ఒక్కసారిగా పేలిన పేజర్లు.. వందల సంఖ్యలో గాయపడిన హెజ్బొల్లా సభ్యులు

ఒక్కసారిగా పేలిన పేజర్లు.. వందల సంఖ్యలో గాయపడిన హెజ్బొల్లా సభ్యులు

ఇజ్రాయెల్, లెబనాన్‎కు చెందిన హెజ్బొల్లా మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న తరుణంలో మరో షాకింగ్ ఇన్సిడెంట్ చోటు  చేసుకుంది. మంగళవారం లెబనాన్‎లోని వివిధ ప్రాంతాల్లో హెజ్బొల్లా గ్రూప్ సభ్యులు కమ్యూనికేషన్ కోసం ఉపయోగించే  ఎలక్ట్రానిక్ పేజర్లు (శాటిలైట్ ఫోన్స్ వంటివి) ఒక్కసారిగా పేలాయి. ఈ ఘటనలో ముగ్గురు మరణించగా.. వందల సంఖ్యలో హెజ్బొల్లా మెంబర్స్ గాయపడ్డట్లు అరబ్ మీడియా సంస్థలు వెల్లడించాయి. ఈ పేలుడుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‎గా మారాయి. పేజర్లు పేలుళ్ల నేపథ్యంలో గ్రూప్ సభ్యులను హెజ్బొల్లా అప్రమత్తం చేసింది. 

పేజర్లను కలిగి ఉన్న వ్యక్తులు వాటి నుండి దూరంగా ఉండాలని, వైర్‌లెస్ పరికరాలను ఉపయోగించకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. దక్షిణ లెబనాన్, తూర్పు బెకా వ్యాలీ, బీరుట్ యొక్క దక్షిణ శివారు ప్రాంతాలలోని ఆసుపత్రులు పేలుళ్లలో గాయపడిన బాధితులతో కిక్కిరిపోయాయని స్థానిక అధికారులు వెల్లడించారు. క్షతగ్రాతుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉందని.. ఈ మేరకు రక్తం దానం చేయాలని లెబనాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రజలకు పిలుపునిచ్చినట్లు స్థానిక మీడియా సంస్థలు పేర్కొన్నాయి.

కాగా, యుద్ధం నేపథ్యంలో  ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను ఇజ్రాయెల్ హ్యాక్  చేసే అవకాశం ఉండటంతో పేజర్లు (శాటిలైట్ ఫోన్స్) ఉపయోగించాలని హెజ్బొల్లా నాయకుడు హసన్ నస్రల్లా గతంలో గ్రూప్ సభ్యులను హెచ్చరించాడు. ఈ నేపథ్యంలో హెజ్బొల్లా గ్రూప్ సభ్యులు పేజర్లు ఉపయోగిస్తున్నారు. అయితే, ఇప్పుడు పేజర్లు కూడా పేలడం చర్చనీయాంశంగా మారింది. ఈ  క్రమంలో పేజర్ల పేలుడు ఘటనపై ఓ హెజ్బొల్లా సభ్యుడు మీడియాతో మాట్లాడుతూ.. అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి హ్యాండ్‌హెల్డ్ పేజర్స్ వ్యవస్థను పేల్చారని.. ఈ ఘటన వెనుక తమ శత్రువు ఇజ్రాయెల్ ఉందని అనుమానం వ్యక్తం చేశారు. పేజర్ల పేలుళ్లపై ఇజ్రాయెల్ మాత్రం ఇప్పటి వరకు స్పందించలేదు.