపరిహారం ఇవ్వకపోగా ఒక్కో ప్రాంతానికి ఒక్కో నష్ట పరిహారం ఇస్తూ.. వివక్ష పాటిస్తోంది. మల్లన్నసాగర్​ భూనిర్వాసితులకు ఒక రకం ప్యాకేజీ ఇస్తూ.. గౌరవెల్లి నిర్వాసితులకు ఇంకో రకం పరిహారంతో వివక్ష చూపితే, బాధితుల గుండె తరుక్కుపోవడం సహజం. న్యాయం చేయండని రోడ్డెక్కిన వారిని లాఠీలు విరిగేలా, తలలు పగిలేలా కొడితే ఇక వారు ఎక్కడ మొరపెట్టుకోవాలి? వారికేది దిక్కు? నిరుపేదల్ని, నిర్వాసితుల్ని నిరసనకారుల్ని కడుపున పెట్టుకొని కాపాడాల్సిన సర్కారే కన్నెర్ర జేస్తే వారెలా తట్టుకోగలుగుతారు? న్యాయస్థానాలకు వెళ్లి ‘స్టే’లు తెచ్చుకున్నా.. అమలు పరిచే దిక్కులేనప్పుడు సదరు దీనులకు దిక్కెవరు? తెలంగాణలో ఇయ్యాల వేల సంఖ్యలో కోర్టు ధిక్కార కేసులు విచారణలో ఉండటం ఈ దుస్థితికి నిదర్శనం. 

భూమి నుంచి వేరు చేస్తే పుట్టెడు దు:ఖం
మనిషి పుట్టింది మొదలు భూమితో విడదీయరాని బంధం ఉంటుంది. అది కేవలం భౌతికమైంది, యాజమాన్య భావనకు సంబంధించింది మాత్రమే కాదు. అందుకు అతీతమైన మరేదో బంధం శాశ్వతత్వ భావనతో కట్టి పడేస్తుంది. అందుకే అంటారు గంటెడైనా, గుండెడైనా.. భూమి ఉంటే ఆ భరోసాయే వేరు! అని. ఆస్తిగానే కాదు భూమిని అస్తిత్వపు ఉనికిగా, భూమికగా, చిరునామాగా ఈ సమాజం చూస్తుంది కాబట్టే మనిషికి అంతటి పెనుగులాట! తాను నమ్ముకున్న భూమి తనకు కాకుండా పోతుందంటే.. రోజులు, నెలలు, యేండ్ల తరబడి ఏడుస్తాడు. రక్తం చిందించాల్సి వస్తుందని తెలిసినా నిరసనతో రోడ్డెక్కుతాడు, తను గతించాక కుటుంబం ఆగమైతుందని తెలిసినా.. ఆత్మహత్యకు సాహసిస్తాడు. మట్టికి – మనిషికి ఉన్న బంధం అలాంటిది. ఇది గ్రహించని ప్రభుత్వాలు చీమల్ని తరిమినట్టు భూముల నుంచి నిరుపేదలు, బడుగు జీవులు, బక్క రైతుల్ని తరిమేస్తున్నాయి. ప్రాజెక్టులనో, ప్రభుత్వ కార్యక్రమాలనో, ఫార్మా కంపెనీలనో, విమానాశ్రయాలనో, అడవుల రక్షణ అనో చెంచులతో సహా బీదా–బిక్కీని పాలకులు భూమి నుంచి ఎళ్లగొడుతున్నారు. నాటి నాగార్జున సాగర్, సోమశిల, మంజీర ప్రాజెక్టుల నుంచి నిన్నటి కాళేశ్వరం, నిమ్జ్, అమరావతి, భోగాపురం ఎయిర్​పోర్టు, ఫార్మాసిటీ వరకు.. నిర్వాసితులను ఎవరిని కదిలించినా కన్నీటి గాథలే! భూములు కోల్పోయి పరిహారం, కోర్టుల్లో పోరాడి అదనపు నష్టపరిహారం పొందినా.. అటో ఇటో బాగుపడ్డ కుటుంబాలు 20 శాతం కూడా ఉండవు. 80 శాతానికి పైగా చితికిపోయిన కుటుంబాలే! 

భూమి ఇచ్చేది పోయి.. లాక్కుంటున్న సర్కారు
భూమిలేని దళిత పేద కుటుంబాలకు మూడేసి ఎకరాల భూమి ఇస్తానని మాట తప్పిన ప్రభుత్వం పేద రైతుల వ్యవసాయ సాగు భూముల్ని ఇతరేతర అవసరాలను చెప్పి లాక్కుంటోంది. వాళ్ల సమ్మతి లేకుండా, న్యాయబద్ధమైన పరిహారం ఇవ్వకుండా బలవంతంగా భూమి తీసుకోవడాన్ని, రాజ్యం తనకున్న అధికార బలంతో లాక్కోవడం అనకుండా ఇంకేమంటారు? పర్యావరణ హితంతో అయినా, సమాజ విశాల ప్రయోజనం దృష్ట్యా అయినా.. ప్రభుత్వాలకు ఒక స్పష్టమైన భూ వినియోగ విధానం(ల్యాండ్​ యూసేజ్​ పాలసీ) ఉండాలి. ఇప్పటి వరకున్న ప్రభుత్వభూముల్ని తెగనమ్మడం, మరో పక్క బీదా బిక్కి, బడుగు బలహీన వర్గాలు, రైతుల భూముల్ని లాక్కొని ప్రాజెక్టులకో, కార్పొరేట్​కంపెనీలకో వినియోగిస్తూ పోతే ఆర్థిక అసమానతలు ఇంకా పెరుగుతాయి. శాంతి సమస్యలో పడే ప్రమాదం ఉంటుంది తస్మాత్​ జాగ్రత్త!.

రాష్ట్రాల సొంత చట్టాలు
 కేంద్రంలో 2014లో ఏర్పాటైన ఎన్డీఏ ప్రభుత్వమే సవరణల ద్వారా 2013 భూసేకరణ చట్టాన్ని బలహీన పరిచేందుకు యత్నిస్తే.. సుప్రీంకోర్టు సమర్థంగా అడ్డుకుంది. దాంతో దొడ్డిదారిన గుజరాత్​వంటి బీజేపీ పాలిత రాష్ట్రాలు తగు సవరణలతో రాష్ట్ర స్థాయిలో భూసేకరణ చట్టాలు తెచ్చుకున్నాయి. ఇందుకు కేంద్రంతోపాటు రాష్ట్రపతి ఆమోదం ఉండాలి. కనుసైగ చేసిందే తాను కనుక, తన సమ్మతితోపాటు రాష్ట్రపతి ఆమోదంలోనూ కేంద్రం సహకరించింది. తెలంగాణ, ఏపీ రెండు తెలుగు రాష్ట్రాలు అదే బాటపట్టాయి. భూ యజమాని ఇష్టం, సాగుభూమి అయితే సేకరించకుండా ప్రాధాన్యత, మార్కెట్​ధరకన్నా మూడింతల నష్టపరిహారం చెల్లింపు, చక్కటి పునర్నిర్మాణ–పునరావాస కార్యక్రమం, కంపెనీలకు సేకరించేటప్పుడు గ్రామసభ అనుమతి, సామాజిక పర్యావరణ ప్రభావాల అధ్యయనం– అంచనా.. ఇవన్నీ తప్పనిసరి అని 2013 చట్టంలో ఉన్నాయి. వాటన్నింటికీ గండికొట్టి ఇప్పుడు దాదాపు అన్ని రాష్ట్రాలు ఇదే బాటలో నడుస్తున్నాయి. ఇది తప్పని 2018లోనూ సుప్రీంకోర్టు గుజరాత్, తెలంగాణ, ఏపీ తమిళనాడు, ఝార్ఖండ్​ రాష్ట్రాలను మందలించింది. ఎందుకలా చట్టాన్ని సవరించాల్సి వచ్చిందో వివరణ ఇవ్వాలని ఆ మేరకు నోటీసులు కూడా పంపింది. సొంత చట్టాలతో పైనిబంధనలు లేకుండా సర్కార్లు ప్రజల భూముల్ని సేకరణ పేరుతో లాక్కుంటున్నాయి.

మేలైన చట్టానికి తూట్లు పొడిచి..
భూములు తీసుకొని నష్టపరిహారం ఇచ్చాం కదా, ఇంకేంటి?.. అనే సర్కారు వారి అహంకార ధోరణి సరైంది కాదు. ఏ నష్టపరిహారమూ రైతులు, ఇతర భూ హక్కుదారులెవర్నైనా.. భూమి నుంచి వేరుపరిచిన పాపానికి పరిహారం ఉండదు. ప్రత్యామ్నాయం ఎన్నటికీ కాజాలదు. ఏ భూమినైనా ప్రజాప్రయోజనాల కోసం తీసుకునే, తీసుకోగలిగే శక్తి రాజ్యానికి ఉంటుంది. అంతమాత్రాన అది ఏకపక్షంగా, వ్యక్తి ప్రయోజనాలకు భంగకరంగా, అప్రజాస్వామికంగా ఉండకూడదన్నది మన రాజ్యాంగ స్ఫూర్తి. కానీ వరుస ప్రభుత్వాలు ఈ స్ఫూర్తికి గండికొట్టి దశాబ్దాల తరబడి ఏకపక్షంగా వ్యవహరించాయి. పౌరుల ఆందోళనలు, పౌరసంఘాల నిరసనలు, న్యాయ స్థానాల మందలింపుల ఫలితంగా 2013లో అప్పటి ప్రభుత్వం గొప్ప భూసేకరణ చట్టం తీసుకొచ్చింది. వ్యక్తులకే కాకుండా విశాల సమాజహితంతో, ఎంతో ప్రయోజనకర అంశాలతో ఉన్న ఈ చట్టానికి దాదాపు అన్ని సర్కార్లు తర్వాతి కాలంలో  తూట్లు పొడవటం మొదలెట్టాయి.
- దిలీప్ రెడ్డి.dileepreddy.r@v6velugu.com