200 హెక్టార్లలో చెట్లు ఎందుకు కూలినట్టు..?

200 హెక్టార్లలో చెట్లు ఎందుకు కూలినట్టు..?

తాడ్వాయి, వెలుగు: ములుగు జిల్లా తాడ్వాయి మండలం పసర, తాడ్వాయి ఫారెస్ట్  రేంజ్ లో గత నెల 31న రాత్రి గాలివాన బీభత్సానికి పెద్ద సంఖ్యలో చెట్లు నేల కూలడంపై అటవీశాఖ దర్యాప్తు ప్రారంభించింది. ఒకే ఒక్క గాలివానకు ఇన్ని చెట్లు ఎలా నేల కూలాయనే దానిపై శాస్త్రీయ కారణాలను అన్వేషిస్తోంది. ఈ క్రమంలో చెట్లు కూలిన ప్రాంతాన్ని సీసీఎఫ్​ ప్రభాకర్, ములుగు డీఎఫ్​వో రాహుల్ కిషన్  జాదవ్, ఎఫ్డీవో రమేశ్  మంగళవారం డ్రోన్ కెమెరాల సాయంతో పరిశీలించారు. 

సీసీఎఫ్​ ప్రభాకర్ మాట్లాడుతూ.. గత శనివారం అర్ధరాత్రి గాలివాన బీభత్సానికి 200 హెక్టార్లలో చెట్లు నేల కూలిపోయాయని తెలిపారు. ఈ ఘటనపై లోతుగా దర్యాప్తు చేస్తున్నామని, చెట్లు కూలిన ప్రాంతంలో 3 మీటర్ల లోతులో మట్టిని సేకరించి ల్యాబ్​కు పంపించామని చెప్పారు. బుధవారం పీసీసీఎఫ్  చెట్లు కూలిన ప్రాంతాన్ని పరిశీలిస్తారని చెప్పారు. ఇన్​చార్జి ఎఫ్ఆర్వో కృష్ణవేణి, తాడ్వాయి ఎఫ్ఎస్​వో స్వరూప రాణి, మేడారం ఎఫ్ఎస్​వో లింగం, ఎఫ్​బీవో కల్యాణి, సుమన్  ఉన్నారు.