- 20 రోజుల తర్వాత పోలీసులకు లొంగిపోయిన భార్యాభర్తలు
పద్మారావునగర్, వెలుగు : చిట్టీల పేరుతో రూ.11 కోట్లు వసూలు చేసి పరారైన భార్యాభర్తలు మంగళవారం వారాసిగూడ పోలీసులకు లొంగిపోయారు. స్థానిక బాపూజీనగర్ కు చెందిన చిన్నాల అమరేందర్యాదవ్ (53), సబిత (49) దంపతులు 20 ఏండ్లుగా చిట్టీల వ్యాపారం నిర్వహిస్తున్నారు. 144 మంది నుంచి దాదాపు రూ.11కోట్లు వసూలు చేశారు. అయితే కొంతకాలంగా చిట్టీ పాడిన వారికి పైసలు చెల్లించకుండా అమరేందర్ యాదవ్ సతాయిస్తున్నాడు. దసరా పండుగ తర్వాత రోజు నుంచి భార్యతో కలిసి కనిపించకుండా పోయాడు.
విషయం తెలుసుకున్న బాధితులు ఇటీవల సీసీఎస్ ను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. కొన్నిరోజుల తర్వాత బాధితులకు అమరేందర్ ఐపీ నోటీసులు పంపించాడు. కాగా అమరేందర్, సబిత దంపతులు మంగళవారం వారాసిగూడ పోలీస్ స్టేషన్ కు వచ్చి లొంగిపోయారు. బాధితులు స్టేషన్ వద్దకు వచ్చి ఆందోళన చేపట్టారు. తనకు రూ.22 లక్షలు రావాల్సి ఉందని శ్యామ్ అనే బాధితుడు వాపోయాడు. పలువురు మహిళలు కన్నీంటి పర్యంతమయ్యారు. కేసును సీసీఎస్ కు బదిలీ చేసినట్లు పోలీసులు తెలిపారు.