ప్రపంచవ్యాప్తంగా 2021లో 82.8 కోట్ల మంది ఆకలి సమస్యను ఎదుర్కొన్నారు. ఆకలి సమస్యను ప్రపంచం నుంచి తరిమివేయాలని 2015లో యూఎన్ సుస్థిర అభివృద్ధి లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. కాగా అప్పటి కంటే ఇప్పుడు18 కోట్ల మంది ఎక్కువయ్యారు. 2019లో కరోనా వచ్చిన తర్వాతనే15 కోట్ల మంది అధికమయ్యారు. ప్రపంచంలో ప్రతి ముగ్గురిలో ఒకరు, అంటే సుమారు 231 కోట్ల మంది ఓ మోస్తరు లేదా తీవ్రమైన ఆహార భద్రత సమస్యను ఎదుర్కొంటున్నారు. ఆరోగ్యకరమైన ఆహారాన్ని భరించే స్థితిలో లేని వారి సంఖ్య కూడా నానాటికీ పెరుగుతోంది. ఫుడ్ సెక్యూరిటీ అండ్ న్యూట్రిషియన్- 2022 పేరుతో ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ విడుదల చేసిన నివేదికలో 2030 నాటికి ప్రపంచ జనాభాలో 8 శాతం మంది పోషకాహార లోపానికి గురవుతారని, అంటే 2015లో ఉన్న స్థాయికి మళ్లీ చేరుకుంటామని తేలింది. ప్రపంచ జనాభాలో10 శాతం జనాభా పోషకాహార లోపంతో బాధపడుతున్నది. 30 శాతం జనాభాకు తగిన ఆహారం దొరకడం లేదు.11 కోట్లమంది ప్రజలు ఆకలి కోరల్లో చిక్కుకుంటున్నారు.
డైట్లో లోపాలు
ప్రజల సంస్కృతి, కట్టుబాట్లు, పోషకాహార జ్ఞానం, ఆహార తయారీ వంటి వాటిపై ఆహార ధాన్యాల వినియోగం ఆధారపడి ఉంటుంది. యూఎన్ ఇండియా 2020 నివేదిక ప్రకారం.. దేశీయంగా 43 శాతం పిల్లలు పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. ఆకలి తీవ్రత బాలల్లో పౌష్టికాహార లోపానికి సంకేతంగా నిలుస్తోంది. ఆహారంలో ధాన్యాలు, ప్రొటీన్ శాతం తగ్గడం, నూనె పదార్థాలు, శీతల పానీయాల వినియోగం పెరగడం వంటివి పోషకాహార లోపానికి ప్రధాన కారణాలు. వర్షాధార వ్యవసాయమైన మన దేశం దాదాపు 40 శాతం మందికి తిండిగింజలు అందిస్తోంది. అయితే తరచూ కరువులు సంభవిస్తుండటం వల్ల పంట నష్టపోయి రైతులు అప్పుల పాలవుతున్నారు. దీనివల్ల ఆహార కొరత, పౌష్టికాహార లోపం సంభవిస్తున్నాయి. ఈ పరిణామం సామాజిక రంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. గర్భస్థ శిశువు దగ్గర్నుంచి, రెండేళ్ల పిల్లాడు అయ్యేంత వరకు వారికి పోషకాహారం అందటం అత్యంత కీలకం. లేదంటే అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. మానసిక, శారీరక ఎదుగుదల సరిగా ఉండదు.
89 శాతం మందికి
దేశవ్యాప్తంగా 6 నుంచి 23 నెలల చిన్నారుల్లో 89 శాతం మందికి కనీస పోషకాహారం అందటం లేదని ‘జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే -5’ ఆందోళన వ్యక్తం చేసింది. నిర్దేశిత ప్రమాణాల మేరకు మినిమం డైట్ పొందని శిశువులు, చిన్నారులు 2015–-16లో 91.3 శాతముంటే, 2019-–2 0లలో 89 శాతంగా నమోదైనట్లు తాజా సర్వే పేర్కొంది. గణాంకాల్లో స్వల్ప పెరుగుదల ఉన్నా, పరిస్థితుల్లో పెద్దగా మార్పు లేదని సర్వే తేల్చింది. పేదరికం, అవిద్య, అవగాహనా లోపం, పప్పులు, కూరగాయలు, పండ్లు, గుడ్లు అందుబాటులో లేకపోవడం వంటివి లోపపోషణకు దారితీస్తోంది. మన దేశంలో 51శాతం మంది చిన్నారుల(22.2 కోట్లు) జీవితాలపై పేదరికం, పర్యావరణ సంక్షోభాలు ప్రభావం చూపిస్తున్నట్లు ‘జెనరేషన్ హోప్: 2.4 బిలియన్ రీజన్స్ టు ఎండ్ ది గ్లోబల్ క్లైమేట్ అండ్ ఇన్ ఈక్వాలిటీ క్రైసిస్’ నివేదిక పేర్కొంది. ఆసియా వ్యాప్తంగా ఈ సంఖ్య 35 కోట్లుగా ఉన్నట్లు వెల్లడించింది. దీని ప్రకారం కంబోడియాలో అత్యధికంగా72 శాతం పిల్లలు పేదరికం, పర్యావరణ సంక్షోభాల జంట ముప్పును ఎదుర్కొంటున్నారు. ఆ తర్వాత స్థానాల్లో మయన్మార్(64 శాతం), అఫ్గాన్(57 శాతం) చిన్నారులు ఉన్నారు. మన దేశంలో 35.19 కోట్ల మంది పిల్లలపై ఏటా వాతావరణ వైపరీత్యమైన ప్రభావం పడుతున్నది. పేదరికం, పరస్పర అనుసంధానమైన పర్యావరణ సంక్షోభం, అసమానతల సమస్యల పరిష్కారానికి అత్యవసరంగా చర్యలు చేపట్టకపోతే మానవాళికి ముప్పు తప్పదని, భారత్ లో ఈ చొరవ మరింత కీలకమని 'సేవ్ ది చిల్డ్రన్' భారత విభాగం సూచించింది.
పథకాలు ఉన్నా .. నిర్దిష్ట అమలే ముఖ్యం
ఆకలితో అల్లాడుతున్న ప్రజలు నివసించే ప్రాంతాలు గుర్తించి వారికి సకాలంలో ఆహార ధాన్యాలు అందివ్వాలి. ఆహార భద్రత అంటే బియ్యం, గోధుమలు ఇవ్వడం కాదు. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారికి పౌష్టికాహారం అందించడం. ఇందుకోసం దశాబ్దాలుగా ప్రభుత్వాలు వ్యయం చేస్తూనే ఉన్నాయి. దేశంలో పిల్లల్లో పోషకాహార లోపాన్ని పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం సమగ్ర శిశు అభివృద్ధి పథకాన్ని అమలు చేస్తోంది. పూర్వప్రాథమిక విద్యతోపాటు ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ, రోగ నిరోధకత పెంపు, ఆరోగ్య పరీక్షలు తదితర సేవలు అందించడమే దీని లక్ష్యం. ఈ పథకం పది లక్షలకు పై గా అంగన్వాడీ కేంద్రాల ద్వారా ఎనిమిది కోట్ల మందికి పైగా సేవలు అందిస్తోంది. పిల్లలు, గర్భిణులు, బాలింతలకు పోషకా హారాన్ని అందించడానికి కేంద్రం 'పోషణ్ అభియాన్'ను ప్రారంభించింది. ఎన్ని పథకాలు, కార్యక్రమాలను చేపట్టినా, వాటిని నిర్దిష్టంగా అమలు చేయడం, లబ్ధిదారులకు సమగ్ర రీతిలో ప్రయో జనాలు దక్కడమే కీలకం. దేశాభివృద్ధికి ఆరోగ్యవంతులైన పౌరులు అవసరం. ఆరోగ్యానికి పోషకాహారమే ముఖ్యం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ దిశగా మరింతగా దృష్టి సారిస్తేనే ఆరోగ్య భారతం
ఆవిష్కృతమవుతుంది.
- కోడం పవన్ కుమార్
సీనియర్ జర్నలిస్ట్