యాక్సిడెంట్​లో భార్యాభర్తలు మృతి

  • మరో ఐదుగురికి గాయాలు 
  • మెదక్​ జిల్లా మహ్మద్​నగర్ గేట్ ​వద్ద ప్రమాదం

మెదక్​ (కౌడిపల్లి), వెలుగు : మెదక్​ జిల్లా కౌడిపల్లి మండలం మహ్మద్​ నగర్​ గేట్​ వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గుడికి వెళ్లొస్తున్న భార్యాభర్తలు చనిపోయారు. పోలీసుల కథనం ప్రకారం... హైదరాబాద్ శివార్లలోని సూరారం సాయిబాబా నగర్ కాలనీకి చెందిన దంపతులు నాగలింగం రాజు (36), రమ (33) కుటుంబ సమేతంగా మెదక్ జిల్లాలోని ఏడుపాయలకు టాటా ఏస్ ​వెహికిల్​లో వచ్చారు. దర్శనం తర్వాత ఇంటికి వెళ్తున్న క్రమంలో మెదక్ –హైదరాబాద్ ​-నేషనల్​ హైవేపై మహ్మద్​నగర్ ​గేట్​దగ్గర లారీని ఓవర్​టేక్ చేయబోతూ ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టారు. దీంతో ఆటోలోని భార్యభర్తలు నాగలింగం రాజు, రమ అక్కడికక్కడే మృతి చెందారు.

ఆటోలో ఉన్న వారి కూతుళ్లు వెంకటలక్ష్మి, అమృత, వైశాలి, బంధువుల అమ్మాయి అవంతిక, పేరు తెలియని మరో మహిళ  గాయపడ్డారు. అవంతిక పరిస్థితి సీరియస్​గా ఉండడంతో నర్సాపూర్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. తూప్రాన్ ​డీఎస్పీ యాదగిరి రెడ్డి, నర్సాపూర్ ​సీఐ షేక్​లాల్ ​మదార్, కౌడిపల్లి ఎస్సై శివప్రసాద్​ రెడ్డి స్థానికుల సహకారంతో ఆటోలో ఇరుక్కుపోయిన డెడ్​బాడీలను తీయించారు. కౌడిపల్లి మండల బీజేపీ అధ్యక్షుడు రాకేష్​ వీరికి సహకరించారు. రాష్ట్ర మహిళా కమిషన్​ చైర్​పర్సన్​ సునీతా లక్ష్మారెడ్డి, నర్సాపూర్ మున్సిపల్​ చైర్మెన్​ మురళి బాధితులను పరామర్శించారు.