ఏటీఎం దొంగల వేట ముమ్మరం..పాత నేరస్తులపై అనుమానం

  •     నిందితులు ఇప్పటికే సేఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వెళ్లినట్లు అనుమానం
  •     వారికి పట్టుకునేందుకు ఢిల్లీకి చేరిన పోలీస్​ టీంలు
  •     గత చోరీ ఘటనలతో పోల్చి చూస్తున్న పోలీసులు 

గోదావరిఖని, వెలుగు :  గోదావరిఖని గౌతమీనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ ఏటీఎంలో ఈ నెల 10 తెల్లవారుజామున రూ.27.75 లక్షల నగదు చోరీ చేసిన ఘటనలో దొంగల ముఠా కోసం పోలీసులు వేట ముమ్మరం చేశారు. దొంగతనం చేసి వెళ్తూ మార్గమధ్యలో మందమర్రి ఏరియాలో గ్యాస్​ సిలిండర్​, ఏటీఎం మెషిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని పలు భాగాలను పడేసి వెళ్లగా వాటి ఆధారంగా పోలీసులు ఆరా తీస్తున్నారు. టోల్​గేట్లలో సేకరించిన సమాచారం మేరకు నంబర్​ప్లేట్​ సరిగా లేని వాహనంలో వచ్చిన దొంగలు ఢిల్లీ వైపు వెళ్లి ఉండొచ్చనే అనుమానంతో పోలీస్​ టీంలు అక్కడికి వెళ్లినట్లు సమాచారం. 

గూగుల్​ సెర్చ్​ ద్వారా ఏటీఎంల గుర్తింపు

దొంగల ముఠా సమీపంలోని గూగుల్ సెర్చ్ ద్వారా ఏటీఎం సెంటర్లను టార్గెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసుకున్నట్లు తెలుస్తోంది. అడ్రస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు తెలుసుకొని చోరీ చేస్తున్నట్లు గోదావరిఖనిలో జరిగిన ఘటన గుర్తు చేస్తున్నది. మొదట గంగానగర్​లోని ఏటీఎం సెంటర్​, ఆ తర్వాత గౌతమీనగర్​లోని సెంటర్లలో దొంగలు పడ్డారు. ఈ రెండు కూడా గోదావరిఖని పట్టణానికి శివారు ప్రాంతాలలోనే ఉండడం గమనార్హం. 

గంగానగర్​ ఏటీఎం సెంటర్​లోకి దొంగలు చొరబడి మెషిన్​ను పగలగొట్టడానికి ప్రయత్నించి ఫెయిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌అయ్యారు. అక్కడి నుంచి గౌతమీనగర్​లోని ఏటీఎంకు వెళ్లి షట్టర్​మూసివేసి గ్యాస్​కట్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో మెషిన్​ను ఓపెన్​ చేసి ట్రే బాక్స్​లతో సహా రూ.27.75 లక్షల నగదును ఎత్తుకెళ్లారు. ఇదంతా కేవలం 20 నిమిషాల్లోనే పూర్తి చేసుకుని దొంగలు తాము తెచ్చుకున్న వాహనంలోనే పరారైనట్టు పోలీసులు గుర్తించారు. 

మందమర్రిలో కట్టర్​, సిలిండర్లు​, ట్రేల గుర్తింపు

గోదావరిఖని గౌతమీనగర్​ ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ ఏటీఎంలో చోరీ అనంతరం అందుకు ఉపయోగించిన గ్యాస్​ కట్టర్​, సిలిండర్లు​, ఖాళీ క్యాష్​ ట్రే బాక్స్​లను మందమర్రి సమీపంలోని చెట్ల పొదల్లో పడేసి వెళ్లారు. వీటిని పోలీసులు స్వాధీనం చేసుకుని వాటి మీద ఉన్న వేలి ముద్రలను సేకరించారు. 2021 మార్చి 24న మంథని మండలం గుంజపడుగు గ్రామంలో ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ బ్యాంక్​లో కూడా ఇదే తరహాలో గ్యాస్​ కట్టర్​తో లాకర్​ను తెరిచి రూ.18 లక్షల నగదు, 6 కేజీల బంగారు నగలు దోచుకెళ్లారు.

 మహారాష్ట్ర, ఉత్తర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రదేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాష్ట్రాలకు చెందిన దొంగలు ఈ ఘటనకు పాల్పడినట్టు గుర్తించి 11 మందిని అరెస్ట్​ చేశారు. కాగా గౌతమీనగర్​ ఏటీఎంలో చోరీ ఘటన కూడా గుంజపడుగు బ్యాంక్​ రాబరీ ఘటనతో పోలి ఉండడతో పాత నేరస్తులపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ పాత దొంగలు జైల్లో ఉంటే తాజా ఘటనకు పాల్పడింది ఎవరనేది తేలాల్సి ఉంది. ఈ క్రమంలో గోదావరిఖని ఏసీపీ శ్రీనివాసరావు నేతృత్వంలో రామగుండం సీఐ ప్రవీణ్​ కుమార్​, అంతర్గాం ఎస్ఐ సంతోష్​ కుమార్​ఆధ్వర్యంలో రెండు బృందాలు దొంగల కోసం వేట ముమ్మరం చేశారు. 

దొంగలు ప్రయాణించిన వాహనం నంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లేట్​ సరిగ్గా లేకపోవడం, దానికి తోడు ఆ నంబర్​ ప్లేట్​ నకిలీదిగా పోలీసుల పరిశీలనలో తేలినట్టు సమాచారం. దొంగలు వచ్చిన వాహనం తిరిగి వెళ్లిన మార్గంలోని టోల్​ గేట్లను పోలీసులు అలర్ట్​ చేసినప్పటికీ వారు ఢిల్లీ, ఉత్తరప్రదేశ్​ పరిసర ప్రాంతాలకు చేరుకున్నట్టు గుర్తించారు. వారి ఆచూకీ కోసం స్థానిక పోలీసుల సాయంతో టెక్నికల్​ ఎవిడెన్స్​ కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారు.