ఇద్దరు పిల్లలకు ఉరేసి తల్లి ఆత్మహత్య

ఇద్దరు పిల్లలకు ఉరేసి తల్లి ఆత్మహత్య
  •     చోరీ కేసులో భర్తను తీసుకెళ్లిన పోలీసులు
  •     అవమానభారంతో పిల్లలతో కలిసి బలవన్మరణం.. ఖమ్మం జిల్లాలో ఘటన

ఎర్రుపాలెం/మధిర, వెలుగు :  చైన్ స్నాచింగ్, చోరీ కేసుల్లో భర్తను పోలీసులు అరెస్ట్ చేయడంతో అవమానం భరించలేక పిల్లలను చంపి, భార్య కూడా ఆత్మహత్య చేసుకున్నది. ఈ ఘటన ఖమ్మం జిల్లా మధిర మండలం నిదానపురంలో గురువారం చోటు చేసుకున్నది. నిదానపురానికి చెందిన షేక్ బాజీ.. ఖమ్మంలోని ఓ టూవీలర్ ఫైనాన్స్ కంపెనీలో పనిచేస్తున్నాడు.

అతనిపై ఖమ్మం నగరంలోని వన్ టౌన్, టూటౌన్, అర్బన్ పోలీస్ స్టేషన్లలో దాదాపు 10 వరకు బైక్, సెల్ ఫోన్​ చోరీ కేసులున్నాయి. రైల్వే పోలీసులు కూడా గతంలో ఓ కేసులో అరెస్ట్ చేసినట్టు సమాచారం. ఇటీవల ఖమ్మం అర్బన్ పోలీస్​ స్టేషన్ పరిధిలో వరుసగా మూడు చైన్ స్నాచింగ్​లు జరిగాయి. దీంతో షేక్ బాజీని బుధవారం ఖమ్మం సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎంక్వైరీలో భాగంగా నిదానపురం వెళ్లిన పోలీసులు.. అతని ఇంటి నుంచి చోరీ చేసిన కొంత బంగారం, సెల్ ఫోన్లను రికవరీ చేశారు. ఎంక్వైరీకి రావాల్సి ఉంటుందని బాజీ భార్య ప్రేజా (35)కు పోలీసులు చెప్పారు. 

Also Read :- జీహెచ్ఎంసీ ఆఫీసర్లు మా ఫోన్లు ఎత్తట్లే..

దీంతో ఆమె అవమానంగా భావించి, పోలీసులు వెళ్లాక బుధవారం రాత్రి చీరతో ఇద్దరు బిడ్డలు మెహెక్ (6), మెనురూల్ (7)కు ఉరివేసి చంపేసింది. తర్వాత తానూ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నది. గురువారం ఉదయం ఇంటి నుంచి ఎవరూ బయటకు రాకపోవడంతో స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. లోపలికెళ్లి చూడగా ముగ్గురు చనిపోయి ఉన్నారు. వీరి డెడ్​బాడీలను పోస్టుమార్టం కోసం మధిర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మధు తెలిపారు. 

భర్త చోరీలు చేస్తుండటంతో ఇద్దరి మధ్య తరుచూ గొడవలు జరుగుతుండేవని పోలీసులు వివరించారు. దొంగతనాలు మానకపోతే పిల్లలతో ఇంటి నుంచి వెళ్లిపోతానని కూడా బాజీకి ప్రేజా చెప్పినట్లు తెలిపారు. అయినప్పటికీ అవేమీ పట్టించుకోకుండా చోరీలకు పాల్పడుతూ.. తాగి ఇంట్లో గొడవ చేస్తుండటంతో తన ఇద్దరు పిల్లలతో కలిసి ప్రేజా సూసైడ్ చేసుకున్నట్లు వివరించారు.