కోడలు పట్టించుకుంట లేదని.. అత్త,మామ ఆత్మహత్యాయత్నం

  • కొడుకు చనిపోవడంతో కోడలికి సర్కార్ నౌకరి
  • నెలకు రూ. 5 వేలు ఇచ్చేలా ఒప్పందం 
  • డబ్బులివ్వకపోవడంతో సూర్యాపేట కలెక్టరేట్​ వద్ద సూసైడ్ ​అటెంప్ట్​ 

సూర్యాపేట, వెలుగు: ప్రభుత్వ ఉద్యోగి అయిన కొడుకు చనిపోవడంతో అతడి జాబ్ తీసుకున్న కోడలు తమను పట్టించుకోవడం లేదని అత్తమామలు పురుగుల మందు తాగేందుకు యత్నించారు. అక్కడే ఉన్న పోలీసులు అడ్డుకోవడంతో ముప్పు తప్పింది. ఈ ఘటన సూర్యాపేట కలెక్టరేట్ ఎదుట సోమవారం జరిగింది. మునగాల మండల కేంద్రానికి చెందిన పిడమర్తి వెంకన్న, ఎలిషమ్మల ఒక్కగానొక్క కొడుకు చిరంజీవి. పోలీస్ ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్​లో అప్పటి సీఎం కేసీఆర్ దగ్గర పని చేశాడు. 2022లో జరిగిన ఓ యాక్సిడెంట్ లో చనిపోయాడు. దీంతో ప్రభుత్వం ఇచ్చిన డబ్బులను ఇద్దరు మనవరాళ్లకు ఇచ్చి, డీజీపీ ఆఫీస్ లో జూనియర్ అసిస్టెంట్​గా వచ్చిన ఉద్యోగాన్ని కోడలు రజనీకి ఇచ్చేందుకు అంగీకరించారు. ఇందుకు గాను రజని ప్రతి నెలా రూ. 5 వేలు వెంకన్న, ఎలిషమ్మ దంపతులకు ఇవ్వాలని పెద్దమనుషులు తీర్మానం చేశారు. 

అయితే, తమ కోడలు డబ్బులు ఇవ్వకపోగా మనవరాళ్లను సైతం చూడనివ్వడం లేదంటూ సోమవారం సూర్యాపేట కలెక్టరేట్ వద్దకు వచ్చి పురుగుల మందు తాగేందుకు ప్రయత్నించారు. అక్కడే డ్యూటీలో ఉన్న లేడీ కానిస్టేబుల్​ గమనించి అడ్డుకుంది. డబ్బా లాక్కొని కలెక్టర్ వెంకట్ రావు వద్దకు తీసుకెళ్లారు. దీంతో ఆయన ఎంక్వైరీ చేయాలని స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆఫీసర్ వెంకటరమణను, బరాకత్ గూడెంలో రజని పేరున ఉన్న ఫంక్షన్ హాల్ స్వాధీనం చేసుకోవాలని మునగాల తహసీల్దార్ ను ఆదేశించారు.

పట్టా భూమిని సర్కార్ భూమిగా మార్చారంటూ...

గద్వాల: పట్టా భూమిని సర్కార్ భూమిగా మార్చారంటూ జోగులాంబ కలెక్టరేట్ వద్ద సోమవారం ఓ మహిళ ఆత్మహత్యకు యత్నించింది. వడ్డేపల్లి మండలం రామాపురం గ్రామానికి చెందిన గోకారి బీకి అదే గ్రామంలోని సర్వే నంబర్ 416లో ఎకరం భూమి ఉంది. దాన్ని ప్రభుత్వ భూమిగా రికార్డుల్లోకి ఎక్కించారని, మార్చాలంటూ పలుమార్లు తహసీల్దార్, అడిషనల్ కలెక్టర్ ఆఫీసుల చుట్టూ తిరిగినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేసింది. సమస్యను పరిష్కరించాలంటూ సోమవారం కలెక్టరేట్​లోని అడిషనల్ కలెక్టర్ ఛాంబర్ ఎదుట పురుగుల మందు తాగేందుకు ప్రయత్నించింది. గమనించిన పోలీసులు అడ్డుకున్నారు. న్యాయం చేస్తామని హామీ ఇచ్చి ఇంటికి పంపించారు. 

బిల్లులు చెల్లించాలని మన్నెంపల్లి మాజీ సర్పంచ్..

తిమ్మాపూర్: గత ప్రభుత్వ హయాంలో చేసిన పనులకు బిల్లులు చెల్లించాలని డిమాండ్​ చేస్తూ కరీంనగర్‌‌ జిల్లా తిమ్మాపూర్ ​మండలం మన్నెంపల్లి మాజీ సర్పంచ్‌ మేడి అంజయ్య సోమవారం ఎంపీడీవో ఆఫీస్‌ ఎదుట పురుగుల మందు తాగేందుకు యత్నించాడు. ప్లకార్డు, పురుగుల మందు డబ్బాతో ఎంపీడీవో ఆఫీస్‌ ఆవరణలోకి వెళ్లాలని చూడగా పోలీసులు అడ్డుకున్నారు. బాధితుడు 
మాట్లాడుతూ తన భార్య పుస్తెలతాడు కుదువపెట్టి గ్రామంలో పనులు చేశానని, అన్ని పనులకు సంబంధించి సుమారు రూ.40 లక్షలు రావాలన్నాడు. గత ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో అప్పుల పాలయ్యాయని, కాంగ్రెస్ సర్కార్‌‌ అయినా పెండింగ్​ బిల్లులు మంజూరు చేయాలని కోరాడు. పోలీసులు అతడిని పీఎస్​కు తరలించి కౌన్సిలింగ్​ ఇచ్చి పంపించారు.