వచ్చే ఎన్నికల్లో ఖర్చుల కోసం నిధుల వేట

  • నియోజకవర్గానికి రూ.50కోట్లు పెట్టాల్సి వస్తదని అంచనా
  • ఇప్పటి నుంచే జనంలోకి వెళ్తే ఖర్చు తగ్గుతుందనే ఆలోచన
  • డబ్బుకు వెనకాడని నయా లీడర్లు.. కానీ టికెట్ పైన డైలమా

నల్గొండ, వెలుగు : రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి దిక్సూచిగా మారిన ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ఆ పార్టీ లీడర్లకు పైసల పరేషాన్ పట్టుకుంది. ఈసారి ఎట్టిపరిస్థితుల్లో పవర్​లోకి వస్తామని ధీమా వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్ దిగ్గజాలు ఎన్నికల ఖర్చు విషయంలో సంకోచిస్తున్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు గత రెండు ఎన్నికల్లో ఈ జిల్లా నేతలు పన్నిన వ్యూహాలు బెడిసికొట్టాయి.  2014, 2018 ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రాకపోగా జిల్లాలో వరసగా జరిగిన మూడు ఉప ఎన్నికల్లోనూ పార్టీ ఓడిపోవడంతో సీనియర్లు కంగుతిన్నారు. హుజూర్​నగర్​లో ఉత్తమ్ భార్య మాజీ ఎమ్మెల్యే పద్మావతి పోటీ చేయగా, సాగర్​లో ఏకంగా జానారెడ్డి బరిలో దిగి నప్పటికీ ఫలితం దక్కలేదు. గతేడాది చివర్లో జరిగిన మునుగోడు ఎన్నికల్లో అయితే జిల్లా సీనియర్లు అందరు ఏకతాటి పైకొచ్చి పనిచేసినా గెలుపు మాత్రం దక్కలేదు. ఇక్కడ ఫస్ట్ ప్లేస్​లో ఉన్న కాంగ్రెస్ మూడోస్థానానికి పడిపోయింది. ఈ ఎన్నికల్లో ఎదురైన చేదు అనుభవాల దృష్ట్యా వచ్చే ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రావాలంటే ప్రభుత్వ వ్యతిరేకత ఒక్కటే సరిపోదని, అంతకుమించి డబ్బు ఖర్చు పెట్టాల్సి వస్తదని సీనియర్లు అభిప్రాయపడుతున్నారు.

రూ.50 కోట్లు పెట్టాల్సిందే!

ఈసారి నియోజకవర్గానికి కనీసం రూ.50 కోట్ల వరకు పెట్టాల్సి వస్తుందని లీడర్లు అంచనా వేస్తున్నారు. సీనియర్లు రెండేసి నియోజకవర్గాల పైన కన్నేశారు. భార్యాభర్తలు, తండ్రీకొడుకులు, సీనియర్లు.. వాళ్ల అనుచరుల కలిపి తలా రెండేసి టికెట్లు కోసం పట్టుబడుతున్నారు. రెండు నియోజకవర్గాలకు కలిపి రూ.100 కోట్లు దాటొచ్చని లెక్కలేశారు. ఈ క్రమంలో ఆర్థిక వనరులు సమకూర్చుకునే పనిలో పడిపోయారు.

ఇప్పటి నుంచే జనంలోకి వెళ్తే..

ఎన్నికల వరకు వేచిచూడకుండా ఇప్పటి నుంచే జనంలోకి వెళ్తే ఖర్చు కొంత తగ్గుతుందని  పలువురు సీనియర్లు భావిస్తున్నారు. దీనిలో భాగంగా కోదాడ, హుజూర్​నగర్​లో పీసీసీ మాజీ చీఫ్, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆయన సతీమణి పద్మావతి ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. ప్రభుత్వ వ్యతిరేకత వినిపించడంతో పాటు, బూత్​ల వారీగా పక్కా ప్రణాళి క రూపొందిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో  50 వేల మెజార్టీ తగ్గితే రాజకీయాల నుంచి తప్పుకుంటానని చాలెంజ్ చేసిన ఉత్తమ్ ఆ దిశగా రెండు నియోజకవర్గాల్లో తనదైన శైలిలో ప్రచారానికి పదును పెట్టారు. మరోవైపు జానారెడ్డి కొడుకులు సాగర్, మిర్యాలగూడలో ప్రజల మధ్యనే గడిపేందుకే ఇంట్రెస్ట్​ చూపుతు న్నారు. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాత్రం తెరవెనక రాజకీయాలకే ఎక్కువ ప్రియారిటీ ఇస్తున్నట్లు తెలుస్తోంది. నకిరేకల్, నల్గొండలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను దెబ్బ కొట్టేందుకు గతానికి భిన్నంగా కొత్త పంథాల్లో ఎన్నికల వ్యూహాన్ని రూపొందిస్తన్నట్లు సమాచారం.

నయా లీడర్ల దూకుడు

వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా రాజకీయ అరంగ్రేటం చే యాలని ఆశిస్తున్న ఆశావహులు దూకుడు పెంచారు. కర్నాటక ఎన్నికల ఫలితాలు వారిలో జోష్ నింపారు.ఎమ్మెల్యే సీటు వస్తదన్న నమ్మకంతోనే పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇచ్చిన మాటకు కట్టుబడి పార్టీ ఖర్చులు భరిస్తున్నామని చెబుతున్నారు. ఇటీవల నల్గొండలో జరిగిన నిరుద్యోగ సభ, హైదరాబాద్​లో జరిగిన ప్రియాంక గాంధీ మీటింగ్​లకు ఖర్చు అంతా నయాలీడర్లే భరించారు. రేవంత్ ఇచ్చిన టార్గెట్ మేరకు ఈ రెండు మీటింగ్​లకే ఒక్కో లీడర్ రూ.20 లక్షల వరకు ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది. నకిరేకల్, ఆలేరు, సూర్యాపేట,  మును గోడు, మిర్యాలగూడలో ఆశావహులు ఖర్చుకు వెనకాడటం లేదు. కానీ సీట్ల పంపకాలప్పుడు సీనియర్లు అడ్డు తగిలి తమకు టికెట్ రాకపోతే పరిస్థితి ఏంటనే టెన్షన్  పడుతున్నారు.