కామారెడ్డిలో రైతుల కన్నెర్ర

కామారెడ్డిలో రైతుల కన్నెర్ర
  • ర్యాలీలు, ధర్నాలతో 10 గంటలపాటుహైటెన్షన్
  • వందలాదిగా తరలివచ్చి కలెక్టరేట్ ​ఎదుట ఆందోళన
  • రైతు రాములు ఆత్మహత్యకు సర్కారే కారణమని ఆగ్రహం
  • కలెక్టర్​ వచ్చి వినతిపత్రం తీసుకోవాలని పట్టు
  • కలెక్టర్​ రాకపోవడంతో లోపలికి వెళ్లేందుకు ప్రయత్నం
  • అడ్డుకున్న పోలీసులు.. తోపులాట.. పలువురికి గాయాలు
  • ఇయ్యాల కామారెడ్డి బంద్

కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి కొత్త మాస్టర్​ప్లాన్​కు వ్యతిరేకంగా గురువారం వందలాది మంది రైతులు కదం తొక్కారు. తమను సంప్రదించకుండా తమ భూములను ఇండస్ట్రియల్​, గ్రీన్​జోన్​లో పెట్టడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. కుటుంబసభ్యులతో కలిసి వచ్చి కామారెడ్డి కలెక్టరేట్​ ముందు బైఠాయించారు. పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. పలువురు గాయపడ్డారు. కొందరు మహిళలు స్పృహ తప్పి పడిపోయారు. ర్యాలీలు, ధర్నాలతో దాదాపు 10 గంటల పాటు కామారెడ్డి పట్టణంలో హైటెన్షన్​ వాతావరణం నెలకొంది. మాస్టర్​ ప్లాన్​కు వ్యతిరేకంగా నెలరోజులుగా ఆందోళన చేస్తున్నా ఎవరూ పట్టించుకోకపోవడం, తన భూమి ఇండస్ట్రియల్​ జోన్​లోకి పోతే తనకు నష్టం జరుగుతుందన్న ఆవేదనతో రాములు అనే రైతు బుధవారం ఆత్మహత్య చేసుకోవడంతో సర్కారుపై రైతులు కన్నెర్ర చేశారు. రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో అడ్లూర్​, అడ్లూర్​ఎల్లారెడ్డి, టెకిర్యాల్, లింగాపూర్​, ఇల్చిపూర్​ గ్రామాలకు చెందిన వందలాది మంది  రైతులు తమ కుటుంబ సభ్యులతో కలిసి గురువారం ఉదయమే కామారెడ్డి జిల్లా కేంద్రానికి తరలివచ్చారు. 

సీఎస్​ఐ గ్రౌండ్​ వద్ద జమకూడిన రైతులకు బీజేపీ, కాంగ్రెస్​ లీడర్లు మద్దతిచ్చారు. ఉదయం 11 గంట లకు వీరంతా భారీ ర్యాలీగా.. కొత్త బస్టాండ్,  నిజాంసాగర్​ చౌరస్తా, రైల్వే కమాన్​,  స్టేషన్​ రోడ్డు,  గంజ్​రోడ్డు, సిరిసిల్లా రోడ్డు, పాత బస్టాండ్​ మీదుగా కలెక్టరేట్​కు బయలుదేరారు. అడ్లూర్​ రోడ్డులో పోలీసులు బారికేడ్లు పెట్టి అడ్డుకునేందుకు ప్రయత్నించగా.. వాటిని తోసుకుంటూ మధ్యాహ్నం ఒంటి గంటకు కలెక్టరేట్​కు వచ్చారు.  

కలెక్టర్​ లేరని ఓ సారి.. ఉన్నారని మరోసారి చెప్పడంతో..!

కొందరు రైతులు బారికేడ్లను తోసుకుంటూ కలెక్టరేట్​ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా.. పోలీసులు గేట్లు వేసి అడ్డుకున్నారు. తాము కలెక్టర్ జితేష్​ వి. పాటిల్​ను కలిసి అభ్యంతరాలు చెప్పుకుంటామని, వినతిపత్రం ఇచ్చి వస్తామని రైతులు చెప్పినా పోలీసులు లోప లికి అనుమతించలేదు. దీంతో  రైతులు గేట్ల ఎదుటే బైఠాయించారు. తమను లోపలికి అనుమతించనందున కలెక్టరే తమ వద్దకు వచ్చి వినతిపత్రం తీసుకోవా లని డిమాండ్​ చేశారు. రైతులకు మద్దతుగా దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్​రావు, మాజీ ఎమ్మెల్మే  రవీందర్​రెడ్డి ధర్నాలో కూర్చున్నారు. కలెక్టర్​ అందుబాటులో లేరని ఓ సారి, హైదరాబాద్​వెళ్లారని మరోసారి పోలీ సులు చెప్పడంతో రైతులు మండిపడ్డారు. చివరికి కలెక్టర్​ లోపలే ఉన్నారని, ఐదుగురు ప్రతినిధులు వచ్చి వినతి పత్రం ఇవ్వాలని పోలీసులు చెప్పగా.. రైతులు ఒప్పుకోలేదు. మధ్యాహ్నం 3 గంటల దాకా కలెక్టరే తమ వద్దకు వచ్చి వినతి పత్రం తీసుకోవాలని, లేదంటే తామే కలెక్టరేట్​లోకి చొచ్చుకెళ్తామని ప్రకటించారు. 

తోపులాట.. పలువురికి గాయాలు

డెడ్​లైన్​ ముగుస్తున్నా కలెక్టర్​ రాకపోవడంతో  రైతులు కలెక్టరేట్​లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీ  సులు భారీగా మోహరించి.. కలెక్టరేట్​ లోపలి గేట్లకు అడ్డుగా ఇనుపకంచె వేశారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. పలువురు రైతులు కిందపడ్డారు. కొందరు గేట్లు ఎక్కి లోపలకు దూకగా, పోలీసులు బయటకు గుంజుకొచ్చారు. తోపులాటలో పలువురు రైతులు, ఓ కానిస్టేబుల్​కు గాయాలయ్యాయి. కొందరు మహిళలు స్పహతప్పి పడిపోయారు. రామేశ్వర్​పల్లికి చెందిన రైతు సంతోష్​రెడ్డి తీవ్రంగా గాయపడ్డాడు. అడ్లూర్​ఎల్లారెడ్డికి చెందిన స్వామి, ఆయన భార్య,  మరో రైతుకు గాయాలయ్యాయి. కానిస్టేబుల్​ ఇర్ఫాన్​ కిందపడి పోయారు. అడిషనల్​ ఎస్పీ అన్యోన్య, ఎమ్మెల్యే రఘునందన్​రావు మధ్య వాగ్వాదం జరిగింది.  రైతులను,  ఎమ్మెల్యేను, ఇతర లీడర్లను పోలీసులు అరెస్టు చేయడానికి ప్రయత్నించగా.. మరోసారి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. 

కలెక్టర్​ ఫొటోకు వినితిపత్రం ఇచ్చి..!

సాయంత్రం 5 గంటల తర్వాత  ఎస్పీ శ్రీనివాస్​రెడ్డి వచ్చి రైతులు, లీడర్లతో మాట్లాడారు. ఐదుగురు ప్రతినిధులు వస్తే  కలెక్టర్​కు వినతి పత్రం ఇచ్చే అవకాశం కల్పిస్తానని చెప్పగా.. ఇందుకు రైతులు ఒప్పుకోలేదు. కలెక్టరే వచ్చి వినతి పత్రం తీసుకునేలా ఒప్పించాలని, ఏ రైతు కూడా ఏమీ అనకుండా తాము బాధ్యత తీసుకుంటామని ఎమ్మెల్యే  రఘునందన్​రావు ఎస్పీకి చెప్పి పంపించారు. చివరికి రాత్రి 8 గంటల దాకా వేచిచూసిన రైతులు  కలెక్టర్​రాకపోవడంతో ఆయన ఫొటోకు వినతిపత్రం అందజేసి వెనుదిరిగారు.  ఆందోళనలో బీజేపీ కామారెడ్డి నియోజకవర్గ ఇన్​చార్జి వెంకటరమణరెడ్డి,  కాంగ్రెస్​ పీసీసీ లీడర్​ వడ్డేపల్లి సుభాష్​రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

తమ పరిస్థితి ఏంది?: రైతుల ఆవేదన

తమ భూములను ఇండస్ట్రియల్​జోన్​లో పెడ్తే తమ పరిస్థితి ఏమిటని రైతులు, వాళ్ల కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తంచేశారు. ప్రాణాలు పోతున్నా ప్రభుత్వం స్పందించడం లేదని మండిపడ్డారు. రైతుల ర్యాలీ పాత బస్టాండ్​కు చేరుకొగానే  అక్కడికి వచ్చిన అడ్లూర్​ఎల్లారెడ్డి సర్పంచ్​ భర్త పైడి జనార్దన్​ను మహిళ రైతులు నిలదీశారు. దీంతో జనార్దన్​ పరుగెత్తుకుంటూ వెళ్లి ఓ షాపులోకి దాక్కున్నారు. అంతకుముందే అడ్లూర్​ ఎల్లారెడ్డికి చెందిన  ఉప సర్పంచ్​ లక్ష్మీపతి, మరి కొందరు వార్డు సభ్యులు తమ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కాగా, కామారెడ్డి కలెక్టరేట్​ వద్ద రైతులు ఆందోళన ముగించుకొని వెళ్తుండగా  కొందరు వ్యక్తులు భిక్కనూరు సీఐ వెహికల్​ అద్దాలు పగులగొట్టారు. కాగా, మాస్టర్​ ప్లాన్​కు వ్యతిరేకంగా శుక్రవారం కామారెడ్డి బంద్​కు రైతు ఐక్య కార్యాచరణ కమిటీ పిలుపునిచ్చింది. 

నా భూమిల నుంచి రోడ్డు తిస్తరట

లింగాపూర్​ చెరువు కింద నాకు  2 ఎకరాల భూమి ఉంది.  ఏడాదికి రెండు పంటలు పండిస్తా.  కామారెడ్డి మున్సిపాల్టీ మాస్టర్​ ప్లాన్​లో నా భూమి గ్రీన్​ జోన్​లో పెట్టిన్రు. మళ్లా నా భూమిలో నుంచి  80 ఫీట్ల రోడ్డు పోతదట. గిట్లయితే ఎట్లా.. కనీసం నాకు చెప్పకుండానే  గీవన్ని జేస్తున్రు. కొందరి వెంచర్ల కోసం నా భూమిలో నుంచి రోడ్డు పెడుతున్రు. ‑ జి.రాజిరెడ్డి, రైతు- లింగాపూర్​ 

భూమి విలువ తగ్గిస్తున్నరు

నాకు ఇల్చిపూర్​ శివారులో 2 ఎకరాల భూమి ఉంది. ఏడాది మొత్తం పంటలు పండించుకొని బతుకుతా.  ఇవి మంచి విలువైన భూములు. గిప్పుడు ఇండస్ట్రియల్ జోన్​ పెడుతున్నరు. రేపు పొద్దున తప్పనిపరిస్థితిల భూమి అమ్ముకోవాలంటే ఎవరు కొంటరు? భూముల విలువ తగ్గిస్తున్నరు. ‑ ఆకుల బాలయ్య, అడ్లూర్​ఎల్లారెడ్డి