హమాస్​తో ఇజ్రాయెల్​ హోరాహోరీ : మల్లంపల్లి ధూర్జటి

హమాస్​తో ఇజ్రాయెల్​ హోరాహోరీ : మల్లంపల్లి ధూర్జటి

యూదుల పండుగ సిండెట్ తోరా నాడు పాలస్తీనా టెర్రరిస్టు సంస్థ హమాస్ ఇజ్రాయెల్ పై ముప్పేట దాడికి దిగింది. ఈ నెల 7న ఇజ్రాయెల్ కు ఆనుకుని ఉన్న గాజా స్ట్రిప్ నుంచి వందలాది రాకెట్లతో విరుచుకుపడింది.  మరోపక్క హమాస్ టెర్రరిస్టులు సరిహద్దులోనున్న ఉక్కు కంచెను బుల్డోజర్లతో తొలగించి, కొన్నిచోట్ల తీగలను కత్తిరించి ఇజ్రాయెల్ భూభాగంలోకి చొచ్చుకువచ్చారు. మరికొందరు పారాగ్లైడర్లతో నేరుగా ఇజ్రాయెల్ భూభాగంలోకి దిగి నరమేధం సాగించారు. కనిపించినవారినల్లా కాల్చి చంపారు.

ఇండ్లపైకి గ్రెనేడ్లు, పేలుడు పదార్థాలు విసిరి విధ్వంసం సృష్టించారు. మోర్టార్లతో దాడి చేశారు. ఇండ్లల్లోకి చొరబడి ఆడ, మగ, చిన్న పిల్లలు అనే తేడా లేకుండా విచక్షణారహితంగా కాల్చి చంపారు. కొన్నిచోట్ల పిల్లల ఎదుటే వారి పెద్దలను హతమార్చి భయోత్పాతం సృష్టించారు. రాకెట్ దాడులకు బహుళ అంతస్తుల భవనాలు పేకమేడల్లా కుప్పకూలాయి.  సంగీత ఉత్సవం వద్ద రాకెట్ దాడి చేశారు. అక్కడికి కొంత దూరంలో వాహనాల నుంచి దిగిన టెర్రరిస్టులు పారిపోతున్న సభికులను కాల్చి చంపారు. ఇజ్రాయెలీ సైనికులు, పౌరులతోపాటు చేతికి దొరికినవారిలో కొందరు విదేశీయులు కూడా ఉండగా వారిని కూడా బందీలుగా పట్టుకుని గాజాకు తీసుకుపోయారు. ఇజ్రాయెల్ తేరుకుని స్పందించడం ప్రారంభించే సమయానికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. 

ఇరాన్, సిరియాల నుంచి ఆయుధాలు

ఇజ్రాయెల్ పొరుగునున్న ఈజిప్ట్, లెబనాన్​తో గతంలో యుద్ధాలకు దిగిన  సందర్భాలున్నా ప్రస్తుతం వాటితో సాధారణ సంబంధాలనే కొనసాగిస్తోంది. సౌదీ అరేబియా కూడా ఈ మధ్య స్నేహ హస్తం చాచింది.  ఇజ్రాయెల్​ఇలా ఇతర అరబ్ దేశాలతో స్నేహ సంబంధాలు పెంపొందించుకోవడం ఇరాన్ తో సహా మరికొన్ని దేశాలకు, హమాస్ కు ఇష్టం లేదు.

ఈ స్థితిలో ఇటువంటి ఘోరాలకు పాల్పడితే గాయాలను మళ్లీ రేపినట్లు అవుతుందని, లెబనాన్ లో ఉన్న హిజ్బుల్లా టెర్రరిస్టులపైకి కూడా దాడికి దిగుతుందని ఫలితంగా యుద్ధం వ్యాపిస్తుందని హమాస్ కుట్ర పన్నింది. కాగా,  ఇజ్రాయెల్ తమ దళాలను 2005లో గాజా నుంచి పూర్తిగా ఉపసంహరించుకున్నప్పటికీ భూ, గగనతల, సాగర సరిహద్దుల్లో పహరా కొనసాగిస్తోంది. నౌకాదళం గస్తీ తిరుగుతున్నా ఆయధాల స్మగ్లర్లు దాని కన్నుగప్పి మధ్యధరా సముద్ర తీరంలో వాటిని వదలగలుగుతున్నారు. ఆయుధాలు అలా హమాస్ కు చేరుతున్నాయి.

హమాస్ కు ఆయుధాలు చేరవేసేందుకు సరఫరాదారులు సొరంగ మార్గాలను ఉపయోగించుకుంటున్న సంఘటనలూ ఉన్నాయి. పొరుగు దేశాలలోని ఇతర ఇస్లామిక్ టెర్రరిస్టు సంస్థలు కూడా ఆయుధాలను సరిహద్దులు దాటించి హమాస్​కు చేరవేస్తున్నాయి. ఇరాన్, సిరియాల నుంచి హమాస్​కు ఫజా-3, ఫజా-5, ఎం-302 రాకెట్లు హమాస్ కు అందుతున్నాయి. ఫజా అంటే అరబిక్​లో విరుచుకుపడడం అనే అర్థం కూడా ఉంది.

ఫజా-3 ఉపరితలం నుంచి ఉపరితలంలోకి ప్రయోగించే ఆర్టిలరీ అన్ గైడెడ్ రాకెట్. ఉత్తర కొరియా తయారు చేసే ఎం-1985 రాకెట్ కు ఇది కాపీ. దాని నుంచి లైసెన్సు తీసుకుని ఇరాన్ ఫజా-3 రాకెట్లను తయారు చేస్తోంది. ఇది 43 కిలోమీటర్ల దూరం వెళ్ళగలదు. ఫజా-5 రకం రాకెట్ 90 కిలోల పేలుడు పదార్థాన్ని మోసుకుని 75 కిలోమీటర్ల దూరం వెళ్లగలదు. ఈ రాకెట్లు హిజ్బుల్లా వద్ద పెద్ద సంఖ్యలో ఉన్నాయి. హిజ్బుల్లా టెర్రరిస్టు సంస్థకు ఇరాన్, సిరియాలతో సన్నిహిత సంబంధాలున్నాయి. 

హమాస్ ఎం-302 రాకెట్ అంటే ఖైబర్-1లను కూడా సమకూర్చుకుంది. ఎం-302 దీర్ఘ శ్రేణి కలిగిన అన్ గైడెడ్ రాకెట్. హిజ్బుల్లా నుంచి ఇవి హమాస్ కు అందుతున్నాయి. గాజా నుంచి ఇజ్రాయెల్ పైకి జరిపిన తొలి విడత దాడుల్లో హమాస్ 5000లకు పైగా రాకెట్లను ప్రయోగించిందంటే ప్రాణ నష్టం, ఆస్తి, నష్టం ఎంత పెద్దయెత్తున సంభవించి ఉంటాయో ఊహించుకోవచ్చు.

ఐరన్ డోమ్ పేరుతో ఇజ్రాయెల్ ఇంచుమించుగా శత్రుదుర్భేద్యమైన రక్షణ వ్యవస్థను రూపొందించుకుంది. దాన్ని కూడా ఉక్కిరిబిక్కిరి చేసే విధంగా, ఇరాన్ ఆయుధాలకు క్రూడ్ రాకెట్ టెక్నాలజీని జోడించి హమాస్ అభివృద్ధి చేసుకుంది. హమాస్ నిధుల్లో కూడా 70 శాతం ఇరాన్ నుంచి అందుతున్నవే. అమెరికా 2021లో ఆదరాబాదరాగా అఫ్ఘానిస్తాన్ నుంచి నిష్క్రమించినపుడు పెద్ద సంఖ్యలో ఆయుధాలను అక్కడే వదిలి వెళ్ళింది. అవి తాలిబాన్​లకు చిక్కాయి. తాలిబాన్ నుంచి అవి హమాస్ కు అందుతున్నాయి. నిజానికి, గాజా స్ట్రిప్ కు రెండు వైపుల ఇజ్రాయెల్ ఉంటే ఒకవైపు ఈజిప్ట్, పశ్చిమం వైపు మధ్యధరా సముద్రం ఉంది. ఇజ్రాయెల్ నౌకాదళం 12 నాటికల్ మైళ్ల విస్తీర్ణం వరకే జనం రాకపోకలను నియంత్రిస్తోంది.


ALSO READ: చిచ్చురేపిన తాతా మధు పాత వీడియో

ఇజ్రాయెల్ ఆచితూచి అడుగేయాలి

హిజ్బుల్లా టెర్రరిస్టులు మళ్ళీ దాడులకు దిగితే, లెబనాన్ పై కూడా ఇజ్రాయెల్ యుద్ధానికి దిగవచ్చు. గాజా స్ట్రిప్​ను పూర్తిగా అదుపులోకి తెచ్చుకున్న తర్వాత ఇజ్రాయెల్ పరిస్థితిని మదింపు చేయవచ్చు.  ఇజ్రాయెల్​కు ఆయుధాలు సరఫరా చేసే దేశాల్లో అమెరికాది పెద్ద పాత్ర. టెర్రరిజంపై పోరాటంలో ఇజ్రాయెల్ కు ఆయుధాల కొరత లేకుండా చూస్తామని అమెరికా ప్రకటించింది. ఈ పరిస్థితులను అనువుగా తీసుకుని మూడవ దేశం ఈ యుద్దంలో తలదూర్చినా సహించేది లేదని గట్టి హెచ్చరిక చేసింది.

అమెరికా మాజీ అధ్యక్షుడు గెరాల్డ్ ఆర్ ఫోర్డ్ పేరిట ఉన్న విమాన వాహక యుద్ధ నౌకను ఇజ్రాయెల్​కు సమీపంలో ఉంచింది.  గైడెడ్ మిసైల్ క్రూజర్, గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్ల వంటివి దానిలో ఉన్నాయి. ఇతర ఆయుధాలూ ఉండనే ఉంటాయి. అయితే, ఇజ్రాయెల్ ప్రతి దాడుల తీవ్రతను తగ్గించాలి. ఆచితూచి అడుగేయాలి, మానవ హక్కుల వాదనలు అప్పుడే కొన్ని వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. టెర్రరిస్టుల్లో మంచి టెర్రరిస్టులు, చెడ్డ టెర్రరిస్టులు అంటూ ఉండరు. కనుక, ఇజ్రాయెల్ ను దాని పనిని అది చేసుకోనివ్వాలి. టెర్రరిజానికి చేయూతను అందిస్తున్న దేశాలతో సంబంధాలపై మిగిలిన దేశాలు పునః సమీక్ష చేసుకోవాలి. తమ సాయం పక్కదోవ పట్టకుండా జాగ్రత్తపడాలి. ఆ తర్వాతే, శాంతి, సుస్థిరతకు యత్నించాలి.

ప్రతి దాడుల ఫలితమేమిటి?

గాజా స్ట్రిప్ లో హమాస్ లక్ష్యాల పైకి ఇజ్రాయెల్ రాకెట్ దాడులు నిర్వహించడం ద్వారా  అపార ప్రాణ, ఆస్తి నష్టాలు కలిగిస్తోంది. అనివార్యంగా వాటిలో సాధారణ పౌరులూ హతులవుతున్నారు. అదే సమయంలో, ఇజ్రాయెల్ భూభాగంలోకి చొచ్చుకొచ్చిన హమాస్ టెర్రరిస్టులను ఏరివేసే పనిలో ఉంది. బహుశా, గాజా స్ట్రిప్ లోకి తన సేనలను పంపించి టెర్రరిస్టులను పూర్తిగా మట్టుబెట్టే పనికి కూడా అది ఉపక్రమించవచ్చు.

అది గాజాకు ఆహారం, నీరు, ఇంధనం, విద్యుత్​ సరఫరాలను నిలిపివేసింది. అయితే, ఈ కల్లోల వాతావరణంలో హమాస్ తన బందీలను ఎక్కడెక్కడ ఉంచిందో..అసలు ప్రాణాలతో ఇంకా ఉంచిందో లేక హతమార్చిందో కూడా ఎవరికీ అంత త్వరగా తెలిసే అవకాశం లేదు. ఇజ్రాయెల్ దాడుల్లో కుప్పకూలుతున్న భవనాల్లో కొన్నింటిలో బందీలు ఉండి చనిపోయారనే వార్తలూ వస్తున్నాయి. కుప్పకూల్చే ఒక్కొక్క భవనానికి ఒక్కొక్క బందీని చంపుతామని హమాస్ హెచ్చరించింది. దాన్ని మానసికంగా భయపెట్టే ఎత్తుగడగా మాత్రమే ఇజ్రాయెల్ భావిస్తోంది.

ఆపరేషన్ అల్-అక్సా ఫ్లడ్

హమాస్​ మిలిటెంట్ల దాడిలో మృతుల సంఖ్యను లెక్కగట్టడం కష్టం. వెయ్యిమందికి పైనే చనిపోయారని అంచనా. గాయపడినవారు కూడా వేలల్లో ఉన్నారు. భవనాల శిథిలాలను తొలగించడం మొదలుపెడితేగానీ ఆ సంఖ్యలు స్పష్టంగా తెలియవు. దాడి చేసింది హమాస్ మిలిటెంట్లు మాత్రమే కాదు. లెబనాన్ నుంచి హిజ్బుల్లా టెర్రరిస్టులు కూడా ఇజ్రాయెల్ పైకి రాకెట్లు, మోర్టార్లతో దాడులు జరిపారు. ఇంతవరకు ప్రపంచం చవి చూసిన టెర్రరిస్టు ఘటనల్లో దీన్ని అతి పెద్దదిగా చెప్పవచ్చు.

ఈ దాడికి హమాస్ ‘ఆపరేషన్ అల్-అక్సా ఫ్లడ్’ అని పేరు పెట్టుకుంది. హమాస్​దాడిని గుర్తించకపోవడం ఇజ్రాయెల్ సెక్యూరిటీ ఏజెన్సీ షిన్ బెట్, ఇంటెలిజెన్స్ సంస్థ మొసాద్ వైఫల్యమే. గాజా స్ట్రిప్ లో నిద్రాణంగా ఉండి, వెస్ట్ బ్యాంక్ లో సుస్థిరతను దెబ్బతీసే ప్రయత్నాలకు హమాస్ ఒడిగడుతుందని ఇజ్రాయెలీలు గత కొద్ది ఏండ్లుగా భావిస్తున్నారు. బలహీనపడిందనుకున్న హమాస్ అదే సమయంలో తన సైనిక శక్తిని గణనీయంగా పెంచుకుంది. పేరుకి పాలస్తీనియన్ అథారిటీ ఉన్నా దాని నియంత్రణ వెస్ట్ బ్యాంక్ కే పరిమితమవుతోంది. గాజా స్ట్రిప్ ను హమాస్ తన గుప్పిటపెట్టుకుంది.

- మల్లంపల్లి ధూర్జటి, సీనియర్​ జర్నలిస్ట్