- నిజామాబాద్ జిల్లాలో ప్రియుడితో కలిసి భర్త మర్డర్
- రూ.50 లక్షలు క్లయిమ్ చేసుకోవాలని స్కెచ్
- వీడిన సోమారం మర్డర్ మిస్టరీ
తాడ్వాయి, వెలుగు: ఈ నెల 21న నిజామాబాద్ జిల్లా సోమారం శివారులో జరిగిన మర్డర్ మిస్టరీని పోలీసులు ఛేదించారు. మంగళవారం ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాసులు వివరాలు వెల్లడించారు. తాడ్వాయి మండల కేంద్రానికి చెందిన ముదాం శంకర్ భార్య లక్ష్మికి, అదే గ్రామానికి చెందిన సుర్కంటి మనోహర్‌రెడ్డికి వివాహేతర సంబంధం ఉంది. శంకర్ తరచూ తాగొచ్చి భార్యతో గొడవపడేవాడు. దీంతో భర్త అడ్డు తొలగించుకోవాలని లక్ష్మి..తన ప్రియుడు మనోహర్ రెడ్డితో కలిసి మర్డర్‌కు స్కెచ్వేసింది.
దీనికి ముందు మనోహరెడ్డి నాలుగు వేర్వేరు కంపెనీల్లో శంకర్ పేరిట ఇన్సూరెన్స్ చేయిం చాడు. రూ.50 లక్షలు క్లెయిమ్ అయ్యేలా ప్లాన్చేశాడు. తర్వాత సోమారం గ్రామానికి చెందిన జింక శ్రీనివాస్ తో కలిసి శంకర్‌ను చంపడానికి రెడీ అయ్యాడు. స్కెచ్‌లో భాగంగా శ్రీనివాస్.. 15 రోజుల కింద శంకర్‌తో పరిచయం పెంచుకున్నాడు. ఈ నెల 21న మద్యం తాగుదామని శంకర్‌ను సోమారం శివారుకు రప్పించాడు. అక్కడ యాదమ్మతో కలిసి శంకర్ తలపై బండరాయితో కొట్టి చంపారు. హైవే పక్క డెడ్‌బాడీ పడేసి, బైక్ యాక్సిడెంట్‌గా చిత్రీకరించారు. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసిన పోలీసులు విచారణలో అది మర్డర్ అని కన్ఫామ్ చేసుకున్నారు.
మృతుడి కాల్ డేటా ఆధారంగా శ్రీనివాస్, అతని భార్య యాదమ్మను అదుపులోకి తీసుకొని విచారించగా, అసలు విషయం బయటపడింది. వెంటనే లక్ష్మిని అరెస్ట్‌చేశారు. పరారీలో ఉన్న మనోహర్ రెడ్డిని మంగళవారం కామారెడ్డి బస్టాండ్ సమీపంలో పట్టుకున్నారు. విచారణలో ప్రతిభ చూపిన సీఐ రామన్, ఎస్సై ఆంజనేయులను డీఎస్పీ అభినందించారు.