కూతురి పెండ్లి, వ్యవసాయం కోసం అప్పులు.. తీర్చేదారి లేక భార్యాభర్త ఆత్మహత్య

కూతురి పెండ్లి, వ్యవసాయం కోసం అప్పులు.. తీర్చేదారి లేక  భార్యాభర్త ఆత్మహత్య
  • కూతురు పెండ్లి, వ్యవసాయం కోసం అప్పులు.. తీర్చే దారి లేక సంసారంలో గొడవలు  
  • ఆవేశంలో పురుగుల మందు తాగిన భార్య.. బతికి 
  • ఏం చేయాలంటూ మిగిలిన మందు తాగి భర్త సూసైడ్ 
  • వికారాబాద్ జిల్లా నాగసముందర్​లో ఘటన

 వికారాబాద్, వెలుగు: కూతురు పెండ్లి, వ్యవసాయం కోసం చేసిన అప్పులు భార్యాభర్తల ప్రాణాలు తీశాయి. చేసిన అప్పులు తీర్చే మార్గం లేక.. వాటికి సంసారంలో గొడవలు తోడై.. ఆవేశంలో ఒకరితర్వాత ఒకరు పురుగు మందు తాగి సూసైడ్​చేసుకున్నారు. వికారాబాద్​జిల్లా యాలాల మండలం నాగసముందర్ గ్రామంలో ఆదివారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మాసుల యాదప్ప(42), జ్యోతి (38) వ్యవసాయ కూలీలు. వీరికి కూతురు, కొడుకు ఉన్నారు. రెండేండ్ల కిందట కూతురు పెండ్లి కోసం అప్పులు చేశారు. 

అంతకుముందు ఇల్లు కట్టడానికి కూడా కొంత అప్పు తీసుకువచ్చారు. కొంత వ్యవసాయ భూమి ఉండడంతో సాగు కోసం కూడా అప్పులు తీసుకున్నారు. అయితే, దిగుబడి సరిగా రాక, తెచ్చిన అప్పులు తీర్చే దారి లేక, అప్పులు ఇచ్చిన వాళ్లు అడుగుతుండడంతో మనోవేదనకు గురయ్యారు. దీనికి తోడు వారి సంసారంలో కూడా గొడవలు మొదలయ్యాయి. శనివారం రాత్రి భార్యాభర్తలిద్దరూ ఈ విషయమై గొడవపడ్డారు. ఆదివారం ఉదయం కూడా గొడవ జరగడంతో ఇంట్లో ఉన్న పురుగుల మందును భార్య జ్యోతి తాగింది. అయితే, నువ్వు లేకుండా నేను బతికి ఏం చేయాలి అంటూ భర్త యాదప్ప కూడా మిగిలిన పురుగుల మందు తాగాడు. గమనించిన గ్రామస్తులు వెంటనే తాండూరులోని జిల్లా ప్రభుత్వ దవాఖానకు తరలించారు. అయితే, వారు అప్పటికే చనిపోయారని డాక్టర్లు నిర్ధారించారు. యాలాల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.