
కూకట్పల్లి, వెలుగు: చైన్ స్నాచింగ్ పేరుతో పోలీసులను బురిడీ కొట్టించాలని భార్యాభర్తలు చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. విచారణలో అసలు నిజం బయటపడడంతో నిందితులు కటకటాల పాలయ్యే పరిస్థితి ఏర్పడింది. మెదక్ జిల్లా వల్లూరు గ్రామానికి చెందిన ముక్కెర భాగ్యమ్మ (45), అంజయ్య (50) దంపతులు. సిటీకి వచ్చి కేపీహెచ్బీ పరిధిలోని వసంతనగర్ కాలనీలో ఉంటున్నారు. వీరు ముందుగా వేసుకున్న ప్లాన్ లో భాగంగా బుధవారం మధ్యాహ్నం భాగ్యమ్మ బయటకు వెళ్లి తిరిగి వస్తుండగా, ఆమె భర్త అంజయ్య వెనుక నుంచి వచ్చి ఆమె మెడలోని పుస్తెలతాడు లాక్కుని పరారయ్యాడు.
ఆ తర్వాత ఏమీ ఎరుగనట్లు పీఎస్కు వెళ్లి, గుర్తు తెలియని యువకుడు చైన్ స్నాచింగ్ పాల్పడ్డాడని ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు విచారణ చేపట్టారు. సీసీ కెమెరాల పరిశీలనతో పాటు భార్యాభర్తలను విచారించగా అసలు విషయం బయటపడింది. రికవరీ సొమ్ముకు ఆశపడి భార్యాభర్తలు కలిసే చైన్ స్నాచింగ్ నాటకం ఆడారని పోలీసులు గుర్తించారు. అంజయ్యను అదుపులోకి తీసుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు.