రాత్రికిరాత్రే వందల శిలాఫలకాలు.. పొద్దుగాల్నె శంకుస్థాపనలు

రాత్రికిరాత్రే వందల శిలాఫలకాలు.. పొద్దుగాల్నె శంకుస్థాపనలు
  • వరంగల్​లో టీఆర్​ఎస్​ లీడర్ల ఓట్ల వేట
  • నాలుగున్నరేండ్లలో కనిపించని సిత్రాలు ఇప్పుడు షురువైనయ్​
  • డివిజన్లలో తెగ తిరుగుతున్న ఎమ్మెల్యేలు
  • ‘ప్రజా సంక్షేమ ప్రగతి యాత్ర’ పేరుతో జనాల్లోకి
  • నేతల హడావుడితో పరేషాన్ ​అవుతున్న పబ్లిక్​

వరంగల్‍ రూరల్‍, వెలుగు: గ్రేటర్‍ వరంగల్‍ పరిధిలోని డివిజన్లలో రాత్రికిరాత్రే వందల శిలాఫలకాలు వెలుస్తున్నయ్. దానిపై సిమెంట్‍ ఆరకముందే పింక్‍ కలర్‍ ముకుమల్‍ క్లాత్ సుడుతున్నరు. ఆ ఏరియాలను మున్సిపల్‍ సిబ్బంది క్లీన్‍ చేసి అక్కడికో  గెస్ట్​ వస్తున్నట్లు రోడ్డుకు ఇరువైపులా ముగ్గు పోస్తున్నరు. ఇగ పొద్దుగాల్నే ఆ ప్రాంత ఎమ్మెల్యేనో,  లేదంటే మేయరో వచ్చి పనులకు శంకుస్థాపన చేసి రిబ్బన్ కట్‍ చేస్తున్నరు.  అందరితో ఆప్యాయంగా మాట్లాడి సెల్ఫీలు దిగి నానా హడావుడి చేస్తున్నరు. పనులన్నీ టక్కున కావాలంటూ ఆఫీసర్లకు పబ్లిక్‍ ముందే వార్నింగులు ఇస్తున్నరు. నాలుగున్నరేండ్లలో కనిపించని ఎన్నో సిత్రాలు సడెన్‍గా ఇప్పుడు కనపడటంతో పబ్లిక్​ పరేషాన్‍ అవుతున్నరు. వరంగల్​ మున్సిపల్​ కార్పొరేషన్​ ఎన్నికల్లో ఓట్ల కోసమే లీడర్లు ఈ ఫీట్లు వేస్తున్నారని అనుకుంటున్నరు. గ్రేటర్‍ వరంగల్‍ కార్పొరేషన్‍ పాలకవర్గం గడువు మార్చి14తో ముగియనుంది. త్వరలోనే ఎన్నికల నోటిఫికేషన్​ వచ్చే అవకాశం ఉంది. దీంతో మరోసారి కార్పొరేషన్​పై గులాబీ జెండా ఎగరేయాలని రూలింగ్​ పార్టీ తహతహలాడుతున్నది. కానీ గడిచిన నాలుగున్నరేండ్లలో సర్కారు నుంచి సరిపడా ఫండ్స్​రాకపోవడంతో మెజార్టీ కార్పొరేటర్లు తమ డివిజన్లలో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టలేకపోయారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేకపోయారు. నాడు ఎలక్షన్‍ క్యాంపెయినింగ్​కు వచ్చిన  కేసీఆర్‍, కేటీఆర్‍, హరీశ్​రావు లాంటి పెద్ద లీడర్లు ఇచ్చిన హామీలు కూడా ఉత్తిమాటలే అయ్యాయి. ఈక్రమంలో రాబోయే కార్పొరేషన్​ఎన్నికల్లో పబ్లిక్​ దగ్గరకు వెళ్లి ఓట్లడిగేందుకు టీఆర్​ఎస్​ కార్పొరేటర్లు భయపడుతున్నారు. ఈలోగా రేపోమాపో గ్రాడ్యుయేట్‍ ఎమ్మెల్సీ ఎలక్షన్‍ కోడ్‍ వస్తుందనే ఇన్ఫర్మేషన్‍  వచ్చింది. దీంతో అధికార పార్టీ లీడర్లు జనాల ముందుకు వెళ్లేందుకు నయా ప్లాన్‍ ఆలోచించారు. ఫండ్స్​ ఎప్పుడొస్తయ్‍.. పనులు ఎప్పుడు పూర్తయితయ్‍.. అనే మాట పక్కనపెట్టి, రాత్రికిరాత్రే ఒక్కో డివిజన్​లో రెండు, మూడు శిలాఫలకాలు కట్టి ఉదయమే వాటిని ఓపెన్‍ చేస్తున్నారు. మీడియా, వాట్సాప్‍ గ్రూపుల్లో  హల్‍చల్‍ చేస్తున్నారు.

ఎమ్మెల్యేల ‘ప్రజా సంక్షేమ ప్రగతి యాత్ర’

గ్రేటర్‍ వరంగల్‍ పరిధిలో నాలుగున్నరేండ్లుగా పాలకులు ఎలాంటి డెవలప్​మెంట్​పనులు చేపట్టలేదనే విమర్శలున్నాయి. కనీసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన స్మార్ట్​ సిటీ ఫండ్స్​ను కూడా ఖర్చుపెట్టలేకపోయారని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. వరదల టైంలో పబ్లిక్​ను పట్టించుకోలేదని, హైదరాబాద్​లో వరద బాధిత కుటుంబాలకు రూ. 10 వేల చొప్పున సాయం ప్రకటించినా తమకు ఎందుకు ఇవ్వలేదని వరంగల్​ జనం నిలదీస్తున్నారు. ఇక రోడ్లు, నాలాల ఆక్రమణలకు సంబంధించి  కొందరు ఎమ్మెల్యేలపై ఆరోపణలు వచ్చాయి. పరిస్థితులు ఇలా ప్రతికూలంగా ఉన్న టైంలోనే వరంగల్‍ మున్సిపల్​ కార్పొరేషన్​కు ఎలక్షన్లు రాబోతున్నాయి. ఏదిఏమైనా మెజార్టీ సీట్లు సాధించాలని, ఆ బాధ్యత ఎమ్మెల్యేలే తీసుకోవాలని టీఆర్​ఎస్​ హైకమాండ్‍ స్పష్టం చేసినట్లు తెలిసింది. గెలుపు భారం తమ మీద పడడంతో ఎమ్మెల్యేలంతా రంగంలోకి దిగారు. ప్రభుత్వ చీఫ్‍  విప్‍  వినయ్​ భాస్కర్‍, వరంగల్‍ తూర్పు ఎమ్మెల్యే  నన్నపునేని  నరేందర్‍ ‘ప్రజాసంక్షేమ ప్రగతియాత్ర’ పేరుతో కాలనీల్లో తిరుగుతున్నారు.

పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్​ విలీన గ్రామాల్లో పర్యటిస్తున్నారు. డివిజన్లలో మస్త్​ పనులు చేస్తున్నామని చెప్పుకునేందుకు శిలాఫలకాల వద్ద కొబ్బరికాయలు కొట్టి ముందస్తు ప్రచారం చేపడుతున్నారు.

ప్రోగ్రాంలకు ఆఫీసర్లను పిలిచి వార్నింగులు

ప్రస్తుత కార్పొరేషన్‍ పాలకవర్గం 2016 మార్చిలో బాధ్యతలు తీసుకోగా.. నిన్నమొన్నటి వరకు చేసిందేమీలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వరంగల్​ కార్పొరేషన్​కు ఏటా రూ. 100 కోట్లు ఇస్తామని గతంలో సీఎం ఇచ్చిన మాట అమలుకు నోచుకోలేదు. ఈ క్రమంలోనే ఫండ్స్, డెవలప్‍మెంట్‍ వర్క్స్​విషయంలో రూలింగ్​పార్టీ కార్పొరేటర్లు ఎన్నోసార్లు కౌన్సిల్‍ మీటింగుల్లో గళం విప్పారు. తాము ఎలాంటి అభివృద్ధి పనులు చేయకపోవడంతో పబ్లిక్​లో తిరగలేకపోతున్నామని అన్నారు. త్వరలో గ్రేటర్​ వరంగల్​ మున్సిపల్​ కార్పొరేషన్​ (జీడబ్ల్యూఎంసీ) ఎన్నికలు జరగనుండటంతో..  ‘మార్చి నెలలో ఫండ్స్​ ఇస్తాం.. పనులు చేస్కొండి..’ అని ఇటీవల మున్సిపల్‍ మంత్రి కేటీఆర్‍ చెప్పారు. దీంతో ‘ఊరులేదు పేరులేదు.. కొడుకు పేరు సోమలింగం’ అన్నట్లు కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, మేయర్​ కలిసి శిలాఫలకాల ప్రచారం షురూ చేశారు. ఆయా ఓపెనింగ్​లకు ఇంజినీర్లను, కాంట్రాక్టర్లను, ఆఫీసర్లను పిలిచి.. కొత్త వర్క్స్​ ఎప్పుడు కంప్లీట్‍ చేస్తారో చెప్పాలని, ఇన్​టైంలో పూర్తి చేయకపోతే చర్యలు తప్పవని వార్నింగ్​ ఇస్తున్నారు. ఇప్పటికే చేసిన పనులకు బిల్లులు రాక, పెండింగ్‍ పనులను  కంప్లీట్​ చేయలేక సఫర్​ అవుతున్నామని, మళ్లీ ఇప్పుడు ఇలా పిలిచి మరీ జనం ముందు బ్లేమ్​ చేయడం ఎందుకో అర్థం కాక  కాంట్రాక్టర్లు, ఆఫీసర్లు లోలోపలే రగిలిపోతున్నారు.

హైకమాండ్‍ మాట.. మేయర్‍ నోట

ఈ నెల 16న హన్మకొండ అంబేద్కర్‍ భవన్​లో గ్రేటర్‍ వరంగల్‍ కార్పొరేషన్‍ మీటింగ్‍ నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్‍ అసలు విషయం చెప్పారు. రేపోమాపో గ్రాడ్యుయేట్‍ ఎమ్మెల్సీ ఎలక్షన్‍  కోడ్‍ రానున్నట్లు పేర్కొన్నారు. అదే జరిగితే ఇబ్బందులు తప్పవని.. డివిజన్లలో పెండింగ్‍ పనులన్నింటికీ ముందస్తుగా శిలాఫలకాలు వేస్కొవాలని కార్పొరేటర్లకు హింట్‍ ఇచ్చారు. కౌన్సిల్‍ సమావేశం అలా ముగిసిందో లేదో ఇక కార్పొరేటర్లు శిలాఫలకాలు తయారు చేయించే పనుల్లో బిజీ అయ్యారు. ఎమ్మెల్యేలు వాటికి శంకుస్థాపనలు చేస్తూ ప్రచారం మొదలుపెట్టారు.