- రెండ్రోజుల్లో 4 రాష్ట్రాలు అతలాకుతలం
- కరెంటు లేక వందలాది కౌంటీల్లో జనాల అవస్థలు
వాషింగ్టన్: హరికేన్ తుఫాన్ అమెరికాలో రెండ్రోజులుగా బీభత్సం సృష్టిస్తోంది. ఫ్లోరిడా, జార్జియా, కరోలినా, టెనస్సీ రాష్ట్రాలను అతలాకుతలం చేసింది. తుఫాన్ ఎఫెక్టుతో ఇప్పటివరకు 4 రాష్ట్రాల్లో 45 మంది ప్రాణాలు కోల్పోయారు. చనిపోయినవారిలో ఒక్క కరోలినాలోనే 17 మంది, జార్జియాలో 15, ఫ్లోరిడాలో 8 మంది ఉన్నారు. మృతుల్లో ముగ్గురు రెస్క్యూ టీం సిబ్బందితోపాటు ఓ చంటిబిడ్డ కూడా ఉన్నారు. వరద ప్రభావంతో కరెంటు లేక లక్షలాదిమంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ రాష్ట్రాల్లోని స్కూళ్లు, కాలేజీల, యూనిర్సిటీలకు సెలవులు ప్రకటించారు. పలు విమానాలు రద్దయ్యాయి. అనేక ఇండ్లు నీట మునిగాయి.
ఫ్లోరిడాపై తీవ్ర ప్రభావం
తుఫాన్ ఎఫెక్టు ఫ్లోరిడా రాష్ట్రంపై తీవ్రంగా పడిందని అధికారులు తెలిపారు. టెనస్సీ రాష్ట్రం నుంచి 7 వేల మందిని ఇతర ప్రాంతాలకు తరలించారు. ఎర్విన్ సిటీలోని ఓ ఆస్పత్రిని వరద ముంచెత్తడంతో రెస్క్యూ టీమ్స్ హెలికాప్టర్ సాయంతో 58 మంది పేషెంట్లను కాపాడాయి. అట్లాంటాలో రెండ్రోజుల్లో 28 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డయింది. బలమైన గాలులు వీస్తుండటంతో ఒక్క ఫ్లోరిడాలోనే 10 లక్షల వ్యాపార సముదాయాలకు కరెంటు కట్ అయింది. జార్జియా, కరోలినాలోనూ చాలా ప్రాంతాల్లో కరెంటు లేక జనాలు అవస్థలు పడుతున్నారు.
225 కిలోమీటర్ల వేగంతో గాలులు
గల్ఫ్ ఆఫ్ మెక్సికో తీరం నుంచి అమెరికాలోకి ఎంటరైన హరికేన్ తుఫాన్ మొదట ఫ్లోరిడా.. ఆపై జార్జియా, టెనస్సీ, కరోలినా రాష్ట్రాలను తాకింది. తుఫాన్ శనివారం ఫ్లోరిడా తీరం దాటేటప్పుడు 225 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయని అధికారులు తెలిపారు. సముద్రపు అలలు 20 అడుగుల ఎత్తుకుపైగా ఎగసిపడుతున్నాయన్నారు.