నల్లబెల్లిల్లోని ముష్టి గింజల గోల్​మాల్​ కేసులో ఇంటి దొంగలపై వేటు

భద్రాచలం, వెలుగు: భద్రాచలం జీసీసీ డివిజన్​లోని అశ్వారావుపేట మండలం నారాయణపురం, పాల్వంచ, దుమ్ముగూడెం మండలం నల్లబెల్లిల్లోని గోదాముల్లో ముష్టి గింజల గోల్​మాల్​ కేసులో ఇంటి దొంగలపై వేటు పడింది. రూ.కోటి విలువ చేసే ముష్టి గింజలను గోదాముల నుంచి మాయం చేసి అమ్మేసుకున్నారు. ఈ ఘటనలో పర్యవేక్షణ లోపం ఉందనే కారణంతో జీసీసీ డీఎం కుంజా వాణిని హైదరాబాద్​ హెడ్ ఆఫీసుకు బదిలీ చేశారు. ఆమె స్థానంలో మార్కెటింగ్ విభాగంలో పని చేసే విజయ్​కుమార్​ను పోస్టింగ్ ఇచ్చారు. భద్రాచలం బ్రాంచ్​ మేనేజర్​ శంకర్​పై సస్పెన్షన్​ వేటు వేసి,  ఆయన స్థానంలో మణుగూరు బీఎం దావీద్​కు ఇన్​చార్జిగా బాధ్యతలు అప్పగించారు. దమ్మపేట సేల్స్ మెన్​ సేతూరామ్​ను వరంగల్ జిల్లా నర్సంపేటకు బదిలీ చేశారు. దుమ్ముగూడెం మండలం నల్లబెల్లి సేల్స్ మెన్​ వీరస్వామిని సస్పెండ్ చేశారు. 

నారాయణపురం గోదామ్​ ఇన్​చార్జి​కృష్ణయ్యను గతంలోనే పోలీసులు అరెస్ట్  చేసి విచారణ చేయగా, ఆ సమయంలోనే సస్పెండ్ చేశారు. జీసీసీ ఆధ్వర్యంలో ఆదివాసీల నుంచి ఔషధాల తయారీలో ఉపయోగించే ముష్టి గింజలను కిలో రూ.45 చొప్పున కొనుగోలు చేసి గోదాముల్లో నిల్వ చేశారు. వీటిని క్వింటా రూ.6600 చొప్పున 3 వేల క్వింటాళ్లు జీసీసీ నుంచి కొనుగోలు చేసేందుకు ఓ వ్యాపారి టెండర్  ద్వారా అనుమతి పొందారు. అశ్వారావుపేట మండలం నారాయణపురం గోదాములో 897 క్వింటాళ్లు తక్కువగా ఉన్న విషయాన్ని గుర్తించి పోలీస్​స్టేషన్​తో పాటు జీసీసీ డీఎం కుంజా వాణి ఫిర్యాదు చేశారు. పాల్వంచ జీసీసీ గోదాములో 200 క్వింటాళ్లు మాయమయ్యాయి. దుమ్ముగూడెం మండలం నల్లబెల్లి గోదాములోనూ తేడా వచ్చింది. ఈ ఘటనపై విచారణ చేపట్టిన ఉన్నతాధికారులు బాధ్యులపై చర్యలు తీసుకున్నారు.