
- మామునూరు ఎయిర్‍పోర్ట్ భూ సేకరణకు ఆటంకాలు
- కావాల్సిన భూమి 253 ఎకరాలు
- ఎకరాకి రూ.55 –60 లక్షలు ఇస్తామంటున్న ఆఫీసర్లు
- ఎకరాకి రూ.2 కోట్లు డిమాండ్ చేస్తున్న నిర్వాసితులు
- భూములకు హద్దులు నిర్ణయించి ఆగిన సర్వే సిబ్బంది
వరంగల్, వెలుగు: వరంగల్ మామునూర్ ఎయిర్‌పోర్ట్‌కు కావాల్సిన భూములను రైతులు, ప్లాట్ల యజమానులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నా, ధరల విషయంలో జాప్యం జరుగుతోంది. ఎయిర్‍పోర్ట్ నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా, భూసేకరణకు అవసరమైన నిధులను రాష్ర్ట ప్రభుత్వం మంజూరు చేసినా వ్యవహారం మాత్రం ముందుకు సాగడం లేదు. తమ భూములకు మార్కెట్ రేటు కట్టియ్యాలని నిర్వాసితులు, ప్రభుత్వ ధరల ప్రకారం ఇస్తామని అధికారులు చెబుతున్నారు. నిర్వాసితులతో సమావేశం నిర్వహించామని రైతులకు న్యాయం జరిగేలా చూస్తామని, వారిని ఒప్పించామని ప్రజాప్రతినిధులు చెబుతున్నారు. కానీ, ఆరు నెలలు గడుస్తున్నా రైతుల భూములకు రేటెంత అన్నది మాత్రం ఇప్పటి వరకు చెప్పలేదు.
రూ.205 కోట్లు మంజూరు.. జీఎంఆర్ ఎన్ఓసీ క్లియర్
మామునూర్ ఎయిర్‍పోర్ట్ విస్తరణకు ప్రధానంగా అడ్డంకిగా ఉన్న జీఎంఆర్ సంస్థతో అక్రగిమెంట్ సమస్యను ప్రభుత్వం క్లియర్ చేసింది. ఎయిర్‍పోర్ట్ పున:ప్రారంభానికి 949.14 ఎకరాల భూములు అవసరమవగా 696.14 ఎకరాలు ఎయిర్‍పోర్ట్ పరిధిలో ఉన్నాయి. అభివృద్ధికి మరో 280.30 ఎకరాల భూమి అవసరమని ఆఫీసర్లు తెలిపారు. ఇందులో 27.3 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉండగా, మిగతా 253 ఎకరాలను సేకరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
253 ఎకరాల భూములిచ్చే రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఏకకాలంలో పరిహారం ఇవ్వడానికి రూ.205 కోట్లు మంజూరు చేస్తూ గతేడాది నవంబర్ 17న ఉత్తర్వులిచ్చింది. జీఎంఆర్ సంస్థ ఇచ్చిన ఎన్ఓసీ ఆధారంగా ఫిబ్రవరి 28న కేంద్ర ప్రభుత్వం వరంగల్ కేంద్రంగా మామునూర్ ఎయిర్‍పోర్ట్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 223 మంది రైతుల నుంచి 253 ఎకరాల భూ సేకరణను త్వరగా చేపట్టాలని సూచించింది.
రైతులతో మంత్రి, ఎమ్మెల్యేల మీటింగ్..
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలో భాగంగా మామునూర్ ఎయిర్‍పోర్ట్ పున:ప్రారంభానికి ప్రత్యేక చొరవ చూపింది. ఓవైపు జీఎంఆర్, మరోవైపు కేంద్రంతో సంప్రదింపులు జరుపుతూనే రైతుల నుంచి భూ సేకరణపై ప్రత్యేక దృష్టి పెట్టింది. సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలతో జిల్లా మంత్రి కొండా సురేఖ, ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాశ్‌రెడ్డి, కేఆర్ నాగరాజు నవంబర్ 8న భూనిర్వాసితులతో మీటింగ్ పెట్టి, ఎయిర్‍పోర్ట్ అభివృద్ధికి రైతులు భూములిచ్చేలా ఒప్పించామన్నారు. అనంతరం ఎమ్మెల్యే రేవూరి రైతులతో పలుమార్లు సమావేశమయ్యారు.
రైతులు కోట్లల్లో.. ఆఫీసర్లు లక్షల్లో..
ఎయిర్‍పోర్ట్ భూముల సమస్యకు నెలలు గడుస్తున్నా పరిష్కారం దొరకడం లేదు. ఎకరానికి ఎంత ధర కట్టిస్తారో ఇప్పటికీ ఫైనల్ చేయలేదు. మార్చి 4న సర్వే కోసం వెళ్లిన ఆర్డీవో సత్యపాల్‌రెడ్డి, తహసీల్దార్ నాగేశ్వరరావు బృందాన్ని రైతులు, కుటుంబ సభ్యులతో కలిసి అడ్డుకున్నారు. రోడ్లపై ఆందోళనకు దిగారు. సరైన నష్టపరిహారంతోపాటు ఊర్లకు ప్రధాన రోడ్డు, ఇతర సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి రైతులతో సమావేశమై న్యాయం చేస్తామని చెప్పడంతో సర్వే చేయడానికి అనుమతిచ్చారు. ఆ తర్వాత రెండు, మూడుసార్లు కలెక్టర్ ఆధ్వర్యంలో అధికారులు రైతులతో సమావేశమయ్యారు.
రైతులు తమ భూములకు ఎకరానికి రూ.2 నుంచి 3 కోట్లు, ప్రభుత్వ ఉద్యోగం, ప్లాట్లు కేటాయించాలని డిమాండ్ చేస్తుండగా, ఆర్డీవో, అడిషనల్ కలెక్టర్ స్థాయిలో మీటింగ్ కు వస్తున్న అధికారులు రూ.25 లక్షల దగ్గర మొదలుపెట్టి ఎకరానికి రూ.55 నుంచి 60 లక్షల వరకు పెంచారు. ఈ రేటును రైతులు, ప్లాట్ల యజమానులు వ్యతిరేకిస్తూ వరంగల్ కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు. ప్రభుత్వం తమ భూములకు జనరల్ అవార్డు ఎంత ప్రకటిస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ రెవెన్యూ రికార్డుల రేట్లు, మార్కెట్ ధరల్లో ఎంతో వ్యత్యాసం ఉన్న నేపథ్యంలో సరైన నష్టపరిహారం చెల్లించాలని లేనిపక్షంలో పోరాటం తప్పదంటున్నారు.
ఎకరానికి రూ.60 లక్షల ధరేంటి..
ఎయిర్‍పోర్ట్ చుట్టూరా ఎక్కడ చూసినా మార్కెట్లో తక్కువలో తక్కువ ఎకరానికి రూ.3 నుంచి 5 కోట్ల ధర పలుకుతోంది. అధికారులేమో రూ.55, 60 లక్షలు కట్టిస్తామంటున్రు. ఏమైనా అంటే రెవెన్యూ రికార్డులు చూపుతున్రు. ఎయిర్‍పోర్ట్ వంటి పెద్ద ప్రాజెక్టులు వచ్చినప్పుడు బాధితుల పక్షాన ఆలోచన చేయాలే కదా. కనీసం ఒక్కో ఎకరానికి రూ.2 కోట్లు చెల్లించాలే. సౌకర్యాలు కల్పించాలి.
తారగల ప్రసాద్, దూపకుంట