
- పందులు పట్టే క్రమంలో ప్రమాదం
- నిజామాబాద్ జిల్లాలో ఘటన
బోధన్/నిజామాబాద్, వెలుగు: కనిపించకుండాపోయిన పెంపుడు పందులను పట్టేందుకు వరి పొలంలో దిగిన భార్యాభర్త, కొడుకు కరెంటు షాక్‌తో చనిపోయారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం పెగడాపల్లి గ్రామంలో గురువారం చోటు చేసుకున్నదని రూరల్ సీఐ విజయ్ బాబు తెలిపారు. రెంజల్ మండలం సాటాపూర్ గ్రామానికి చెందిన ఒరుసు గంగారాం.. పందుల పెంపకంతో ఉపాధి పొందుతున్నాడు. మంద నుంచి 2 పందులు రెండు రోజుల కింద మిస్ అయ్యాయి. వాటి కోసం గంగారాం వెతుకుతున్నాడు. రెండు పందులు పెగడాపల్లి-, చిన్నమావంది గ్రామాల మధ్య ఉన్న వరి పొలాల్లో తిరుగుతున్నట్లు గుర్తించారు.
వాటిని పట్టుకునేందుకు గురువారం ఉదయం 6 గంటల ప్రాంతంలో మూడు బైక్‌లపై గంగారాం, అతని భార్య బాలమణి, పెద్ద కొడుకు కిషన్, తమ్ముడి కొడుకు ప్రవీణ్, బామ్మర్ది గంగారాంతో కలిసి వెళ్లాడు. పందులు ఉన్నట్లు గుర్తించిన ఒరుసు గంగారాం.. వరి పొలం చుట్టూ జాలి కట్టాడు. బామ్మర్ది గంగారాం, తమ్ముడి కొడుకు ప్రవీణ్‌ను అక్కడ పెట్టాడు. జాలిలో చిక్కుకునేలా పందులను వెనుక నుంచి తరుముతూ వెళ్తున్నప్పుడు మనిషి ఎత్తులో వేలాడుతున్న త్రీఫేస్ కరెంట్ వైర్.. ఒరుసు గంగారాం (45)కు తగలడంతో కిందపడిపోయాడు.
గంగారాంను కాపాడే ప్రయత్నంలో భార్య బాలమణి (42), కొడుకు కిషన్ (22) కరెంట్ షాక్‌కు గురవ్వడంతో స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయారు. ఇది గమనించిన బామ్మర్ది గంగారాం, తమ్ముడి కొడుకు ప్రవీణ్ భయంతో పొలం నుంచి బయటికి వచ్చారు. పెగడాపల్లికి వెళ్లి ఘటన గురించి చెప్పారు. అప్పటికే పొలం యజమాని ప్రకాశ్ రావు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. మృతుడి రెండో భార్య, వారి ఇద్దరి పిల్లలు, బంధువులు ఆందోళనకు దిగారు.
ప్రకాశ్ రావు చెప్తేనే పందులు పట్టేందుకు వచ్చారని, నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రూరల్ సీఐ విజయ్‌బాబు, ఎస్సై మచ్చేందర్ రెడ్డి బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడి శాంతింపజేశారు. ముగ్గురి డెడ్‌బాడీలను పోస్టుమార్టం కోసం నిజామాబాద్ జీజీహెచ్ హాస్పిట్‌కు తరలించారు. ఒరుసు గంగారం కూతురు యశోద ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.