- మూలవాగు నుంచి వందల ట్రాక్టర్లలో ఇసుక తరలింపు
- భూగర్భ జలాలు పడిపోతున్నాయన్నా వినలే
- చెట్లు, కంపలేసి అడ్డుకున్న గ్రామస్తులు
- తరలింపును ఆపేస్తున్నట్టు ఆఫీసర్ల ప్రకటన
వేములవాడ రూరల్, వెలుగు : మూల వాగు నుంచి ట్రాక్టర్లలో వందల ట్రిప్పుల ఇసుకను తీసుకువెళ్తుండడంతో వ్యవసాయ బావుల్లో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. దీంతో పంటలకు నీరందక ఎండిపోయి రైతులు నష్టాలపాలవుతున్నారు. ఎన్నిసార్లు చెప్పి చూసినా వినకపోవడంతో ఊరంతా ఇసుక ట్రాక్టర్లపై కన్నెర్రజేసింది. ఊరి నుంచి ఒక్క ట్రాక్టర్ ఇసుక కూడా తీసుకుపోవడానికి వీల్లేదని రోడ్డుకు అడ్డంగా చెట్లు, కంపలు వేసి గ్రామస్తులు, రైతులు ఆందోళన చేశారు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం మల్లారంలో జరిగింది.
గ్రామస్తుల కథనం ప్రకారం..మూలవాగు నుంచి వారానికి రెండు రోజులు రెండు వందల ట్రిప్పులు తీసుకువెళ్లేందుకు రెవెన్యూ ఆఫీసర్లు వంద ట్రాక్టర్లకు పర్మిషన్లు ఇచ్చారు. ఏడు నెలల నుంచి ఈ తంతు కొనసాగుతోంది. అయితే, ట్రాక్టర్ల యజమానులు పరిమితికి మించి ట్రిప్పులు తీసుకుపోతుండడంతో మల్లారంలోని బావులు అడుగంటిపోతున్నాయని, పంట పొలాలకు నీరు సరిపోక ఇబ్బందులు పడుతున్నామని రైతులు ఆవేదన చెందారు. వాగు దగ్గరగా ఉన్న భూముల నుంచి కూడా ఇసుకను తీస్తుండడంతో తమ భూములు కూడా కోల్పోయే అవకాశం ఉందని ఫైర్అయ్యారు.
ఇసుకను తీసుకువెళ్తున్న ట్రాక్టర్లకు దారి ఇవ్వకుండా రోడ్డుకు అడ్డంగా ముళ్ల కంపలు, కట్టెలు, చెట్లు వేసి అడ్డుకున్నారు. తర్వాత పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకుని రైతుల తో మాట్లాడారు. వారి ఫిర్యాదుతో ఇసుకను అక్కడే వదిలివేయాలని ట్రాక్టర్ డ్రైవర్లను ఆదేశించారు. దీంతో వారు ఇసుకను వదిలివేసిన తర్వాతే తిరిగి పంపించారు. ఈ విషయమై తహసీల్దార్ సుజాతను వివరణ కోరగా ఇసుక తరలింపుకు అనుమతులివ్వగా, రైతులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో నిలిపివేసినట్టు చెప్పారు.